|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిడే తనిఖీలు: మొసాద్ తరహా సెక్యూరిటీనా? నకమురా సంచలన వ్యాఖ్యలు!

Published: 07-04-2026, 12:35 AM
ఫిడే తనిఖీలు: మొసాద్ తరహా సెక్యూరిటీనా? నకమురా సంచలన వ్యాఖ్యలు!
  • ఫిడే టోర్నమెంట్‌లో భద్రతా తనిఖీలపై హికారు నకమురా అసహనం వ్యక్తం చేశారు.
  • స్కానింగ్‌లను మొసాద్ ఆపరేషన్లతో పోల్చడంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
  • చెస్‌లో మోసాలను అరికట్టేందుకు ఫిడే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
  • భద్రతా చర్యలపై ఇతర క్రీడాకారులు ఫిర్యాదు చేయలేదని ఫిడే తెలిపింది.

అంతర్జాతీయ చెస్ సమాఖ్య నిర్వహిస్తున్న కాండిడేట్స్ టోర్నమెంట్ వివాదాలకు కేంద్రంగా మారింది. అమెరికన్ చెస్ దిగ్గజం హికారు నకమురా భద్రతా తనిఖీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నకమురా ఆగ్రహం: ఫిడే తనిఖీలపై తీవ్ర విమర్శలు

అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) నిర్వహిస్తున్న ‘కాండిడేట్స్ టోర్నమెంట్’ ఘాటు వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారింది. టోర్నీ సందర్భంగా అమలు చేస్తున్న కఠినమైన భద్రతా తనిఖీలపై అమెరికన్ చెస్ దిగ్గజం హికారు నకమురా (Hikaru Nakamura) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటగాళ్లపై జరుగుతున్న సోదాలను ఆయన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొసాద్’ (Mossad) నిర్వహించే ఆపరేషన్లతో పోల్చడం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారింది.

భద్రతా చర్యలపై ఫిడే వివరణ

చెస్ క్రీడలో టెక్నాలజీ సాయంతో జరిగే మోసాలను (Cheating) అరికట్టడానికి ఫిడే ఈసారి నిబంధనలను కఠినతరం చేసింది. ఆటగాళ్లు హాల్‌లోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు మెటల్ డిటెక్టర్లు, బాడీ స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనిపై నకమురా స్పందిస్తూ.. ‘ప్రతిసారీ ఇలాంటి స్కానింగ్‌లు ఏంటి..? మనం ఏమైనా ఇరాన్‌లోకి చొరబడిన ‘మొసాద్’ ఏజెంట్లమా..? మనం కేవలం చెస్ ప్లేయర్లం మాత్రమే. కొంచెం వాస్తవికంగా ఆలోచించండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, నకమురా వ్యాఖ్యలపై భారతీయ చెస్ క్రీడాకారులు విభిన్నంగా స్పందించారు గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ థిప్సే మాట్లాడుతూ.. చెస్ బోర్డుపై మోసం అనేది చాలా ప్రమాదకరమైనదని అన్నారు. చిన్న చిప్ సాయంతో ఎవరైనా ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించవచ్చని అన్నారు. అందుకు తనిఖీలు తప్పనిసరే కదా అని కామెంట్ చేశారు. అయితే, స్కానింగ్‌కు బదులుగా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని 30 నిమిషాలు ఆలస్యం చేస్తే మోసాలను మరింత సులభంగా అరికట్టవచ్చని ప్రవీణ్ థిప్సే ఆయన సూచించారు.

మోసాలను అరికట్టేందుకే కఠిన నిబంధనలు: ఫిడే

ఈ నకమరా అమెరికన్ చెస్ ఛాంపియన్ విమర్శలపై ఫిడే అధికారులు స్పందిస్తూ.. భద్రతా చర్యలు కేవలం ఆటలో పారదర్శకత కోసమేనని స్పష్టం చేశారు. నకమురా మినహా మరే ఇతర టాప్ ప్లేయర్ ఈ తనిఖీలపై ఫిర్యాదు చేయలేదని వారు వెల్లడించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కోసం జరిగే ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మొత్తానికి ఫిడే టోర్నమెంట్‌లో భద్రతా చర్యలపై నకమురా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఫిడే తన చర్యలను సమర్థించుకుంది, అయితే ఈ వివాదం మరిన్ని చర్చలకు అవకాశం ఇస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.