
📌 Key Points
- భద్రాచలం ఆలయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం
- వచ్చే ఏడాది పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని ఆదేశం
- రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు
- భద్రాచలం తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. ఆలయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీనికి తుది రూపు రానుంది.
మూడు దశల్లో భద్రాచలం ఆలయ అభివృద్ధి
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం కాగా…. సీఎం సూచనల తర్వాత తుది రూపు ఇవ్వనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకార… మొత్తం మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయనున్నారు.
భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం సచివాలయంలోని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందుకు జిల్లా మంత్రులు తుమ్మలతో పాటు పొంగులేటి కూడా హాజరయ్యారు. భద్రాద్రిని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని మంత్రులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…. 200 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపునివ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
పుష్కరాల నాటికి మొదటి దశ పూర్తి
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్‌తో పాటు మొదటి దశ ఆలయ అభివృద్ది పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామన్నారు. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గోదావరి పుష్కరాలలో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కొరివి వీరభద్రస్వామి దేవాలయం, మల్లూరు లోని నరసింహాస్వామి దేవాలయాలను కూడా అభివృద్ది చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి నిలయమన్నారు. ఆలయం, పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు
యాత్రికుల సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్కింగ్ సదుపాయాలు, రహదారుల విస్తరణ, పరిశుభ్రత పరిరక్షణ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాడ వీధుల అభివృద్ధి, కల్యాణ మండప నిర్మాణం, రామవనం అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, తాగునీటి సరఫరా, శుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. కల్యాణ మండపాన్ని ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు లైటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను సమృద్ధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక చర్యలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
మొత్తానికి, భద్రాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. త్వరలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆశిద్దాం.


