
📌 Key Points
- తమిళనాడు ఎన్నికల కౌంటింగ్‌లో దళపతి విజయ్ పార్టీ టీవీకే సంచలన ఆధిక్యం.
- టీవీకే 104 స్థానాల్లో ఆధిక్యంతో సెంచరీ మార్క్ దాటి, ద్రవిడ పార్టీలకు షాక్ ఇచ్చింది.
- అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకేలు ఊహించని ఫలితాలతో దిగ్భ్రాంతికి గురయ్యాయి.
- యువత, తటస్థ ఓటర్ల మద్దతుతో విజయ్ అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన రీతిలో దూసుకుపోతోంది. 104 స్థానాల్లో ఆధిక్యంతో సెంచరీ మార్క్ దాటి, ద్రవిడ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది.
టీవీకే దూకుడు: ద్రవిడ పార్టీలకు షాక్
తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో సంచనాలు నమోదు అవుతున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, నటుడు దళపతి విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) సంచలన రీతిలో దూసుకుపోతోంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సెంచరీ మార్క్‌ను దాటేసింది.
డీఎంకే, ఏఐడీఎంకే శిబిరాల్లో నిరాశ
మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న అధికార డీఎంకే (DMK)కు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం డీఎంకే కేవలం 51 స్థానాలకే పరిమితం కాగా, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే (AIADMK) 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాల సరళి చూసి దిగ్భ్రాంతికి గురైన డీఎంకే కార్యకర్తలు సంబురాల కోసం వేసిన టెంట్లను పీకేశారు. డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ జనాలు లేక బోసిపోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దే బోరున విలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
యువత మద్దతుతో విజయ్ ప్రభంజనం
మరోవైపు, ఏఐడీఎంకే నేతలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాక విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత, తటస్థ ఓటర్లు విజయ్ నినాదమైన మార్పునకు జై కొట్టినట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్ల గంపగుత్త మద్దతే విజయ్ని సెంచరీ దిశగా నడిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే తమిళనాడులో విజయ్ అధికారాన్ని చేజిక్కించుకునే చాన్స్ ఉంది.
ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ శకం మొదలైనట్లే. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించి, యువత మద్దతుతో విజయ్ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


