
📌 Key Points
- గిరి ప్రదక్షిణ అనేది ప్రకృతిని దైవంగా భావించి చేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్ర.
- వినాయకుడు తన తల్లిదండ్రులను ప్రదక్షిణ చేసి ముల్లోకాలను చుట్టిన ఫలితాన్ని పొందాడు.
- అరుణాచలం కొండను పరమశివుడి అగ్నిలింగ స్వరూపంగా భావించి ప్రదక్షిణ చేస్తారు.
- గిరి ప్రదక్షిణ వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్మకం.
గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక కాదు, అది ప్రకృతిని దైవంగా భావించి చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. అరుణాచలం, సింహాచలం వంటి ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు, ఇప్పుడు ఇంద్రకీలాద్రి, యాదగిరిగుట్ట వంటి స్థానిక దేవాలయాల్లోనూ ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందుతోంది. దీని వెనుక ఉన్న పరమార్థం, పురాణ గాథలు ఏమిటో తెలుసుకుందాం.
గిరి ప్రదక్షిణ: అర్థం, ప్రాముఖ్యత
గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక కాదు, అది ప్రకృతిని దైవంగా భావించి చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. ఈ మధ్య కాలంలో అరుణాచలం, సింహాచలం తరహాలోనే ఇంద్రకీలాద్రి (విజయవాడ), యాదగిరిగుట్ట వంటి క్షేత్రాల్లో కూడా గిరి ప్రదక్షిణలు ప్రాచుర్యం పొందుతున్నాయి.
‘గిరి’ అంటే కొండ.. ‘ప్రదక్షిణ’ అంటే దైవాన్ని కుడివైపు ఉంచుకుని చుట్టూ తిరగడం. అంటే పవిత్రమైన కొండను లేదా దేవాలయం ఉన్న పర్వతాన్ని భక్తితో చుట్టి రావడంనే గిరి ప్రదక్షిణ అంటారు. పురాణాల ప్రకారం.. గిరి ప్రదక్షిణకు ఆద్యుడు వినాయకుడు. శివపార్వతులు లోకమంతటినీ చుట్టి రమ్మని కుమారస్వామి, వినాయకుడికి పోటీ పెట్టినప్పుడు.. వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలను చుట్టిన ఫలితాన్ని పొందుతాడు. ‘పర్వతం’ అంటే పరమశివుడి రూపం (స్థావర లింగం) అని శాస్త్రం చెబుతుంది. అందుకే అరుణాచలం (తిరువణ్ణామలై) లోని పర్వతాన్ని శివరూపంగా భావించి చేసే ప్రదక్షిణే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, మొదటి గిరి ప్రదక్షిణగా పేరొందింది. అందుకే అరుణాచలం గిరిప్రదక్షిణకు విదేశాల నుంచీ కూడా భక్తులు వస్తుంటారు. పైగా.. గిరిప్రదక్షిణ చేస్తే తాము అనుకున్నవి జరుగుతాయని విదేశీయులు కూడా నమ్ముతున్నారు.
చరిత్ర, పురాణ ప్రస్తావనల ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ గిరి ప్రదక్షిణ సంప్రదాయం తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం వద్ద విస్తృతంగా స్థిరపడింది. అరుణాచలం కొండను స్వయంగా పరమశివుడి అగ్నిలింగ స్వరూపంగా భావిస్తారు. ఈ కొండ చుట్టూ సుమారు 14 కి.మీ. నడిచి చేసే ప్రదక్షిణను “గిరివలం” అంటారు. ప్రతీ నెల పౌర్ణమి తిథి రాత్రి వేళలో లక్షలాది మంది భక్తులు గిరిప్రదక్షిణకు తరలివస్తారు.
రమణ మహర్షి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ మహిమ గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఆయన మాటల్లో, “అరుణాచలాన్ని ధ్యానించడం, దర్శించడం, ప్రదక్షిణ చేయడం.. ఇవే ముక్తికి మార్గాలు” అని భక్తులు నమ్ముతారు. అయితే మూల భావన మాత్రం ఇంకా ప్రాచీనమైనదనే చెప్పాలి. వేదకాలం నుంచే పర్వతారాధన ఉంది. స్కాంద పురాణం, శివ పురాణం వంటి గ్రంథాల్లో పర్వతాలు దైవక్షేత్రాలుగా వర్ణించారు.
పురాణాల ప్రకారం గిరి ప్రదక్షిణ ఆవిర్భావం
సనాతన ధర్మంలో కొండలు, నదులు, చెట్లు దైవ స్వరూపాలు. కొండలపై అరుదైన మూలికలు, వృక్షాలు ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఆ గాలి పీల్చడం వల్ల శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. భగవంతుడి చుట్టూ తిరగడం అంటే “నా జీవితానికి కేంద్ర బిందువు దైవమే” అని ఒప్పుకోవడం. నడక ద్వారా శరీరాన్ని కష్టపెట్టడం (తపస్సు) వల్ల మనసులోని వికారాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ వల్ల కలిగే ప్రయోజనాలపై భక్తులకు గట్టి నమ్మకం ఉంది. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. గిరి ప్రదక్షిణలో మౌనం లేదా దైవ నామస్మరణ ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. కిలోమీటర్ల మేర నడక వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని ఒక రకమైన కాయకల్ప చికిత్సగా కూడా అభివర్ణిస్తారు.
