
విశాఖపట్నం ప్రాంత పౌర విమానయాన రంగంలో చారిత్రాత్మక మార్పుకు ముహూర్తం ఖరారైంది. జులై 8 నుంచి విశాఖ విమానాశ్రయంలో పౌర విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Key Points
జులై 8 నుంచి విశాఖపట్నం పౌర విమాన సేవలు పూర్తిగా నిలిపివేయబడతాయి.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త కేంద్రం.
ప్రధాని మోదీ చేతుల మీదుగా జులై మొదటి వారంలో ప్రారంభోత్సవం.
మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం.
విశాఖ విమానాశ్రయం తరలింపు: కీలక తేదీలు
Visakhapatnam International Airport : విశాఖపట్నం ప్రాంత పౌర విమానయాన రంగంలో చారిత్రాత్మక మార్పునకు ముహూర్తం ఖరారైంది. జులై 8వ తేదీ నుంచి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ పౌర విమాన (సివిలియన్) రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఆ తేదీ నుంచి వాణిజ్య విమాన సర్వీసులన్నీ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నుండి ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం (ఇండియన్ నేవీ) ఆధీనంలో ఉంది. జులై 8 నుంచి ఇక్కడ పౌర విమానాల నిర్వహణను నిలిపివేసి, గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం విమానాశ్రయాన్ని ఈ ప్రాంత ఏకైక వాణిజ్య విమానయాన గేట్‌వేగా మారుస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలనా యంత్రాంగ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) నమూనాలో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. జులై మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది.
అనంతరం జులై 8 నుంచి ఇక్కడి నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు షురూ అవుతాయి. మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా నామకరణం చేసిన ఈ విమానాశ్రయం….. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల (6 మిలియన్) మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా రూపొందించారు. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.
ఎయిర్‌పోర్ట్ కమిషనింగ్‌కు ముందు భాగంగా ఇప్పటికే జనవరి 4వ తేదీన ట్రయల్ మరియు వాలిడేషన్ ఫ్లైట్స్ (ప్రయోగాత్మక విమాన సర్వీసులు) విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన చెక్-ఇన్ కౌంటర్లు, బ్యాగేజీ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్ వంటి వసతులపై అధికారులు తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రత్యేకతలు, సామర్థ్యం
సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సహా పలు ప్రముఖ విమానయాన సంస్థలు జులై 8 మరియు ఆ తర్వాత ప్రయాణించే తమ ప్యాసింజర్లకు, ట్రావెల్ ఏజెంట్లకు ఇప్పటికే అలర్ట్‌లు జారీ చేశాయి. జులై 8 నుండి విశాఖకు వచ్చే, ఇక్కడి నుండి వెళ్లే అన్ని విమానాలు పాత ఎయిర్‌పోర్ట్‌కు బదులుగా భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే నడుస్తాయని స్పష్టం చేశాయి.
ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ (TTAA) కూడా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు డిపార్చర్ మరియు అరైవల్ ఎయిర్‌పోర్ట్ వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించింది. ప్రారంభంలో ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ లోని టెర్మినల్-1 నుండి చెక్-ఇన్ కార్యకలాపాలు సాగుతాయి.
మరోవైపు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA) జూన్ 22న ఈ కొత్త విమానాశ్రయానికి సంబంధించి అడ్ హాక్ టారిఫ్ (తాత్కాలిక రుసుములు) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రెగ్యులర్ ఛార్జీలు ఖరారయ్యే వరకు ఇవే అమలులో ఉంటాయి.
భోగాపురం విమానాశ్రయం వాణిజ్య పరంగా ముస్తాబవుతున్నప్పటికీ…. విశాఖ నగరం నుండి ప్రయాణించే వారికి కనెక్టివిటీ (రవాణా సౌకర్యం) అతిపెద్ద సవాలుగా మారబోతోంది. ఈ ఎయిర్‌పోర్ట్ విశాఖ నగరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, ఈస్టర్న్ నావల్ కమాండ్ వంటి ప్రధాన కేంద్రాలు, పరిశ్రమలన్నీ విశాఖకు దక్షిణ వైపున ఉన్నాయి. అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడానికే కనీసం ఒకటిన్నర నుండి రెండు గంటల సమయం పడుతుందని, ఇక చెక్-ఇన్ సమయాన్ని కూడా కలుపుకుంటే ప్రయాణికులు చాలా ముందుగా బయలుదేరాల్సి ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాన మార్గమైన జాతీయ రహదారి-16 (NH-16) పై ఎప్పుడూ భారీగా సరుకు రవాణా లారీల రద్దీ ఉంటుంది. ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం రహదారిని ఎయిర్‌పోర్ట్ కారిడార్‌గా గుర్తించినప్పటికీ…. అది కూడా నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతోంది.
ప్రయాణికులకు సూచనలు: మార్పులు గమనించండి
పీక్ అవర్స్‌లో గాజువాక లేదా స్టీల్ ప్లాంట్ ప్రాంతం నుండి సబ్బవరం, ఆనందపురం మీదుగా వెళ్తే 1 గంట 40 నిమిషాలు, బీచ్ రోడ్ మరియు భీమిలి మీదుగా వెళ్తే 1 గంట 35 నిమిషాల సమయం పడుతుందని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) అంచనా వేసింది. కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు వీఎంఆర్‌డీఏ (VMRDA) ఏడు రోడ్డు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. వీటిలో అడవివరం-సొంత్యం, వేపగుంట-పినగాడి రోడ్లు మాత్రమే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలవని అధికారులు భావిస్తున్నారు.
ఈ సమస్యపై విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ స్పందించారు. గతంలో హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం నుండి శంషాబాద్‌కు విమాన సర్వీసులు మార్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయని….. ఆ తర్వాత రోడ్డు మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో సమస్యలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. భోగాపురం విషయంలోనూ అదే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పౌర విమాన సర్వీసులను పూర్తిగా భోగాపురానికి తరలించడంపై విశాఖలో రాజకీయ చర్చ మొదలైంది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే, సీనియర్ బీజేపీ నేత పి. విష్ణుకుమార్ రాజు పాత ఎయిర్‌పోర్ట్‌లో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని….. అయితే అంతర్జాతీయ మరియు సుదూర ప్రాంతీయ విమానాలను కొత్త ఎయిర్‌పోర్ట్ నుండి నడుపుతూనే, తక్కువ దూర ప్రయాణాల డొమెస్టిక్ సర్వీసులను ప్రస్తుత నావల్ ఎయిర్‌ఫీల్డ్ లోని పాత ఎయిర్‌పోర్ట్ నుంచే కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నావికాదళం కూడా నిర్దేశిత సమయాల్లో పౌర విమానాలకు సహకరించగలదని… కొత్త ఎయిర్‌పోర్ట్ దూరం కావడంతో ప్రజలు ఇళ్లనుంచి రెండు గంటల ముందే బయలుదేరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మార్పు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రయాణికులు, విమానయాన సంస్థలు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


