
శ్రావణమాసం అనేది అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి మరియు శ్రీకృష్ణుడిని కొలిచే పవిత్ర కాలం. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, గోకులాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు జరుగుతాయి.
Key Points
శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు అనుకూలం.
వరలక్ష్మీ వ్రతం, జంధ్యాల పౌర్ణమి శ్రావణంలోనే.
గోకులాష్టమి, పోలాల అమావాస్య శ్రావణ మాసంలో జరుపుకుంటారు.
వల్లీశ్వరస్వామి దర్శనం కంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
శ్రావణ మాస పర్వదినాలు
అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మినీ… శ్రవణా నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువునూ భక్తిశ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం , వ్రతాలకూ, నోము లకూ ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలూ వస్తాయి. అందుకే దీన్ని అధ్యాత్మిక మాసం గానూ పిలుస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి ని యధాశక్తితో పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలూ, విశేష పూజలతో ఆరాధిస్తూనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి ప్రతాన్ని ఆచరిస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు.
ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనాలు కట్టడమూ సంప్రదాయం. ఈ తిథి నాడే వేదాలను రక్షించేందుకు మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడట. వీటన్నింటితోపాటు శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా వ్యవహరిస్తూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటాం. ఈ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా వ్యవహరిస్తారు అని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లక్ష్మీదేవి పూజలు
కంటిచూపును కాపాడే నీలకంఠుడు
వైద్యనాథుడిగా పేరున్న పరమేశ్వరుడు… వల్లీశ్వరర్ క్షేత్రంలో కంటి చూపును కాపాడే వైద్యుడిగా పూజలు అందుకుంటున్నాడు. వల్లీశ్వరర్ ఆలయం… అయిదు అంతస్తుల గోపురంతో అలరారే క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తుల్లో నేత్ర సమస్యలతో బాదపడే వారే ఎక్కువ చెన్నైలోని మైలాపూర్లో కొలువైన ఈ స్వామిని భక్తితో పూజిస్తే … కోరిన కోర్కెలు తీరడంతోపాటు నేత్ర ఆరోగ్యమూ బావుంటుందని భక్తులే కాదు, కొందరు వైద్యులూ నమ్ముతారు. తమ దగ్గరకు వచ్చే రోగులకు… చికిత్స అందించి, దైవానుగ్రహం కోసం ఈ క్షేత్రానికి వెళ్లమని సూచిస్తారట. వల్లీశ్వరర్ ఆలయంలోని పరమేశ్వరుడిని వానర రాజైన వాలి సైతం పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందాడని అంటారు అని చిలకమర్తి తెలిపారు.
శుక్రుడినీ దర్శించుకోవచ్చు
వల్లీశ్వరస్వామి క్షేత్రం
స్వామి కంటి సమస్యల్ని నివారించే వైద్యుడిగా పూజలు అందుకోవడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. బలి చక్రవర్తి వామనుడికి మూడడుగుల భూమిని దానంగా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు…. అతని గురువైన శుక్రుడు వద్దని వారించాడట. అంతేకాదు, చిన్న కీటకంగా మారి బలి చక్రవర్తి కమండలంలోకి దూరిపోయి… నీరు రాకుండా అడ్డుపడ్డాడట. అప్పుడు వామనుడు దర్భతో శుక్రుడి కన్ను పొడవడంతో అతడి చూపు పోయింది. ఆ తర్వాత శుక్రుడు ఈ ప్రాంతానికి వచ్చి, శివుడిని పూజించి, తిరిగి కంటిచూపును పొందాడనేది కథ.
అప్పటి నుంచీ స్వామి కంటి సమస్యల నుంచి కాపాడే ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామితో పాటుగా సిద్ధి-బుద్ధి సమేతంగా దర్శనమిచ్చే వినాయకుడు, కామాక్షిదేవి, సప్తమాతృకలు, దుర్గాదేవితోపాటు ఇతర దేవతామూర్తుల్నీ దర్శించుకోవచ్చు. అలాగే, స్వామిని పూజిస్తున్న శుక్రుడి విగ్రహాన్నీ చూడొచ్చు. వల్లీశ్వరర్ని పూజిస్తే… శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు పోతాయనీ నమ్ముతారు భక్తులు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
శ్రావణమాసం భక్తి, పూజలతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడిని ఆరాధించి, పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మనసుకు శాంతిని పొందండి.


