
📌 Key Points
- విజయవాడలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల మెరుపు సోదాలు.
- సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలానికి మద్దతు తెలుపుతున్న ముగ్గురు యువకుల అరెస్ట్.
- అరెస్టయిన వారిలో మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహ్మద్ డానిష్ ఉన్నారు.
- దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 10 మంది సభ్యుల నెట్‌వర్క్‌లో వీరు భాగమని అనుమానం.
విజయవాడలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేయడంతో ఉలిక్కిపడింది. వీరు సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలం
విజయవాడలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు సోదాలు చేపట్టారు. సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి మద్దతు తెలుపుతున్నారన్న ఆరోపణలపై….ముగ్గురు యువకులకు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద నెట్ వర్క్ లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
అదుపులో తీసుకున్న వారిలో మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్ (23), మీర్జా సోహైల్ బేగ్ (23), మహ్మద్ డానిష్ (27) ఉన్నారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఓ అధికారులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులు
“ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా… మా బృందాలు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తీవ్రవాద కంటెంట్ ఉంటోంది. తీవ్రవాద భావజాలానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాం”అని ఓ అధికారి పిటిఐకి చెప్పారు.
ఈ ముగ్గురిని సోమవారం టూ టౌన్ ప్రాంతంలోని వారి నివాసం సమీపంలో అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 10 మంది సభ్యుల నెట్ వర్క్ లో ఈ బృందం భాగంగా ఉందని తెలుస్తోంది. యువతను ప్రభావితం చేయడానికి మరియు వారిని తీవ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్
ఉగ్రవాద సంస్థలతో వారికి సంబంధాలు…. వారి ఆన్ లైన్ కార్యకలాపాల స్వభావాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. విజయవాడ వించిపేట నారాయణస్వామి వీధిలో మొహ్మద్ రహమతుల్లా షరీఫ్, అబ్దుల్జాక్ వీధిలో మీర్జా సొహైల్ బేగ్, భవానీపురం ఇందిరా ప్రియదర్శినీ కాలనీలో మొహ్మద్ డానిష్ ఉన్నట్లు గుర్తించారు.
వీరిపై నిఘా పెట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎవరెవరితో సంప్రదింపుల్లో ఉన్నారు, వీరి భావజాలానికి ఆకర్షితులైన వారు ఇంకెవరైనా ఉన్నారా? అనే అంశాలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో ఆరా తీసే పనిలో పడింది.
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసు విజయవాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


