
📌 Key Points
- విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ దర్శకత్వంలో ‘ఫంకీ’ చిత్రంలో నటిస్తున్నారు.
- చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ‘రట్టటటావ్’ పాటలో విశ్వక్ హర్ట్ అయినట్లు కనిపించారు.
- చిరంజీవి అనిల్ రావిపూడికి కారు గిఫ్ట్‌గా ఇవ్వడంపై విశ్వక్ సరదాగా అసహనం వ్యక్తం చేశారు.
- నిర్మాత నాగవంశీ కారు ఇస్తానని చెప్పలేదని విశ్వక్ వ్యాఖ్యానించారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘ఫంకీ’ ప్రమోషన్స్‌లో భాగంగా హర్ట్ అయినట్లు కనిపించారు. చిరంజీవి, అనిల్ రావిపూడికి కారు గిఫ్ట్ ఇవ్వడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం.
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ అప్‌డేట్స్
Vishwak Sen: వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen). ప్రస్తుతం విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో ‘ఫంకీ’ (Funky) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర ప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా, అంటే ఫిబ్రవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి రెండవ సాంగ్ ‘రట్టటటావ్’ లిరికల్‌ను విడుదల చేశారు.
‘రట్టటటావ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఏం జరిగింది?
ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ హర్టయ్యారు. ఈ సినిమాలో హీరో నేనా? లేకపోతే నాగవంశీనా? అని స్టేజ్‌పై అన్నారంటే ఏ స్థాయిలో ఆయన హర్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా సరదాగా మొదలై.. ఇలా విశ్వక్ హర్టయ్యే వరకు వెళ్లింది. అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్‌గా తనకు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు దర్శకుడు బాబీకి కూడా చిరు గిఫ్ట్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఓజీ దర్శకుడు సుజీత్‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఓ మీడియా వ్యక్తి ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్‌ని.. ఈ సినిమాతో హిట్ కొడితే నిర్మాత నాగవంశీ ఏమైనా కారు ఇస్తానని చెప్పారా? అని అడిగారు. అంతే, ఒక్కసారిగా విశ్వక్ హర్టయ్యారు.
చిరంజీవి గిఫ్ట్‌పై విశ్వక్ అసహనం!
ఈ సినిమాకు హీరో నేనా? లేకపోతే నాగవంశీనా? అని మీడియా వాళ్లని అడిగారు. అనిల్ రావిపూడికి కారు గిఫ్ట్‌గా ఇచ్చింది ఎవరు? ఆ సినిమా హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా హిట్టయితే దర్శకుడికి కారు గిఫ్ట్‌గా ఇవ్వాల్సింది ఎవరు? హీరోనే కదా. మరి నాగవంశీ ఎందుకొచ్చాడు మధ్యలో? అసలీ సినిమాకు హీరో ఎవరు? నాగవంశీనా? అంటూ ప్రశ్నించారు విశ్వక్ సేన్. సరే.. మీరే ఇవ్వండి అని మీడియా పర్సన్ అనగానే.. లేదు, ముందు మీరు నాగవంశీ అన్నారు కాబట్టి.. అనుదీప్‌ని ఆయన దగ్గరే తీసుకోమనండని అన్నారు. ‘మీరు మెగాస్టార్ రేంజ్‌కి చేరలేదు కదా.. అందుకే నాగవంశీ దగ్గర తీసుకోమని అన్నాము.. మీరు ఇస్తానంటే మరీ మంచిది’ అని మీడియా పర్సన్ అంటే.. ‘లేదు, ఆ ఛాన్స్ పోయింది. నిర్మాతనే ఇవ్వమనండి..’ అంటూ విశ్వక్ సమాధానమిచ్చారు. ఇదంతా ఏదో సీరియస్‌గా జరిగిందని అనుకుంటారేమో.. అదేం లేదు.. చాలా సరదాగానే జరిగింది. విశ్వక్ కూడా అనుదీప్‌ని ఆటపట్టించేందుకే.. ఇలా హర్టయినట్లుగా యాక్ట్ చేశారు. అది విషయం. మరో వైపు అసలు సినిమా హిట్టవ్వనీయండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
మొత్తానికి విశ్వక్ సేన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫంకీ’ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


