|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఫైర్.. తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Published: 10-01-2026, 8:15 AM
టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఫైర్.. తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయం!
  • రాజాసాబ్ టికెట్ల పెంపుపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి షాక్!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ టికెట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
  • కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన తెలంగాణ ప్రభుత్వం?
  • సినిమా టికెట్ల ధరల వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపుతున్న అంశం!

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు సీరియస్ అవ్వడం, ప్రభుత్వం మళ్ళీ పెంపుకు అనుమతించడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టికెట్ల పెంపుపై హైకోర్టు సీరియస్ కామెంట్స్!

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు అంశం సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం ప్రకటించడం ఆ తర్వాత షరా మామూలే అన్నట్లు వ్యవహరిస్తుండటం అందరిని ఆశ్చర్యంలోకి నెట్టుతోంది. తాజాగా రాజాసాబ్ టికెట్ ధరల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తేలిసిందే. అయినా అవేమి తమకు పట్టనట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం ప్రైజ్ హైక్ వద్దని చెప్పినా మళ్లీ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. తాజా పరిణామాలతో తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ గందరగోళ అంశంగా మారిపోయింది.

పెద్ద సినిమాలనగానే టికెట్ రేట్లు పెంచుకోవడం ప్రస్తుతం ఓ ట్రెండ్ గా మారిపోయింది. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించడం తీరా విడుదల సమయానికి ప్రభుత్వం వద్దకు వెళ్లి ధరలు పెంచాలని నిర్మాతలు కోరటం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుతూ అనుమతులు ఇవ్వడం ఈ నిర్ణయంపై హైకోర్టు అక్షింతలు వేయడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన రాజాసాబ్ టికెట్ల పెంపు వ్యవహారంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. కొత్త సినిమా వస్తే టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రతిసారి చివరి క్షణంలో, సెలవుల ముందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని, ఎన్ని సార్లు చెప్పినా తీరు మారదా అంటూ శుక్రవారం అసహనం వ్యకం చేసింది. టికెట్ ధరలను పెంచాలంటే నిబంధనల ప్రకారం పెంచుకోవచ్చు అంతే గానీ చట్టవిరుద్ధంగా మెమోల రూపంలో పెంచుకోడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. రాజాసాబ్ సినిమా సినిమా టికెట్ ధరలను వారం రోజుల పాటు పెంచుకోవడానికి ఇచ్చిన మెమోను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టివేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశించింది. అయితే కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా టికెట్లు పెంచుతూ ప్రభుత్వం మెమో జారీ చేయడం సంచలనంగా మారింది. ఇది కూడా సరిగ్గా కోర్టు సెలవుకు ముందు మెమో ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. దీంతో కోర్టు ఆదేశాలు జారీ చేసినా వాటిని ప్రభుత్వం బేఖాతరు చేసిందా? సినిమా రంగంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఏమిటీ గందరగోళం అనే వాదలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం తీరుపై విమర్శలు.. ఏం జరుగుతోంది?

సినిమా టికెట్ల పెంపు విషయంలో గందరగోళం ఇటీవల నిత్యకృత్యంగా మారిపోయింది. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇలా జరుగూతూనే వస్తోంది. పుష్పా-2 ఇన్సిడెంట్ తో తెలంగాణలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షో లకు అనుమతులు ఇచ్చేది లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచాలంటే పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు ఇవ్వాలని గతేడాది హైదరాబాద్‍లో సినీకార్మిక సంఘాలు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు హరిహర వీరమల్లు, ఓజీ, అఖండ-2 వంటి సినిమాలకు రేట్లు పెంచింది. ఇలా పెంచుతున్నప్పటికీ ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాతలకు షాక్ తప్పడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఒకరు రేట్లు పెంచుతూ అనుమతి ఇస్తుంటే మరొకరేమో వద్దని చెప్పడం చర్చనీయాశంగా మారుతోంది.

రాజకీయ దుమారంగా టికెట్ల ధరల వ్యవహారం!

సినిమా టికెట్ల పెంపుపై తాజాగా స్పందించిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నేను సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశానని అన్నారు. పుష్ప సినిమా తర్వాత బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు ఉండదని చెప్పాను. బెనిఫిట్‌ షోలు, టికెట్ల పెంపు కోసం నా వద్దకు రావొద్దని చెప్పాను. టికెట్ల ధరల పెంపు సంబంధించి ఏ ఫైల్‌ నా వద్దకు రాలేదు. బెనిఫిట్‌ షోల కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా టికెట్ ధరలు పెంచుతూ ఎలా మెమోలు ఎలా జారీ అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. సినిమాటోగ్రఫీ మంత్రి టికెట్ ధరల పెంపు విషయంలో ఇలాంటి నిర్ణయంతో ఉండగా మిగతా అధికారులు ఎందుకు పెంచుతూ అనుమతులు ఇస్తున్నారు? ఇంతకు రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరూ అనే చర్చ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. మొత్తంగా సినిమా టికెట్ల విషయంలో పదే పదే మాట మారుస్తోందనే విమర్శలు మూటగట్టుకుంటున్న ప్రభుత్వం.. భవిష్యత్ లోనైనా ఇలాంటి విమర్శకు తావులేకుండా ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.