
📌 Key Points
- విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమాకు సెన్సార్ సమస్యలు
- సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది
- సినిమాలో రాజకీయ దూషణలున్నాయని సెన్సార్ బోర్డు అనుమానం
- రివైజ్ కమిటీ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. దీనితో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.
జన నాయగన్ సినిమాకు సెన్సార్ చిక్కులు
Jana Nayagan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు విజయ్ దళపతి (Vijay thalapathy). ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు “టీవీకే” అనే రాజకీయ పార్టీని స్థాపించి.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పలు ప్రజా కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా మారిపోయారు విజయ్ దళపతి. అయితే మరొకవైపు అభిమానులను అలరించడానికి చివరి సినిమాగా ‘జన నాయగన్’ అనే సినిమా చేశారు. తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత అంటూ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాకి సెన్సార్ సమస్య ఏర్పడింది.
సెన్సార్ రావడం ఆలస్యం కావడంతో సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు జననాయగన్ మూవీ నిర్మాతలు . దీంతో వెంటనే ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ అందించాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. కానీ ఈ సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో సెన్సార్ బోర్డు పిటిషన్ వేయగా ఇప్పుడు పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీంతో జననాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది.
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
విషయంలోకి వెళ్తే సినిమా జననాయగన్ కి యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెడుతూ ఈ విధంగా కామెంట్ లు చేసింది. “సినిమా సెన్సార్ విషయంలో బోర్డుకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని సింగిల్ బెంచ్ జడ్జిని హైకోర్టు సూచించింది. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి జననాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంతవరకు సినిమా విడుదల ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది. అంతేకాదు కొత్తగా మళ్లీ విచారణకు ఆదేశించి సినిమాను రివైజ్ కమిటీ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ” మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఇక హైకోర్టు తీర్పుతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది.
అసలేం జరిగిందనే విషయానికొస్తే. జననాయగన్ సినిమాలో కొన్ని రాజకీయ దూషణలు ఉన్నాయనే నేపథ్యంలోనే ఈ సినిమాకు సెన్సార్ ఇవ్వడంలో ఆలస్యం చేసిందట . అయితే ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. కేసు విచారణ స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీని విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. మద్రాస్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది.
విడుదల తేదీపై నీలినీడలు
మొత్తానికి జన నాయగన్ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. హైకోర్టు తీర్పుతో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు నిరాశలో ఉన్నారు. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.


