
📌 Key Points
- మహేష్-రాజమౌళి సినిమాకు మొదట `వారణాసి` టైటిల్ అనుకున్నారు.
- టైటిల్ ముందుగానే మరొకరు రిజిస్టర్ చేయడంతో వివాదం చెలరేగింది.
- తెలుగులో సినిమా టైటిల్ `రాజమౌళి వారణాసి`గా మార్చారని ప్రచారం.
- రెండు పార్ట్‌లు కాకుండా, ఈ చిత్రం ఒకే పార్ట్‌లో విడుదల కానుందని సమాచారం.
మహేష్ బాబు, రాజమౌళిల భారీ ప్రాజెక్ట్ `వారణాసి` టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు దీనికి కొత్త టైటిల్ `రాజమౌళి వారణాసి`గా మారినట్టు తెలుస్తోంది. అలాగే, రెండు పార్ట్‌లుగా వస్తుందన్న ప్రచారానికి తెరదించుతూ, ఈ చిత్రం ఒకే భాగంలో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాపై మరిన్ని వివరాలు.
టైటిల్ వివాదం: అసలేం జరిగింది?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా వస్తోంది. `వారణాసి` పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు జక్కన్న. సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. వెయ్యి కోట్లు అనుకున్నా, బడ్జెట్ పెరిగిపోతుందన్నారు. ఇందులో మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపించబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందన్నారు.
ఇటీవల `వారణాసి` టైటిల్‌ని రివీల్ చేసే క్రమంలో విడుదల చేసిన ట్రైలర్‌లో ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, దాదాపు నాలుగైదు కాలాల్లో హీరో ప్రయాణిస్తాడని తెలియజేశారు. రామాయణంలోని లంకదాహణం అనే ఘట్టాన్ని మెయిన్‌గా చేసుకుని మూవీని రూపొందిస్తున్నట్టు ట్రైలర్‌ని చూస్తే తెలుస్తోంది. ఇందులో రాముడిగానూ మహేష్ కనిపించబోతున్నట్టు రాజమౌళి తెలిపారు. ఆయన్ని చూసి తనకే గూస్ బంమ్స్ వచ్చాయని, రేపు తెరపై ఆడియెన్స్ వాహ్ ఫీలవుతారని తెలిపారు. ఈ టైటిల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అదే సమయంలో మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని, విజువల్ వండర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
కొత్త టైటిల్ ఇదే: రాజమౌళి నిర్ణయం
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రామభక్త హనుమ నిర్మాణ సంస్థ `వారణాసి` అనే టైటిల్‌ని ఫిల్మ్ ఛాంబర్‌లో ముందుగానే రిజిస్టర్ చేయించింది. అంతేకాదు ఈ టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఆ తర్వాత రాజమౌళి కూడా తన సినిమా పేరుని `వారణాసి`గా ప్రకటించారు. దీంతో వివాదం నెలకొంది. సదరు నిర్మాతలు పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇది వివాదంగా మారిన నేపథ్యంలో ఆ గొడవకు తెరతీస్తూ పేరుని మార్చారు రాజమౌళి.
రెండు పార్ట్‌లు కాదా? క్లారిటీ ఇదే
ఇక మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న `వారణాసి` పేరుని కాస్త `రాజమౌళి వారణాసి`గా మారుస్తున్నారట. తెలుగులో ఈ పేరుతోనే విడుదల చేయబోతున్నారు. మిగిలిన భాషల్లో ఈ టైటిల్‌కి సమస్య లేదు. తెలుగు టైటిల్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూవీని రెండు పార్ట్ లుగా రాజమౌళి తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని, ఒకే పార్ట్ లోనే సినిమాని పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2027 సమ్మర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి, టైటిల్ వివాదం సద్దుమణగడంతో మహేష్-రాజమౌళి సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. కొత్త టైటిల్, ఒకే పార్ట్‌లో సినిమా విడుదల అనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.


