|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తిరుమలలో భక్తుల సునామీ: వేసవి రద్దీకి టీటీడీ భారీ ఏర్పాట్లు, వసతి వివరాలు!

Published: 04-05-2026, 1:46 AM
తిరుమలలో భక్తుల సునామీ: వేసవి రద్దీకి టీటీడీ భారీ ఏర్పాట్లు, వసతి వివరాలు!
  • వేసవి రద్దీ దృష్ట్యా రూ.2 కోట్లతో చలువ పందిళ్లు, అదనపు షెల్టర్లు.
  • పాదాలు కాలకుండా మాడ వీధుల్లో ‘కూల్ పెయింట్’ వేసిన టీటీడీ.
  • డీహైడ్రేషన్ నివారణకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో నిరంతర నీటి సరఫరా.
  • 16 వైద్య కేంద్రాలు, 7 లక్షల లడ్డూలు, 60 వేల మందికి వసతి ఏర్పాట్లు.

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, వైద్య సేవలు, వసతి సౌకర్యాలతో పాటు దర్శనం వేళల్లో సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వేసవి రద్దీకి టీటీడీ ఏర్పాట్లు

TTD Summer Arrangements : వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎండల తీవ్రత, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాత్రికుల కోసం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేపట్టింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…. దర్శనం కోసం వేచి ఉండే సమయంలో అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలను టీటీడీ సమన్వయం చేస్తోంది.

ఎండ తీవ్రత నుంచి భక్తులను రక్షించేందుకు టీటీడీ ఇంజినీరింగ్ విభాగం సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక పనులు చేపట్టింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎండ తగలకుండా భారీ చలువ పందిళ్లను నిర్మించారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు షెల్టర్లను అందుబాటులోకి తెచ్చారు.

ముఖ్యంగా భక్తులు చెప్పులు లేకుండా నడిచే నాలుగు మాడ వీధుల్లో పాదాలు కాలకుండా ఉండేందుకు టీటీడీ ‘సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్’ వేయించింది. లడ్డూ కౌంటర్లు, ఆలయ పరిసరాల్లోనూ చలువ పందిళ్లు నిర్మించి భక్తులకు ఉపశమనం కల్పిస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే చోట తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు.

భక్తులకు తాగునీరు, వైద్య సేవలు

వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు అందించేందుకు టీటీడీ ఆరోగ్య విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి సేవకులు మొబైల్ వాటర్ డ్రమ్ములతో నేరుగా భక్తుల వద్దకే వెళ్లి నీరు అందిస్తున్నారు. రోజుకు మూడు బ్యాచుల్లో 45 మంది సేవకులు నిరంతరం ఈ సేవలో పాల్గొంటున్నారు. క్యూ లైన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తున్నారు.

మరోవైపు భక్తుల ఆరోగ్యం కోసం తిరుమల వ్యాప్తంగా 16 వైద్య కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి, నారాయణగిరి వద్ద మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

భక్తులకు ప్రసాదం విషయంలో ఎలాంటి లోటు రాకుండా టీటీడీ జాగ్రత్త వహించింది. సాధారణంగా రోజుకు 3.50 లక్షల లడ్డూలను తయారు చేస్తుండగా, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను ‘బఫర్ స్టాక్’గా ఉంచారు.

లడ్డూలు, వసతి సౌకర్యాల వివరాలు

వసతి విషయానికి వస్తే…. తిరుమలలో ఉన్న 7500 గదులు మరియు ఐదు యాత్రికుల వసతి సముదాయాల ద్వారా సుమారు 60 వేల మందికి వసతి కల్పించే వీలుంది. గదులు దొరకని భక్తుల కోసం వివిధ పీఏసీలలో దాదాపు 9 వేల లాకర్లను అందుబాటులో ఉంచారు. అయితే కుటుంబ సభ్యులతో వచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఒంటరిగా వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

మొక్కులు తీర్చుకునే భక్తుల కోసం ప్రధాన కల్యాణకట్టతో పాటు మరో 11 మినీ కల్యాణకట్టలను టీటీడీ నిర్వహిస్తోంది. మొత్తం 1152 మంది క్షురకులు (వీరిలో 269 మంది మహిళలు) భక్తులకు సేవలందిస్తున్నారు. వేసవి రద్దీ ఎంత ఉన్నా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు అందించడమే తమ ప్రాధాన్యతని టీటీడీ అధికారులు వెల్లడించారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తం మీద, వేసవి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీటీడీ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తోంది. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకోడానికి వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.