|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇరాన్ తర్వాత క్యూబాపై ట్రంప్ గురి! భారత్‌కు ముప్పు తప్పదా?

Published: 06-03-2026, 10:05 AM
ఇరాన్ తర్వాత క్యూబాపై ట్రంప్ గురి! భారత్‌కు ముప్పు తప్పదా?
  • ఇరాన్ యుద్ధం తర్వాత క్యూబాపై దృష్టి సారించనున్నట్లు ట్రంప్ సంకేతాలు.
  • క్యూబా కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో ఒప్పందానికి అమెరికా సిద్ధంగా ఉంది.
  • వెనిజులా నుండి చమురు సరఫరా నిలిపివేయడంతో క్యూబాలో సంక్షోభం ఏర్పడింది.
  • క్యూబాలో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పడమే ట్రంప్ లక్ష్యం.

ఇరాన్‌తో వివాదం సద్దుమణగకముందే ట్రంప్ క్యూబాపై దృష్టి సారించారు. క్యూబా కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో ఒప్పందానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. వెనిజులా నుండి చమురు సరఫరా నిలిపివేయడంతో క్యూబా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

క్యూబాపై ట్రంప్ ఆసక్తి వెనుక అసలు కారణం?

ఇరాన్ పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమై వారంరోజులవుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్‌పై వరుసగా బాంబు దాడులు చేస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇరాన్ పై యుద్ధం ముగిసిన తర్వాత క్యూబాపైనే తమ ఫోకస్ ఉంటుందన్న విధంగా సంకేతాలిచ్చారు. ఈ యుద్ధం తర్వాత క్యూబా కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో డీల్ చేసుకునేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు క్యూబా చాలా ఆతృతగా ఉందని, కొద్దివారాల్లోనే ఈ చర్చలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఇంటర్ మయామి మేజర్ లీగ్ సాకర్ టీమ్ కోసం నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భౌగోళిక రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. పైగా ఆ క్లబ్ యజమానులైన అమెరికన్ -క్యూబన్లతో.. త్వరలోనే మీరు తిరిగి క్యూబా వెళ్లి రోజులొస్తాయని ఎంతో ధీమాగా కూడా చెప్పారు. అలాగే ఒకేసారి అన్నిపనులు వేగంగా చేస్తో.. అనర్థాలు జరుగుతాయని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.

క్యూబాపై ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి రీజన్.. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర విద్యుత్, మానవీయ సంక్షోభంలో కూరుకుపోవడం. వెనిజులా నుంచి క్యూబాకు వెళ్లే చమురు రవాణాను ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోవడంతో అక్కడ ఈ పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా క్యూబా ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరిపి.. నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించాలని భావిస్తోంది. క్యూబాలో అమెరికాకు సపోర్ట్ చేసే ప్రభుత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ట్రంప్ ఆ దేశానికి చమురు రవాణాను నిలిపివేశారని తెలుస్తోంది. అంతే క్యూబాను ఫ్రెండ్లీ టేకోవర్ చేసుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.

అమెరికా దళాలు వెనిజులాపై దాడి చేసి, అక్కడి నేత నికోలస్ మదురోను బంధించిన తర్వాత క్యూబాకు కష్టాలు మొదలయ్యాయి. క్యూబాకు ప్రధాన ఇంధన వనరుగా ఉన్న వెనిజులా నుండి చమురు రవాణాను ట్రంప్ పూర్తిగా నిలిపివేశారు. ఏ దేశమైనా క్యూబాకు చమురు అమ్మితే వారిపై భారీ టారిఫ్ (సుంకాలు) విధిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత అమెరికా ట్రెజరీ శాఖ ఫిబ్రవరి నెలాఖరులో ఒక కీలక ప్రకటన చేసింది. వెనిజులా చమురు నిల్వలను ప్రైవేట్ కంపెనీలు క్యూబాకు అమ్ముకోవడానికి అనుమతినిచ్చింది. అయితే.. ఆ లాభం క్యూబా సైన్యానికి గానీ, ప్రభుత్వానికి గానీ వెళ్లకూడదని.. కేవలం క్యూబా ప్రజలకు సహాయపడేలా మాత్రమే ఉండాలని నిబంధన పెట్టింది.

క్యూబా సంక్షోభం – అమెరికా పాత్ర

అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. 10 శాతం మంది ప్రజలకు కేవలం ట్యాంకర్ల ద్వారానే నీరు అందుతోంది. అవి కూడా ఎలక్ట్రిక్ పంపుల ద్వారానే పనిచేస్తాయి. విద్యుత్ లేకపోవడంతో లక్షలాది మందికి తాగునీరు కరువైంది. సుమారు 50 లక్షల మంది దీర్ఘకాలిక రోగులకు నిరంతర విద్యుత్ అవసరం. 385 ఆరోగ్య కేంద్రాలు విద్యుత్ లేక దెబ్బతిన్నాయి. దేశంలో డెంగ్యూ, ఒరోపౌచ్ వైరస్‌లు విజృంభిస్తున్నాయి. అక్టోబర్‌లో వచ్చిన ‘మెలిస్సా’ తుఫాను వల్ల 20 లక్షల మంది ప్రభావితం కాగా, 7.35 లక్షల మంది ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారు. క్యూబాకు ఉన్న అతిపెద్ద బలం వైద్యులు. ఇతర దేశాలకు వైద్యులను పంపి దౌత్య సంబంధాలు పెంచుకునే ‘మెడికల్ డిప్లొమసీ’ని అమెరికా దెబ్బతీసింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చి క్యూబా డాక్టర్లను వెనక్కి పంపించేలా చేయడం ద్వారా క్యూబాకు అందే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేసింది.

