|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు తుది తీర్పులు! సంచలన తీర్పుల వెనుక అసలు నిజాలు!

Published: 13-03-2026, 8:05 AM
కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు తుది తీర్పులు! సంచలన తీర్పుల వెనుక అసలు నిజాలు!
  • సుప్రీంకోర్టు కారుణ్య మరణాలకు కొన్ని కేసుల్లో అనుమతిచ్చింది.
  • గౌరవంగా మరణించే హక్కు జీవించే హక్కులో భాగమని కోర్టు పేర్కొంది.
  • లివింగ్ విల్ ద్వారా కోమాలోకి వెళ్లేముందే వైద్య సహాయంపై నిర్ణయం తీసుకోవచ్చు.
  • 2023లో సుప్రీంకోర్టు కారుణ్య మరణాల గైడ్‌లైన్స్‌ను సరళతరం చేసింది.

దేశంలో కారుణ్య మరణాల అంశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులు వెలువరించింది. జీవించే హక్కుతో పాటు గౌరవంగా మరణించే హక్కు గురించి కోర్టు ఏం చెప్పిందో చూద్దాం.

కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇటీవల హరీష్ రాణా అనే యువకుని కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం సంచలనం రేపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి “జీవించే హక్కు” ఉంది. అయితే, కోలుకోలేని స్థితిలో, కేవలం వైద్య పరికరాల సహాయంతో ప్రాణాలను నిలబెడుతున్నప్పుడు, ఆ నరకం నుండి విముక్తి పొంది “గౌరవంగా మరణించే హక్కు” కూడా అందులో భాగమేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే దేశంలో కారుణ్య మరణాల అంశం ఇప్పటికది కాదు. గత ముప్పై ఏళ్లుగా దేశంలో ఎన్నో కారుణ్య మరణాల కేసులు సుప్రీం గడపను తొక్కాయి. వాటి వివరాలు చూద్దాం..

పి.రత్నం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1994): ఆత్మహత్య ప్రయత్నాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 309 IPC చెల్లదని, జీవించే హక్కులోనే మరణించే హక్కు కూడా ఉందని కోర్టు తొలుత చెప్పినప్పటికీ.. తర్వాత ఈ తీర్పు రద్దయింది.

జియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1996): ఐదుగురు సభ్యుల ధర్మాసనం సామాన్య మరణానికి హక్కు లేదని స్పష్టం చేస్తూనే, నయం చేయలేని వ్యాధులు (Terminal Illness) ఉన్నప్పుడు “గౌరవంగా మరణించే హక్కు” ఉండవచ్చని ఒక చిన్న కిటికీ తెరిచింది.

అరుణా రామచంద్ర షాన్‌బాగ్ కేసు (2011): ఇది దేశం మొత్తాన్ని కదిలించిన కేసు. 42 ఏళ్ల పాటు అపస్మారక స్థితిలో (PVS) ఉన్న నర్స్ అరుణా కోసం పింకీ విరాణి వేసిన పిటిషన్ ద్వారా పాసివ్ యూతనేషియాను మొదటిసారి చట్టబద్ధం చేశారు. కానీ, కఠినమైన గైడ్‌లైన్స్ (హైకోర్టు అనుమతి, మెడికల్ బోర్డు నివేదిక) విధించారు. అరుణా 2015లో సహజంగానే మరణించారు.

కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018): చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్, గౌరవంగా మరణించడం ప్రాథమిక హక్కు అని ప్రకటించింది. మొట్టమొదటిసారిగా “లివింగ్ విల్” (Living Will) లేదా అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్‌ను గుర్తించింది. అంటే, ఒక వ్యక్తి తను కోమాలోకి వెళ్లకముందే, అటువంటి స్థితి వస్తే లైఫ్ సపోర్ట్ తీసేయమని రాసి ఇవ్వవచ్చు అని కోర్టు తెలపగా.. పార్లమెంట్ చట్టం లేకుండా సుప్రీంకోర్టు మార్పులు చేస్తోందని విమర్శలు వచ్చాయి.

గౌరవంగా మరణించే హక్కు ఒక ప్రాథమిక హక్కు?

గైడ్‌లైన్స్ సరళీకరణ (2023): 2018 నాటి నిబంధనలు చాలా కష్టంగా ఉన్నాయని భావించి, 2023లో సుప్రీం కోర్టు వాటిని సులభతరం చేసింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనుమతి అక్కర్లేకుండా, కేవలం మెడికల్ బోర్డు సమాచారం ఇస్తే సరిపోయేలా మార్పులు చేసింది.

హరీష్ రాణా కేసు ( 2026): ఇది కారుణ్య నియామకాల్లో చారిత్రాత్మక తీర్పుగా నిలిచిపోయింది. 13 ఏళ్లుగా బ్రెయిన్ డెడ్ స్టేట్‌లో ఉన్న హరీష్ రాణా కుటుంబం పడిన మానసిక, ఆర్థిక వేదనను గమనించిన జస్టిస్ పార్దీవాలా బెంచ్, లైఫ్ సపోర్ట్ తొలగించడానికి అనుమతి ఇచ్చింది. ఇది 2018, 2023 గైడ్‌లైన్స్ ప్రకారం జరిగిన కారుణ్య మరణాల తొలి అమలు ఇదే.