శాస్త్రం ప్రకారం “చంద్రమా మనసో జాతః” అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు. పౌర్ణమి రోజున చంద్రుడు షోడశ కళలతో నిండుగా ఉంటాడు. ఈ సమయంలో చంద్రుడి కిరణాల ప్రభావం వల్ల భూమిపై ఉన్న జీవుల మనస్సు అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. ఆ సమయంలో దైవచింతనతో చేసే గిరి ప్రదక్షిణ మనసులోని ఆందోళనలను తొలగించి, అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. పురాణాల ప్రకారం పౌర్ణమి తిథి నాడు సిద్ధ పురుషులు, అదృశ్య రూపంలో దేవతలు గిరి ప్రదక్షిణ చేస్తారని భక్తుల నమ్మకం. ఆ సమయంలో మనం కూడా ప్రదక్షిణ చేయడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని, మన కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
ఒకప్పుడు గిరి ప్రదక్షిణ అంటే కేవలం అరుణాచలానికే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు.. నిక క్షేత్రాల ప్రాముఖ్యత: భక్తులు తమకు అందుబాటులో ఉన్న శక్తిపీఠాలు (విజయవాడ దుర్గమ్మ), నరసింహ క్షేత్రాల (యాదగిరిగుట్ట, సింహాచలం) పర్వతాలను కూడా పవిత్రంగా భావిస్తున్నారు. పర్వతాన్ని దైవంగా భావించే ‘అద్వైత’ భావన సనాతన ధర్మంలో “స్థావరాణాం హిమాలయః” అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు.. కదలని వాటిలో తాను హిమాలయాన్ని అని చెబుతారు. అంటే ప్రతి పర్వతం ఒక దైవ స్వరూపం. అరుణాచలంలో కొండనే శివుడిగా ఎలా కొలుస్తారో, అలాగే ఇంద్రకీలాద్రిని శక్తి స్వరూపంగా, యాదగిరిగుట్టను విష్ణు స్వరూపంగా భక్తులు భావిస్తున్నారు. ఈ అవగాహన పెరగడం వల్లే భక్తులు ఆలయం లోపల విగ్రహ దర్శనంతో పాటు, ఆ పర్వతం చుట్టూ తిరగడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు
చాలామంది భక్తులు అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ పొందిన మానసిక ప్రశాంతతను, అనుభూతిని తమ స్థానిక క్షేత్రాల్లో కూడా వెతుక్కుంటున్నారు. అరుణాచలం వెళ్లలేని వారు, తమ ఇష్ట దైవం కొలువైన కొండ చుట్టూ తిరగడం ద్వారా అదే ఫలితం లభిస్తుందని నమ్ముతున్నారు. ఇది ఒక రకమైన ‘ఆధ్యాత్మిక చైతన్యం’ (Spiritual Awakening) అని చెప్పవచ్చు.
గిరి ప్రదక్షిణలు ఇప్పుడు ఒక ‘కమ్యూనిటీ ఈవెంట్’ లాగా మారుతున్నాయి. వందల, వేల మందితో కలిసి నామస్మరణ చేస్తూ నడవడం వల్ల భక్తులలో ఒక రకమైన సానుకూల శక్తి (Positive Energy) ఏర్పడుతుంది. ఈ సామూహిక ప్రార్థన వల్ల వ్యక్తిగత ఒత్తిడి తగ్గి, సమాజంతో అనుసంధానం ఏర్పడుతుందనేది సైకాలజీ నిపుణుల అభిప్రాయం. వందలాది మందితో కలిసి నడవడం వల్ల భక్తి భావం పెరగడమే కాకుండా, ఒక సామాజిక ఐక్యత ఏర్పడుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి ఆధ్యాత్మిక నడకలు మెడిటేషన్ లాగా పనిచేస్తుండటంతో యువత కూడా దీనికి ఆకర్షితులవుతున్నారు.
శాస్త్రం ప్రకారం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. భూమి నుంచి వచ్చే శక్తిని గ్రహించడానికి వీలైతే చెప్పులు లేకుండా నడవాలి. కుడి వైపు నుంచే: ఎప్పుడూ కొండ మనకు కుడి వైపు (సవ్య దిశ) ఉండేలా ప్రదక్షిణ చేయాలి. గర్భవతి అయిన స్త్రీ ఎంత నెమ్మదిగా నడుస్తుందో, అంత నెమ్మదిగా భగవంతుడిని స్మరిస్తూ నడవాలి. గిరి ప్రదక్షిణ అంటే కేవలం కొండ చుట్టూ తిరగడం కాదు, మనలోని దైవత్వాన్ని మనం వెతుక్కునే ఒక అంతర్మథన యాత్ర. అందుకే ఇప్పుడు ప్రతి క్షేత్రంలోనూ భక్తులు దీనికి నీరాజనం పడుతున్నారు.
గిరి ప్రదక్షిణ కేవలం ఒక సంప్రదాయం కాదు, ఇది ప్రకృతితో మమేకమై దైవత్వాన్ని అనుభవించే ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గం. శారీరక, మానసిక ప్రశాంతతను అందించే ఈ పవిత్ర నడక మన సనాతన ధర్మంలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది.