క్యూబాకు పొరుగు దేశాల నుంచి కూడా దౌత్యపరమైన దాడులు ఎదురవుతున్నాయి. ఈక్వెడార్ ప్రభుత్వం క్యూబా రాయబారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో క్యూబా రాయబార కార్యాలయంపై సిబ్బంది పత్రాలను తగలబెడుతూ కనిపించారు. అమెరికా ఒత్తిడితో హోండురాస్, జమైకా దేశాలు క్యూబా వైద్యులతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. గ్వాటెమాల, బహామాస్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. క్యూబాలో విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో 10 మంది పనామా పౌరులను హవానాలో అరెస్ట్ చేశారు. అలాగే అమెరికా నుంచి వచ్చిన ఉగ్రవాదులు సరిహద్దు దళాలపై కాల్పులు జరపగా, ఐదుగురిని క్యూబా సైన్యం కాల్చివేసింది. శనివారం ఫ్లోరిడాలోని తన మారలగో రిసార్ట్‌లో ట్రంప్ లాటిన్ అమెరికా దేశాల మితవాద నేతలతో సమావేశం కానున్నారు. ఇందులో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఎల్ సాల్వడార్ నేత నాయిబ్ బుకెలే వంటి వారు పాల్గొంటున్నారు. ఈ భేటీ తర్వాత క్యూబాపై అమెరికా తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం

క్యూబా దేశంలో అమెరికా కారణంగా నెలకొన్న ఈ సంక్షోభం కేవలం ఆ దేశం ఒక్కటే ఎదుర్కొంటున్నది కాదు. ఇది అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఆడుతున్న అతిపెద్ద భౌగోళిక రాజకీయ చదరంగం. క్యూబాకు వెనిజులా దశాబ్దాల కాలంగా వెన్నెముకలా ఉండేది. అక్కడి నుంచి వచ్చే చౌకైన చమురుపైనే ఆ దేశ విద్యుత్ వ్యవస్థ ఆధారపడి ఉంది. అమెరికా సైన్యం వెనిజులా నేత నికోలస్ మదురోను బంధించడం ద్వారా, క్యూబాకు అందే ఇంధనాన్ని ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా కట్ చేసింది. ఇది క్యూబాను మోకాళ్లపైకి తెచ్చే వ్యూహంగానే కనిపిస్తోంది. ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చేలా చేయడమే అమెరికా టార్గెట్ గా తెలుస్తోంది. ఆర్థికంగా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి లొంగదీసుకోవడమే వ్యూహంగా తెలుస్తోంది. అంతేకాదు.. క్యూబాను తన దారిలోకి తెచ్చుకోవడం ద్వారా కరేబియన్ తీరంలో ప్రత్యర్థి దేశాల నీడ కూడా పడకుండా చూడాలని అమెరికా భావిస్తోంది.

అమెరికా వెనిజులా చమురు నిల్వలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల, మార్కెట్లో సరఫరాపై అమెరికా పట్టు పెరిగింది. ఇది ఒక రకంగా చమురు ధరలను నియంత్రించేందుకు అమెరికా వాడుతున్న అస్త్రం. యుద్ధం, ఆంక్షల వల్ల సముద్ర మార్గాల్లో రవాణా చేసే నౌకలకు ఇన్సూరెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది కేవలం చమురుకే కాదు.. మనం వాడే ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే మనం చమురు అవసరాల కోసం 80 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. ప్రస్తుతం నెలకొన్న యుద్ధపరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయల నుండి పారిశ్రామిక ఉత్పత్తుల వరకు అన్నింటి ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. అయితే.. ప్రస్తుతం ఇజ్రాయెల్, యూరప్, యూఎస్ కు వెళ్లే చమురు నౌకలను మాత్రమే ఆపివేస్తామని, మిగతా దేశాలకు చమురు ఎగుమతులు కొనసాగుతాయని ఇరాన్ చేసిన ప్రకటన కాస్త ఊరటనిచ్చింది. ట్రంప్ ప్రభుత్వం ‘అమెరికా ఫస్ట్’ అనే పాలసీతో క్యూబాలో తన పట్టు పెంచుకుంటూనే, మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు చెక్ పెడుతోంది. ఈ పరిణామాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన భద్రత విషయంలో సవాలుగా మారాయి.

ట్రంప్ చర్యలు క్యూబాలో రాజకీయ మార్పులకు దారితీసే అవకాశం ఉంది. అయితే, ఈ పరిణామాలు భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది కీలక మలుపు కావచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.