
📌 Key Points
- డైరెక్టర్ శ్రీను వైట్ల 7.2 కోట్ల భూ కుంభకోణంలో మోసపోయారు.
- వికారాబాద్‌లో తక్కువ ధరకే భూమి ఇప్పిస్తామని బ్రోకర్లు నమ్మించారు.
- నకిలీ పత్రాలు సృష్టించి శ్రీను వైట్ల నుండి డబ్బులు తీసుకున్నారు.
- శ్రీను వైట్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల భారీ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లాలో 7.2 కోట్ల రూపాయల విలువైన భూమి కొనుగోలులో నకిలీ పత్రాలతో మోసపోయినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
శ్రీను వైట్ల మోసపోయిన తీరు
Sreenu Vaitla Land Scam: రీల్ లైఫ్‌లో విలన్లకి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో స్కెచ్‌లు వేసే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, రియల్ లైఫ్‌లో మాత్రం కేటుగాళ్లు వేసిన ‘రియల్’ స్కెచ్‌కి చిక్కారు. దాదాపు ₹7.2 కోట్ల భారీ భూ కుంభకోణంలో ఆయన మోసపోవడం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ స్కామ్ వెనుక ఉన్న డీటెయిల్స్ చూస్తుంటే.. అచ్చం ఆయన సినిమాల్లో ఉండే ట్విస్టులనే తలపిస్తున్నాయి.
వినిపిస్తున్న సమాచారం ప్రకారం … స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన మేనకోడలు శ్వేతతో కలిసి ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం భూమి కొనాలని ప్లాన్ చేశారట . సరిగ్గా ఇదే గ్యాప్‌లో 2019లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎంట్రీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కడ్మూర్ సమీపంలో అద్భుతమైన ల్యాండ్ ఉందని, తక్కువ ధరకే వస్తుందని నమ్మబలికారు. జెట్టిగారి సుధాకర్ రెడ్డి, కావలి కృష్ణ అనే మధ్యవర్తులు ఈ డీల్‌ని సెట్ చేశారట . నిందితులు జి. ప్రభాకర్ రెడ్డి, మంచంపల్లి ఆనందం సహా పదిమంది గ్యాంగ్‌గా ఏర్పడి, ఆ భూమి తమదేనంటూ నకిలీ పత్రాలను సృష్టించి శ్రీను వైట్లకు చూపించారని సమాచారం.
నకిలీ పత్రాలతో కుంభకోణం
ఇక అవి నిజమైన డాక్యుమెంట్లలాగే ఉండటంతో శ్రీను వైట్ల వాటిని నమ్మి, సుమారు 7.2 కోట్ల రూపాయలను చెల్లించి తన మేనకోడలి పేరు మీద, తన పేరు మీద సేల్ డీడ్లు చేయించుకున్నారట. అయితే, రీసెంట్‌గా ఆ భూములకు సంబంధించి అసలు నిజాలు బయటపడటంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ భూములు అమ్మిన వాళ్లవి కాదని, వేరే వ్యక్తులకు చెందినవని.. కేవలం నకిలీ పత్రాలతో తనను బురిడీ కొట్టించారని తెలుసుకున్నారట శ్రీను వైట్ల.
దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన శ్రీను వైట్ల, వెంటనే హైదరాబాద్ CCS (Central Crime Station) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులు కుట్రపూరితంగా తనను ట్రాప్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరు శ్రీను వైట్ల లాగే ఇంకెవరినైనా బురిడీ కొట్టించారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితులపై సెక్షన్ల వారీగా కేసులు బుక్ అయ్యాయ్యని తెలుస్తుంది.
ఇక శ్రీను వైట్ల అంటేనే తెలుగు ఆడియన్స్‌కి ఒక ఎనర్జీ. ‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’ లాంటి సినిమాలతో కామెడీలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయన, ‘దూకుడు’తో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. అయితే, గత కొన్నేళ్లుగా ఆయనకు కాలం కలిసిరావడం లేదు. ‘ఆగడు’ నుంచి మొదలైన డౌన్ ఫాల్, రీసెంట్‌గా వచ్చిన ‘విశ్వం’ వరకు కొనసాగింది. కెరీర్ లో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని గట్టిగా ట్రై చేస్తున్న టైమ్‌లో, ఇలా ఏడు కోట్లకు పైగా మోసపోవడం ఆయనకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ప్రస్తుతం శ్రీను వైట్ల తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే . శర్వానంద్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఒక క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్‌ను 2027 సంక్రాంతి టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఎన్ని ప్లాపులు వచ్చినా భరించవచ్చు కానీ, రియల్ లైఫ్‌లో ఇలాంటి స్కామ్‌లు జరిగితే తట్టుకోవడం కష్టమే. ఇక ఈ వివాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడాలని, త్వరలోనే తన మార్క్ కామెడీతో రీ-ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్ .చూడాలి మరి నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతున్న ఈ భూ కుంభకోణం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !
ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.


