
📌 Key Points
- అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం తర్వాత భారీగా బరువు పెరిగి, మళ్ళీ 18 కేజీలు తగ్గారు.
- ఆయన బరువు తగ్గడానికి ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్’ కారణమని స్వయంగా వెల్లడించారు.
- ఈ డైట్ మైగ్రేన్ సమస్యను తగ్గించి, అనూహ్యంగా బరువు తగ్గడానికి సహాయపడిందని అమీర్ తెలిపారు.
- యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం నుండి రక్షణ కల్పిస్తుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. 61 ఏళ్ల వయసులో 18 కిలోల బరువు తగ్గడం వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన వెల్లడించారు. ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్’ ద్వారా మైగ్రేన్ సమస్యను తగ్గించుకుంటూనే, బరువు కూడా తగ్గినట్లు అమీర్ ఖాన్ తెలిపారు.
అమీర్ ఖాన్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ రహస్యం
సినిమాలో పాత్ర ఏదైనా సరే, అందుకోసం తన శరీరాన్ని ఇనుములా మార్చేయడం బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు వెన్నతో పెట్టిన విద్య! ‘3 ఇడియట్స్’ సినిమాలో కాలేజీ విద్యార్థిగా కనిపించాలన్నా, ‘గజినీ’ కోసం సిక్స్ ప్యాక్ బాడీ నిర్మించాలన్నా అది అమీర్‌కే సాధ్యం. మరీ ముఖ్యంగా ‘దంగల్’ చిత్రం కోసం మొదట భారీగా బరువు పెరిగి ముసలి తండ్రిగా నటించి, ఆ వెంటనే కొద్ది నెలల వ్యవధిలోనే పవర్‌ఫుల్ పహిల్వాన్‌గా మారి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రతి సినిమాలోనూ ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటారు. ప్రస్తుతం 61 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో, మరోసారి ఊహించని రీతిలో స్లిమ్‌గా మారి సరికొత్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. తాను ఏకంగా 18 కిలోల బరువు తగ్గానని అమీర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. దీని వెనుక ఒక డైట్ ప్లాన్ ఉందట!
ఈ అసాధారణ మార్పు వెనుక ఉన్న రహస్యాన్ని అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను కేవలం బరువు తగ్గాలనే లక్ష్యంతో ఈ పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
“ఆరోగ్య కారణాల రీత్యా నేను తీసుకుంటున్న కొత్త ఆహార నియమాలు నాపై మంత్రంలా పనిచేశాయి. నేను చాలా కాలంగా తీవ్రమైన మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నాను. అందుకే సాధారణ ఫిట్‌నెస్ ప్లాన్ జోలికి వెళ్లకుండా, నా తిండి అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్’ వల్ల నా మైగ్రేన్ నొప్పులు చాలా వరకు తగ్గిపోయాయి, అదే సమయంలో ఊహించని విధంగా 18 కిలోల బరువు కూడా తగ్గాను,” అని అమీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు.
అమీర్ ఖాన్ తన రోజువారీ భోజన లిస్ట్‌ని పూర్తిగా బయటపెట్టనప్పటికీ, ఆయన ప్రస్తావించిన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వైద్య నిపుణుల ప్రకారం.. ఇది ఏదో తక్కువ సమయంలో బరువు తగ్గించే తాత్కాలిక చిట్కా కాదు, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు, నొప్పులను తగ్గించే ఒక శాశ్వత జీవన విధానం!
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి?
ప్రముఖ వైద్య విద్యాసంస్థ ‘హార్వర్డ్ హెల్త్’ నివేదికల ప్రకారం.. శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే ఇన్‌ఫ్లమేషన్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం (షుగర్), కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) వంటి అనేక ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటికి చెక్ పెట్టడమే ఈ డైట్ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పద్ధతిగా గుర్తింపు పొందిన ‘మెడిటరేనియన్ డైట్’ కూడా ఈ విధానం కిందకే వస్తుంది.
ఈ డైట్‌లో కేలరీలను లెక్కబెట్టడం కంటే, మనం తినే ఆహార నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనిలో ప్రధానంగా రంగురంగుల తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో పాటు ఓట్స్, బ్రౌన్ రైస్, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలను (మిల్లెట్స్) భాగం చేస్తారు. బాదం, జీడిపప్పు, వివిధ రకాల గింజలు, గుండెకు మేలు చేసే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటి పానీయాలను కూడా పరిమితంగా తీసుకుంటారు.
ఈ ఆరోగ్యకరమైన ఆహార శైలిని పాటించేటప్పుడు కొన్ని పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండటం ముఖ్యం! చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, చాక్లెట్లు, మైదాతో చేసిన వైట్ బ్రెడ్, పాస్తా, నూనెలో బాగా వేయించిన బజ్జీలు, సమోసాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌ను అస్సలు ముట్టుకోకూడదు.
ఆరోగ్యానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ప్రయోజనాలు
ఈ విధమైన ఆహార నియమాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. మంచి నిద్ర, రోజంతా ఉత్సాహంగా ఉండటం, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఈ డైట్ ద్వారా సాధ్యమవుతుంది.
కెరీర్ అంతటా కేవలం సినిమా పాత్రల కోసమే కష్టపడిన అమీర్ ఖాన్.. ఈసారి మాత్రం తన వ్యక్తిగత జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ కొత్త అవతారంలోకి మారడం విశేషం.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
అమీర్ ఖాన్ అనుభవంతో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ కేవలం బరువు తగ్గడానికే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ ఎంతగానో తోడ్పడుతుందని స్పష్టమవుతోంది. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక మార్గదర్శకం.


