
📌 Key Points
- సౌత్ సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఛాంబర్స్ సమావేశం మార్చి 11న బెంగళూరులో జరగనుంది.
- సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనపై చర్చించనున్నారు.
- ప్రస్తుతం 4 వారాలకే ఓటీటీలోకి వస్తుండటంతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
సంక్రాంతి సినిమాల తర్వాత థియేటర్ల వద్ద సినిమాలు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాయి. ఓటీటీలో త్వరగా విడుదల కావడం, పైరసీ ప్రింట్లు అందుబాటులో ఉండటంతో ఫిల్మ్ ఛాంబర్స్ కీలక నిర్ణయం తీసుకోనుంది. మార్చి 11న బెంగళూరులో సమావేశం కానున్నారు.
ఫిల్మ్ ఛాంబర్స్ సమావేశం ఎందుకు?
South Cinema: సంక్రాంతికి వచ్చిన సినిమాల తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేకపోయాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా కేవలం 4 వారాల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేయడంతో.. థియేటర్లకు వెళ్లాలనే ఇంట్రస్ట్ రోజురోజుకూ ప్రేక్షకులలో తగ్గిపోయింది. మరో వైపు సినిమా విడుదలైన రోజే పైరసీ ప్రింట్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో సినిమా మనుగడ చాలా కష్టమైపోతుందని భావించిన సౌత్ సినిమా (South Cinema) ఇండస్ట్రీలకు చెందిన ఫిల్మ్ ఛాంబర్స్ (Film Chambers) అన్నీ కలిసి ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మార్చి 11న బెంగళూరులో సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఫిల్మ్ ఛాంబర్స్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో సినిమా మనుగడకు సంబంధించి, ముఖ్యంగా ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) వ్యవధికి సంబంధించి చర్చలు జరపనున్నారని సమాచారం.
ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆంక్షలు తప్పవా?
వాస్తవానికి థియేటర్స్‌లో సినిమా విడుదలైన 8 వారాల తర్వాత, ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావాలని మొదట్లో సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకున్నవారే తుంగలో తొక్కేశారు. దీంతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా విడుదలైన 4 వారాలకే సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొన్ని సార్లు అయితే 3 వారాలకు, 10 రోజలకు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇలా అయితే, ముందు ముందు అసలు థియేటర్లకు జనాలు వస్తారా? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అందుకే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన ఫిల్మ్ ఛాంబర్ల పెద్దలు ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో మెయిన్‌గా వినిపిస్తున్న అంశం మాత్రం.. సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనపై చర్చ జరిపే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది.
థియేటర్ల వ్యవస్థను కాపాడుకునేందుకు మార్గం?
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం థియేటర్ల వ్యవస్థను కాపాడుకోవడం అనేది అతిపెద్ద సవాలుగా మారింది. ఇలాగే వదిలేస్తే, ముందు ముందు చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందుకే 8 వారాల నిబంధన అనేదే ముఖ్యమైన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతోంది. 4 వారాలకే ఓటీటీలోకి వస్తే.. కలిగే నష్టాలను సమీక్షించడంతో పాటు.. చిన్న సినిమాలకు థియేటర్ల లభ్యత, భారీ సినిమాల వల్ల చిన్న సినిమాలకు కలిగే ఇబ్బందులపై చర్చించనున్నారట. ఇంకా టికెట్ ధరలు, క్యాంటీన్ ధరల నియంత్రణ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్ళీ థియేటర్లకు ఆకర్షించడంతో పాటు పైరసీపై కూడా చర్చ జరపనున్నారని తెలుస్తోంది. నిజంగా ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు సంతోషం అనేలా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా స్పందిస్తుండటం విశేషం.
థియేటర్ల వ్యవస్థను కాపాడుకోవడం కోసం సౌత్ సినిమా ఫిల్మ్ ఛాంబర్స్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.


