
📌 Key Points
- కన్నడ హీరోయిన్ల సంచలన ప్రకటన: అసభ్యకరంగా చిత్రీకరిస్తే సహించం.
- పబ్లిక్ ఈవెంట్స్‌లో తమ శరీర భాగాలపై జూమ్-ఇన్‌లను ఖండించిన హీరోయిన్లు.
- వ్యక్తిగత గౌరవాన్ని ఉల్లంఘించడాన్ని సహించేది లేదని స్పష్టం చేసిన నటీమణులు.
- సినిమా వేడుకలను కవర్ చేసేవారు వృత్తిపరమైన బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రుక్మిణి వసంత్, సప్తమీ గౌడ, ఆషిక రంగనాథ్ వంటి హీరోయిన్లు తమకు ఎదురవుతున్న అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలపై తీవ్రంగా స్పందించారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో తమను అసభ్యకరంగా చిత్రీకరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హీరోయిన్ల ఆగ్రహానికి కారణం?
Heroines: ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తుంటే.. మరోవైపు నటీమణులు సోషల్ మీడియా వేదికగా మరో వార్‌కు తెరలేపారు. ఇది అలాంటిలాంటి వార్ కాదు. అందులో యంగ్ హీరోయిన్లు ఇలాంటి వార్‌ను ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన అందాల భామలు (Kannada Heroines) రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), సప్తమీ గౌడ (Sapthami Gowda), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath).. సోషల్ మీడియా వేదికగా వార్ ప్రకటించారు. సినిమాలలో వారు ఎంత స్పైసీగా కనిపించినా, ఎంత ఎక్స్‌పోజ్ చేసినా ఓకే కానీ, వారు హాజరయ్యే పబ్లిక్ ఈవెంట్స్‌లో మాత్రం ఎలా పడితే అలా ఫొటోలు, వీడియోలు తీయకూడదట? ఇదే వారు లేవనెత్తిన ప్రధానాంశం. వాస్తవానికి వారు చేస్తున్న ఈ పోరాటం అనుచితమైనదే అని చెప్పుకోవాలి. ఇటీవల శివాజీ దీని గురించే కదా మాట్లాడింది. ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్‌కు చక్కగా చీర కట్టుకుని వస్తే ఏ బాధ ఉండదు, అంతా గౌరవంగా చూస్తారని చెబితే, అందరూ కాదు కానీ.. కొంత మంది తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా మమ్మల్ని ఇబ్బందిగా చూపిస్తున్నారంటూ వాళ్లే.. యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అసలింతకీ ఈ భామల యుద్ధం దేనికంటే..
సెలబ్రిటీల సమస్యలపై హీరోయిన్ల పోరాటం
‘‘సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలుగా మాకు ఎదురవుతున్న ఒక రిపీటెడ్ సమస్యను పరిష్కరించడానికి మేమంతా ఏకమయ్యాము. మేమంతా పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు మా వీడియోలు, ఫోటోలను తరచుగా అసభ్యకరమైన విధంగా చిత్రీకరించడం, మా పని కంటే మా శరీర భాగాలపైనే అనవసరంగా జూమ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి, వైరల్ చేయడం జరుగుతోంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇటువంటి పనులు గౌరవప్రదమైనవి కావు, అసలు ఆమోదయోగ్యం కానే కావు. మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, ముఖ్యంగా సినిమా కోసం. ఉద్దేశపూర్వకంగా చేసే ఇటువంటి జూమ్-ఇన్‌లను, అసభ్యకరమైన యాంగిల్స్‌ను మేము ఖండిస్తున్నాము. ఇవి వ్యక్తిగత గౌరవాన్ని ఉల్లంఘించడమే. ఇలాంటి ప్రవర్తనను మేము ఎంతమాత్రం సహించం, దీనిని సాధారణ విషయంగా చూడలేము. సినిమా వేడుకలను కవర్ చేసే వారు వృత్తిపరమైన బాధ్యతతో, కనీస గౌరవం, మర్యాదలతో వ్యవహరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ విషయంలో మేమంతా ఒకే మాటపై ఉన్నాము. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న ప్రతి మహిళకు మేము అండగా ఉంటాం. మాకు దక్కాల్సిన గౌరవం కోసం మేమంతా ఒకరికొకరు మద్దతుగా నిలుస్తాం’’ అని సోషల్ మీడియా వేదికగా రుక్మిణీ వసంత్, సప్తమీ గౌడ, ఆషిక రంగనాథ్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
గౌరవం కోసం హీరోయిన్ల ఐక్యత
పబ్లిక్ ఈవెంట్స్‌కు పద్దతిగా వస్తే.. ఎవరూ పట్టించుకోరని, కావాలని సగం సగం డ్రస్‌లు వేసుకుని వచ్చే వారి గురించి కూడా వాళ్లు మాట్లాడితే బాగుంటుంది. అందంగా కనిపించాలని అంతా అనుకుంటారు. కానీ శరీర భాగాలు కనిపించాలని చూసే, ప్లాన్ చేసే హీరోయిన్లు ఉన్నంతకాలం.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి.. ముందు మీ నుంచే జాగ్రత్త పడటం మంచిదని, ఈ పోస్ట్‌లకు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో సమాజం ఉందో గమనించి, మసులుకుంటే మంచిదని వారు హితబోధ చేస్తున్నారు. చూద్దాం మరి.. ఈ వార్ ఎంత వరకు వెళుతుందో?
హీరోయిన్లు తమ గౌరవం కోసం ఐక్యంగా పోరాడుతున్నారు. సినిమా వేడుకల్లో అసభ్యకరమైన ప్రవర్తనను సహించబోమని వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.


