
📌 Key Points
- పుస్తకాల నుండి సోషల్ మీడియా పోస్ట్‌లకు మారిన జ్ఞాపకాల పంచుకునే విధానం.
- Gen Z యువత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌లో చిన్న కథనాలుగా అనుభవాలు పంచుకుంటున్నారు.
- మెమోయిర్ అంటే ఇప్పుడు వ్యక్తిగత అనుభవాలను డిజిటల్‌గా పంచుకోవడమే.
- ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ బ్రాండ్ ఇమేజ్‌తో సరికొత్త మెమోయిర్‌లను సృష్టిస్తున్నారు.
ఒకప్పుడు పుస్తకాలకే పరిమితమైన జ్ఞాపకాలు, అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సరికొత్త రూపం సంతరించుకున్నాయి. ముఖ్యంగా Gen Z యువత తమ జీవిత విశేషాలను పోస్ట్‌లు, రీల్స్‌గా పంచుకుంటూ ‘Gen Z Memoir’ ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో జ్ఞాపకాల నిర్వచనం ఎలా మారిందో చూద్దాం.
మెమోయిర్ అంటే ఏమిటి? మారిన నిర్వచనం
మధురమైన జ్ఞాపకాలు, మరచిపోలేని ప్రయాణాలు, జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, ఆనందాలు, అనుభవాలు.. ఇలా ఏది ఇతరులతో పంచుకోవాలన్నా ఒకప్పుడు వాటిని కథనాలుగా రాసేవారు, పుస్తకాలుగా ప్రచురించేవారు. ఉదాహరణకు ఆత్మకథలు (Memoirs) ఈ కోవకు చెందినవే. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆ పరిస్థితి క్రమంగా మారిపోతోంది. కారణాలేవైనా.. జీవితంలోని అనుభవాల సారాంశాన్ని పుస్తకాలుగా మలిచే బదులు ఫేస్‌బుక్, థ్రెడ్స్ వంటి వేదికల్లో చిన్న కథనాలుగా చెప్పడానికి.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో స్టోరీలు, రీల్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈతరం ఎక్కువగా ఇష్టపడుతోంది. దీనినే ఇప్పుడు ‘Gen Z Memoir’అని పిలుస్తున్నారు.
నిజానికి ‘మెమోయిర్’ అంటే ఐదారేండ్ల కిందటి వరకు.. వ్యక్తిగత జ్ఞాపకాల ఆధారంగా రాసిన ఒక నాన్-ఫిక్షన్ పుస్తకమో.. లేదంటే సుదీర్ఘమైన రచనో అనుకునేవారు. కానీ ఇప్పుడు దాని అర్థమే మారిపోయింది. జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, అనుభవాలు, అభిప్రాయాలు, అభిరుచులను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే ‘మెమోయిర్’ అని నేటి యువతీ యువకులు భావిస్తున్నారు. చాలామంది ప్రాక్టికల్‌గా అదే చేస్తున్నారు కూడా. ఉదాహరణకు.. ‘‘నా బాల్యం, వివాహ బంధంలోకి అడుగుపెట్టాక సాగుతున్న జీవితం, నేను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి రోజులు, ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కి వెళ్లిన క్షణాలు, హనీమూన్ ట్రిప్ విశేషాలు’’.. ఇలా రకరకాల సందర్భాలను ఆడియో, వీడియో రూపాల్లో లేదా రెండు మూడు పేరాగ్రాఫ్‌ల చిన్న కథనాలుగా డిజిటల్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు.
సోషల్ మీడియాలో Gen Z జ్ఞాపకాలు
ఒకప్పుడైతే ఎక్కడో ఉన్న, మనకు తెలియని వ్యక్తుల రోజువారీ ఆసక్తులు, అభిరుచులు, జీవన విధానం తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీ ఒక్కరి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా మారుతోంది. వ్లాగ్స్ (Vlogs), వీడియోస్, పాడ్‌కాస్ట్‌లు, సబ్‌స్టాక్ ఎస్సేస్ ద్వారా అపరిచితుల జీవితాల్లోని విశేషాలు కూడా మనకు తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ బ్రాండ్ ఇమేజ్‌ను ఉపయోగించి సరికొత్తగా మెమోయిర్స్ క్రియేట్ చేస్తున్నారు. అది వ్యక్తిగత సమస్య అయినా, సామాజిక కోణమైనా, సంతోషమైనా, విషాదమైనా, రాజకీయం, సంస్కృతి.. ఇలా అంశం ఏదైనా సరే ఇన్‌స్టా వేదికగా ఓపెన్ అయిపోతున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా కొత్త ట్రెండ్
ప్రధానంగా వీరిలో జెన్ జీ (Gen Z) యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు, కాలేజీకి వెళ్లినప్పుడు, ఆఫీస్ వాతావరణంలో, ప్రయాణాలు లేదా విహార యాత్రల్లో.. ఇలా ఎప్పుడు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారో, తాము ఎలా ఫీలయ్యారో ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమకు నచ్చిన అంశాల ఆధారంగా, రోజువారీ జీవితానుభవాలను జోడిస్తూ ఆసక్తికరమైన ‘డిజిటల్ మెమోయిర్స్’ క్రియేట్ చేయడంలో జెన్ జీ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది.
సోషల్ మీడియా యుగంలో Gen Z యువత తమ జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకునే విధానాన్ని పూర్తిగా మార్చేశారు. పుస్తకాల నుండి పోస్ట్‌ల వరకు మారిన ఈ ట్రెండ్, ప్రతి ఒక్కరి జీవితాన్ని డిజిటల్‌గా పారదర్శకం చేస్తూ కొత్త చర్చకు దారితీస్తోంది.


