
ఏపీలో థియేటర్ల బంద్‌పై సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు విడుదల ముందు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై విచారణ జరుగుతోంది. మంత్రి దుర్గేష్ ప్రభుత్వం సినీ రంగానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Key Points
హరిహర వీరమల్లు విడుదలకు ముందు థియేటర్ల బంద్‌పై విచారణ జరుగుతోంది.
సినిమా పరిశ్రమపై ప్రభుత్వం కక్ష సాధించడం లేదని మంత్రి స్పష్టీకరణ.
సినిమా రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి ప్రకటన.
నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
థియేటర్ల బంద్‌పై విచారణ
ఏపీలో థియేటర్ల బంద్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, సినీ పరిశ్రమ పెద్దలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. థియేటర్ల బంద్ వ్యవహారంపై కేవలం విచారణ మాత్రమే చేయమన్నాం.. అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదని మంత్రి వివరణ ఇచ్చారు. సినిమా పరిజ్ఞానం లేనివారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజ మహేంద్ర వరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు.
సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, హోం శాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు.
ప్రభుత్వం సినీ పరిశ్రమకు మద్దతు
జూన్ 12న విడుదల కానున్న “హరిహరవీరమల్లు” చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికితీస్తామన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
సినిమా టికెట్ల రేట్లు పెంచమని సినీ రంగం నుండి నిర్మాతలు విడివిడిగా వచ్చి తమను కలుస్తారని, తాము కూడా అందుకు సరే అని చెబుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని తద్వారా అధికారులు కోర్టులు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొందన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందన్నారు. ఈ విధానాలన్నింటికి చెక్ పెట్టి నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాలను తీసుకురావాలని భావించామన్నారు.
సినిమా రంగం వ్యాపారమని కొందరు మాట్లాడుతున్నట్లుగా సినిమా రంగానికి ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు గత ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. నిర్ణయాలు ఎందుకు చేశారని నిలదీశారు. తహసిల్దార్ లను థియేటర్ల దగ్గర పెట్టి రేట్లను ఎందుకు నియంత్రించారు అని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు.
ఇక మీదటైనా అందరూ కలిసికట్టుగా, సరైన రీతిలో వ్యవహరించాలన్నారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది సహేతుకంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు.
నూతన ఫిల్మ్ పాలసీ
సినిమా టికెట్ పై రూపాయి పెంచితే ప్రభుత్వానికి 25 పైసలు జీఎస్టీ వస్తుందన్నారు. ఈ అంశాన్ని ఇటీవల రాజమహేంద్రరంలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ఫ్రీరిలీజ్ వేడుకల్లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే తరుచూ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు.
సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కలవలేదని తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా అని ప్రశ్నించారు. డీజీపీని తామేదో అరెస్ట్ లు చేయమన్నామని వక్రభాష్యాలు చెప్పేవాళ్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి వాతవరణం ఏంటని ప్రశ్నించామన్నారు. తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నామని, అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టతనిచ్చారు.
సినిమా అనే రంగాన్ని తాము ఉన్నతంగా చూస్తామన్నారు. అది ప్రజలకు వినోదాన్ని కలిగించే మాధ్యమంగా భావిస్తున్నామన్నారు. అంతేతప్ప గత ప్రభుత్వంలా తాము సినిమా హీరోలను, సినీ పెద్దలను కించపరమన్నారు. సినీ రంగంపై కక్ష సాధింపు చర్యలు తీసుకోబోమని స్పష్టతనిచ్చారు.
హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఏర్పడిన థియేటర్ల బంద్ సమస్యకు ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపుతుందని, నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా సినీ రంగానికి మరింత మెరుగైన వాతావరణం కల్పిస్తుందని మంత్రి ఆశావహంగా వెల్లడించారు.


