
📌 Key Points
- ఏఐ వినియోగంతో ఉద్యోగుల ఆదాయం, ఉత్పాదకత పెరుగుతున్నాయని అధ్యయనంలో వెల్లడి.
- చిన్న కంపెనీలు ఏఐ టెక్నాలజీతో బ్యాక్ ఆఫీస్, కస్టమర్ సర్వీస్ మెరుగుపరుస్తున్నాయి.
- సేల్స్‌ఫోర్స్ నివేదిక ప్రకారం, ఏఐలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ఆదాయం 90% పెరిగింది.
- నైపుణ్యాలు లేనివారు ఆదాయంపై ఆశలు కోల్పోతున్నారు, శిక్షణ పొందిన వారు లాభపడుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఒక అధ్యయనం జరిగింది. ఏఐ వినియోగంతో ఉద్యోగుల ఆదాయం, ఉత్పాదకత పెరుగుతున్నట్లు కనుగొన్నారు. చిన్న కంపెనీలు తమ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి.
ఏఐతో ఉద్యోగుల ఆర్థిక ప్రగతి
ఆర్టిఫిషియల్ ఇంటెలినెస్(ఏఐ) వినియోగంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయన్న చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏఐ మానవ జీవితంతో ఎంత విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందో, దానికి అనుగుణంగా కొన్ని ఉద్యోగాలు పోతాయని, కొత్తవి పుట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంక్‌బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఏఐ ఇప్పటికే చాలామంది ఉద్యోగుల ఆర్థిక జీవితాలను మెరుగుపరిచిందని తేల్చింది. ఈ నివేదిక ప్రకారం, 22 నుంచి 45 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో 40 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పటికే ఏఐ కారణంగా తమ ఆదాయం, ఉత్పాదకత పెరిగిందని స్పష్టం చేస్తున్నారు.
చిన్న కంపెనీలకు ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?
ఏఐ సాధనాలు ఎక్కువ ఆదాయం ఆర్జించేందుకు, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయ పడుతున్నాయని 42 శాతం మంది చెప్పారు. ఇదే సమయంలో ఏఐ సంబంధిత మార్పుల వల్ల తమ ఆదాయంపై ప్రభావం పడిందని 12 శాతం మంది చెప్పగా, 8 శాతం మంది ఏఐ టూల్స్‌పై ఎక్కువ ఆధారపడటం వల్ల ఆర్థికంగా నష్టపోయినట్టు తెలిపారు. అయితే, ఏఐతో కలిసి పనిచేసేందుకు తమ స్కిల్స్ పెంచుకున్నవారు ఎక్కువ ప్రయోజనాలు పొందినట్టు నివేదిక స్పష్టం చేసింది. చాలామంది కెరీర్ మధ్యలో ఉన్న ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాల్లో ఏఐని ఉపయోగించడం వల్ల పనితీరు గతంలో కంటే బాగుందని ఎక్కువ మంది ఉద్యోగులు అంగీకరిస్తున్నారు. మరోవైపు ఏఐ-సంబంధిత స్కిల్స్ లేదా అందుకు తగిన ప్రణాళిక లేనివారు తమ ఆదాయంపై ఆశలు సన్నగిల్లుతున్నట్టు చెబుతున్నారు.
నైపుణ్యాల ఆవశ్యకత – నివేదికల విశ్లేషణ
ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలు ఏఐ ఉపయోగించి, కార్యకలాపాలను విస్తరించి ఆదాయం ఆర్జిస్తున్నాయని మరో నివేదికలో స్పష్టమైంది. సేల్స్‌ఫోర్స్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. ఆటోమేటెడ్ సర్వీస్ చాట్‌బాట్స్, మార్కెటింగ్, కంటెంట్ కోసం కంపెనీలు ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏఐ కోసం చేసిన ఈ ఖర్చు ద్వారా తమ ఆదాయం గణనీయంగా పెరిగిందని 90 శాతానికి పైగా కంపెనీలు స్పష్టం చేశాయి. చిన్న కంపెనీలు ఏఐ సంబంధిత టెక్నాలజీని ఉపయోగించి బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్ విభాగాలను మునుపటి కంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో అనుకున్న సమయానికి ఏఐని అందుకోక వెనుకబడ్డామని సుమారు 40 శాతం కంపెనీలు భావిస్తుండగా, అత్యంత వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగినట్టు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం సవాలుగా ఉందని సగానికి పైగా కంపెనీలు తెలిపాయి. అయితే, భద్రత, నిబంధనలకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నది.
ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే చిన్న కంపెనీలకు లాభదాయకం. సరైన నైపుణ్యాలు ఉంటే ఉద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం.


