
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి మదర్ కొణిదెల అంజనాదేవికి ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డు.
- దివ్యవాణి చౌదరి 2026 సంవత్సరానికిగాను ఈ అవార్డులను ప్రదానం చేశారు.
- శ్యామలాదేవి, యాంకర్ స్వప్నతో పాటు పలువురు మహిళలకు పురస్కారం అందజేత.
- హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం.
మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవికి ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డు లభించింది. దివ్యవాణి చౌదరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2026 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
అంజనాదేవికి ‘విశ్వ మహిళ’ పురస్కారం
Anjana Devi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మదర్ కొణిదెల అంజనాదేవి (Konidela Anjana Devi) మొట్టమొదటి ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ (Bapu Bomma Vishwa Mahila)గా రికార్డును క్రియేట్ చేశారు. బాపుబొమ్మగా తెలుగువారి గుండెల్లో నిలిచి, సామాజిక – రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్న నటి దివ్యవాణి చౌదరి (Divyavani Choudary). అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యవాణి.. ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ పేరిట 2026వ సంవత్సరానికిగాను అవార్డ్స్ ప్రదానం చేశారు. కొణిదెల అంజనాదేవి ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమెతో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ) తదితర మహిళామణులు ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.
దివ్యవాణి చౌదరి అవార్డుల ప్రదానం
తెలంగాణ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కంఠంనేని రవిశంకర్, నటుడు – రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు అతిధులుగా హాజరయ్యారు. సినిమా రంగంతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ సేవలందిస్తున్న దివ్యవాణి.. ‘బాపు బొమ్మ- విశ్వ మహిళ’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం.. మెగా మాతృమూర్తి కొణిదెల అంజనాదేవితో శ్రీకారం చుట్టడం అభినందనీయమని హాజరైన వారంతా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. తొలి విడత వేడుకను ఇంత గ్రాండ్‌గా నిర్వహించడమే కాకుండా, అవార్డుకు తగిని అర్హులను ఎంపిక చేయడం గొప్ప విషయమని వారు కొనియాడారు.
అవార్డు వేడుక వివరాలు
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించుకోవడం ద్వారా.. సమాజంలోని సాటి మహిళామణులందరిలో స్ఫూర్తిని రగిలించాలనే వజ్ర సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని దివ్యవాణి తెలిపారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యవాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ అవార్డ్స్’ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా దివ్యవాణి ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే కార్యచరణ ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
మొత్తానికి దివ్యవాణి ‘విశ్వ మహిళ’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సత్కరించడం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందించడం అభినందనీయం.