అయితే కారుణ్య మరణాల్లో ఇటీవలి హరీష్ రాణా తీర్పు పూల బాట ఏమీ కాదు. గత మూడు దశాబ్దాలుగా అడుగడుగునా ఈ విషయంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. వాటిలో ముఖ్యమైనది కేరళ నర్సు అరుణా షాన్‌బాగ్ వివాదం. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరినపుడు కారుణ్య మరణాలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత సంస్థలు “జీవితం పవిత్రమైనది, దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని తీసే హక్కు మనిషికి లేదు” అని వాదించాయి. కుటుంబాలు కేవలం ఆస్తిపాస్తుల కోసం రోగిని వదిలించుకునే ప్రమాదం (Slippery Slope) ఉందని సామాజిక వేత్తలు హెచ్చరించారు.

1973 నవంబర్ 27న ముంబైలోని కె.ఇ.ఎమ్ (KEM) ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అరుణాపై, అదే ఆసుపత్రిలో పనిచేసే సోహన్ లాల్ అనే వార్డు బాయ్ అతి దారుణంగా అత్యాచారం చేశాడు. కుక్కలను కట్టే గొలుసుతో ఆమె మెడను బిగించడంతో మెదడుకు ఆక్సిజన్ అందక ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పటి నుండి ఆమె 42 ఏళ్ల పాటు అదే ఆసుపత్రిలోని వార్డ్ నంబర్ 4లో అపస్మారక స్థితిలో ఉండిపోయింది. అరుణా పరిస్థితిని చూసి చలించిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి పింకీ విరాణి, 2009లో ఆమెకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడే దేశవ్యాప్తంగా పెద్ద వివాదం మొదలైంది.

అరుణాను దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కె.ఇ.ఎమ్ ఆసుపత్రి నర్సులు పింకీ విరాణి పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. “అరుణా మా బిడ్డ, ఆమె మాతోనే ఉంటుంది” అని వారు పట్టుబట్టారు. చివరికి 2011లో జస్టిస్ మార్కండేయ కట్జూ నేతృత్వంలోని బెంచ్, పింకీ విరాణి పిటిషన్‌ను తిరస్కరించింది. దానికి కారణం అరుణాను చూసుకుంటున్న నర్సులు, ఆసుపత్రి సిబ్బందే ఆమెకు అసలైన ‘సంరక్షకులు’ (Next Friend) అని, వారు మరణాన్ని కోరుకోవడం లేదని కోర్టు భావించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం సుప్రీంకోర్టు భారతదేశంలో ‘కారుణ్య మరణం'(Passive Euthanasia)ను మొదటిసారిగా చట్టబద్ధం చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.

కారుణ్య మరణాల గైడ్‌లైన్స్ సరళీకరణ

హరీష్ రాణా కేసు.. మానవీయ కోణం

హరీష్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్‌లో ఒక హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో మెదడుకు తీవ్రమైన గాయమై, 100 శాతం అంగవైకల్యంతో ‘పెర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్’ (PVS) లోకి వెళ్లిపోయారు. గత 13 ఏళ్లుగా (2013 నుంచి 2026 వరకు) ఆయన ఎవరినీ గుర్తించలేని, మాట్లాడలేని స్థితిలో, కేవలం ఫీడింగ్ ట్యూబ్ మీదనే జీవించాడు. తమ కుమారుని నరకాన్ని చూడలేక తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హరీష్ రాణా పరిస్థితి మళ్ళీ మెరుగుపడే అవకాశం ఏమాత్రం లేదని ఎయిమ్స్ వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం, కారుణ్య మరణాలపై మార్చి 11, 2026న ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

ఈ తీర్పులో భాగంగా ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కుతో పాటు, గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుందని కోర్టు పునరుద్ఘాటించింది. హరీష్‌కు అందుతున్న ఆహార నాళాన్ని(CANH) వైద్య చికిత్సగా గుర్తించి, దానిని ఉపసంహరించుకోవడానికి తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. అయితే నేరుగా ప్రాణాలు తీసే ‘యాక్టివ్ యూతనేషియా’ (విషపు ఇంజెక్షన్స్ ఇవ్వడం)ను మాత్రం నిరాకరిస్తూ, కేవలం లైఫ్ సపోర్ట్‌ను తొలగించే ‘పాసివ్ యూతనేషియా’ను మాత్రమే అనుమతించింది. ఢిల్లీ ఎయిమ్స్ పాలియేటివ్ కేర్ విభాగంలో అత్యంత మానవీయంగా, ఎటువంటి నొప్పి లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల కోసం పార్లమెంటు తక్షణమే ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మరోసారి సుప్రీంకోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడే సమయంలో “ఏ తల్లిదండ్రులు తమ బిడ్డ మరణాన్ని కోరుకోరు, కానీ కోలుకోలేని స్థితిలో అతడు అనుభవిస్తున్న బాధను భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని హరీష్ తండ్రి కన్నీళ్లు పెట్టుకోగా, జడ్జిలు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

“ఎండ్-ఆఫ్-లైఫ్ కేర్”కు కొత్త శకం

భారతదేశంలో అరుణా షాన్‌బాగ్ కేసు నుండి కారుణ్య మరణంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2018 మరియు 2023లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సరళీకరించిన తర్వాత, హరీష్ రాణా కేసులో వాటిని మొట్టమొదటిసారిగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక ముగింపు లభించింది. ఇది కేవలం తీర్పు మాత్రమే కాదు, కోలుకోలేని స్థితిలో ఉన్న వేలాది మంది రోగులకు, వారి కుటుంబాలకు లభించిన చట్టపరమైన విముక్తి. అంతేకాదు భారతదేశంలో “ఎండ్-ఆఫ్-లైఫ్ కేర్” విధానంలో కొత్త శకం అని చెప్పవచ్చు.

సుప్రీంకోర్టు కారుణ్య మరణాలకు సంబంధించి కీలక తీర్పులు వెలువరించింది. అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.