
📌 Key Points
- రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా విడుదల మార్చి 19న అని ప్రకటన.
- యుద్ధ పరిస్థితుల వల్ల టాక్సిక్ సినిమా విడుదల జూన్ 4కు వాయిదా.
- పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా చూపడం వల్ల గల్ఫ్‌లో ‘ధురంధర్ 2’ విడుదల కష్టమేనని అంచనా.
- మార్చి 7న ‘ధురంధర్ 2’ ట్రైలర్ విడుదల కానుంది.
మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల కారణంగా రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ విడుదల వాయిదా పడుతుందన్న వార్తల్లో నిజం లేదు. సినిమా మార్చి 19న విడుదల కానుంది. అయితే, యష్ నటించిన ‘టాక్సిక్’ మాత్రం వాయిదా పడింది.
యుద్ధం వల్ల వాయిదా పడ్డ టాక్సిక్
Dhurandhar 2: మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. అయితే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2.. సినిమా ముఖ్యంగా యుద్ధం వల్ల పోస్ట్ పోన్ కానుంది అన్న వార్తలు తెగ వినిపిస్తూ వస్తున్నాయి.
కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం తన విడుదల తేదీని మార్చకుండా ముందుకు సాగుతోంది. మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించారు.
ఇటీవల కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జూన్ 4కు మార్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఆ ప్రాంతాల్లో విమాన ప్రయాణాలు.. సాధారణ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. దీంతో అక్కడి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
‘ధురంధర్ 2’ విడుదలపై నిర్మాతల ప్రకటన
కానీ ధురంధర్ 2 చిత్రానికి ఈ పరిస్థితి పెద్దగా ప్రభావం చూపదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో విడుదల అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా కథలో పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంగా చూపించినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలు సాధారణంగా పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో, అలాంటి కథలున్న సినిమాలను అక్కడ విడుదల చేయడానికి అనుమతులు ఇవ్వరు.
అందువల్ల మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నా ధురంధర్ 2 సినిమాకు పెద్దగా సమస్య ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే కారణంగా ఈ చిత్రం తన అసలు విడుదల తేదీ అయిన మార్చి 19నే థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణవీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేయనున్నారు.
గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్ 2’ విడుదల కష్టాలు
ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే, ఇది కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న పెద్ద చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వాని, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ నటీమణులు కూడా నటిస్తున్నారు.
మొత్తానికి ‘ధురంధర్ 2’ అనుకున్న సమయానికే విడుదల కానుండగా, టాక్సిక్ సినిమా మాత్రం యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఈ రెండు సినిమాల భవితవ్యం ఎలా ఉండనుందో చూడాలి.


