
📌 Key Points
- సీఎస్ఆర్ నిధుల సమీకరణ, వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
- రాష్ట్రంలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు, ఇది ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉంటుంది.
- తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ ద్వారా కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వడానికి, ప్రాజెక్టులను ఎంచుకోవడానికి వీలు కలుగుతుంది.
- రాష్ట్రంలో సీఎస్ఆర్ నిధుల వాటా పెంచేందుకు కొత్త విధానాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ఆర్ నిధుల సమీకరణ, వినియోగానికి ప్రత్యేక పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
సీఎస్ఆర్ నిధులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధుల సమీకరణతోపాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు.
ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
శాసనమండలి సమావేశ హాలులో ముఖ్యమంత్రి సీఎస్ఆర్ నిధులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలన్నీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుందని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు
ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్‌లో పొందుపరచాలన్నారు.
కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ ఆకర్షణీయంగా తయారు చేయాలని చెప్పారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ నిధుల వాటా మన రాష్ట్రంలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
ఇప్పటి వరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ నిధులను వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాల్సిన అవసరం ఉందని, మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ సీఎస్ఆర్ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్ ఆవిష్కరణ
ఇతర రాష్ట్రాల్లో సీఎస్ఆర్ సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం చెప్పారు. ఈ వాటాను పెంచుకునేందుకు వీలుగా కొత్త పాలసీ ఉండాలని, కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
రాష్ట్రంలో సీఎస్ఆర్ నిధుల వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త పాలసీతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది.


