
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘జూనియర్’ సినిమా ‘వైరల్ వయ్యారి’ పాటకు కొరియోగ్రఫీ చేసిన రేవంత్ మాస్టర్ విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. తెలంగాణకు చెందిన ఈ యువ కొరియోగ్రాఫర్ కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు.
Key Points
'జూనియర్' సినిమా 'వైరల్ వయ్యారి' పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ.
మణుగూరుకు చెందిన రేవంత్, ఢీ షో ద్వారా గుర్తింపు పొందాడు.
శేఖర్ మాస్టర్ శిష్యుడు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అనుభవం.
తన తల్లి ప్రోత్సాహంతో విజయం సాధించిన రేవంత్ కథ.
‘వైరల్ వయ్యారి’ కొరియోగ్రాఫర్ ఎవరు?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సోషల్ మీడియాలో ‘ వైరల్ వయ్యారి ‘ అంటూ ‘ జూనియర్ ’ సినిమా సాంగ్ ట్రెండ్ అవుతుంది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే సౌండ్ వినిపిస్తుంది . అయితే , ఈ పాటకు హీరో కిరీటి , శ్రీలీల పోటీపడి డ్యాన్స్ చేశారు . పాట మొత్తం ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేశారు . అయితే , ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన కుర్రోడు ఎవరు ..? అని సోషల్ మీడియాలో వెతుకుతున్నారు . ఈ పాటకు స్టెప్పులు వేయించింది తెలంగాణ బిడ్డే .. మణుగూరుకు చెందిన రేవంత్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు .
రేవంత్ మాస్టర్ ప్రయాణం
ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన రేవంత్ పూలమార్కెట్ ప్రాంతంలో ఉంటాడు . తన అమ్మగారు సుభద్ర పూలదుకాణం నడుపుతున్నారు . భర్తను కోల్పోయిన ఆమె పట్టుదలతో ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నంతలో చదివించారు . వారిలో చిన్నవాడైన రేవంత్ కు డ్యాన్స్ అంటే పిచ్చి . దీంతో పదో తరగతి పూర్తి అయిన తర్వాత 2013 లో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు . అక్కడ చిన్నచిన్న ఈవెంట్లు చేశాడు . తండ్రి మరణం తర్వాత ఇబ్బందులు వచ్చినా తన అమ్మగారు పూలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించింది . రేవంత్ కూడా హైదరాబాద్ లో పనిచేస్తూ .. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరి డ్యాన్స్‌లో శిక్షణ పొందాడు . అక్కడి నుంచి అతని ప్రయాణం మరో అడుగు ముందుకు పడింది .
తల్లి ప్రోత్సాహం, శేఖర్ మాస్టర్ మార్గదర్శకత్వం
సైడ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రేవంత్ .. ఢీ 9వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా మెప్పించాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఢీ 15వ సీజన్‌లో రెండో ఫైనలిస్ట్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు . దీంతో శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చాడు . ఆయన పర్యవేక్షణలో ఆచార్య సినిమాలోని ‘ భలే బంజారా ‘ పాటకు పనిచేశాడు . అలా సుమారు వందకు పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా రేవంత్ పనిచేయడం విశేషం . తన టాలెంట్ ను గుర్తించిన జూనియర్ సినిమా మేకర్స్ ఏకంగా రెండు పాటలకు ఛాన్స్ ఇచ్చారు . వైరల్ వయ్యారి సాంగ్ తో పాటు టైటిల్ సాంగ్‌కు కూడా రేవంత్ కోరియోగ్రఫీ ఇచ్చాడు . తన విజయానికి తన అమ్మగారు ఎంత కష్టపడ్డారని ఆయన తెలిపాడు . ఆపై శేఖర్ మాస్టర్ నేర్పించిన మెలకువలు తన జీవితాన్ని మార్చేశాయని పేర్కొన్నాడు .
తన తల్లి త్యాగం, శేఖర్ మాస్టర్ మార్గదర్శకత్వం, ఢీ షో అనుభవం ద్వారా రేవంత్ మాస్టర్ ఈ విజయాన్ని సాధించారు. అతని కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం.


