
📌 Key Points
- కాలిఫోర్నియాలో కుమార్ జువెల్లర్స్‌లో భారీ దోపిడీ.
- నిమిషంలో రూ.16 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఎత్తుకెళ్లిన ముఠా.
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
- దోపిడీకి ముందు దొంగిలించిన కార్లలో పరారైన నిందితులు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రీతిలో భారీ దోపిడీ జరిగింది. కుమార్ జువెల్లర్స్‌లో నిమిషంలో రూ.16 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
నిమిషంలో రూ.16 కోట్ల దోపిడీ
అమెరికాలోని (California) కాలిఫోర్నియాలో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్‌లో ఓ భారీ చోరీ జరిగింది. ఫ్రీమాంట్ నగరంలో ఓ భారతీయ సంతతికి చెందిన కుటుంబం నిర్వహిస్తున్న నగల దుకాణంలోకి చొరబడిన భారీ ముఠా.. కేవలం ఒక్క నిమిషంలోనే ఏకంగా రూ.16 కోట్ల (1.7 మిలియన్ డాలర్లు) విలువైన బంగారం, వజ్రాలను దోచుకెళ్లింది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేయడంతో ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది జూన్ 18న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 24 మందికి పైగా ఉన్న దుండగుల ముఠా మూతికి నల్ల మాస్కులు, హుడీస్ ధరించి స్థానికంగా ఉన్న ‘కుమార్ జువెల్లర్స్’లోకి ఒక్కసారిగా చొరబడ్డారు. చేతుల్లో సుత్తెలు, ఇతర ఆయుధాలు, వీపున బ్యాగులు తగిలించుకుని వచ్చిన వీరు.. కనురెప్ప మూసి తెరిచేలోపే (కేవలం ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో) షాపులోని అద్దాలు పగులగొట్టారు. క్షణాల్లో కనబడిన బంగారం, వజ్రాలను బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. ఈ దోపిడీ కారణంగా ఆ దుకాణంలో ఉన్న సుమారు 75 నుంచి 80 శాతం మేర స్టాక్ చోరీకి గురైంది.
సీసీటీవీ దృశ్యాలు విడుదల
చోరీ అనంతరం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ముందుగానే దొంగిలించి పెట్టుకున్న వేర్వేరు కార్లలో వివిధ మార్గాల్లో పారిపోయారు. అవి దొంగిలించిన కార్లు కావడంతో లైసెన్స్ ప్లేట్ రీడర్ల ద్వారా కూడా వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, నిందితులు పారిపోతున్న ఒక నల్లటి అక్యురా కారును పోలీసులు వెంబడించారు. దట్టమైన నివాస ప్రాంతాల గుండా గంటకు 80 మైళ్ల వేగంతో ఆ కారు దూసుకుపోయింది. ఈ క్రమంలో నిందితులు స్టాప్ బోర్డులను పట్టించుకోకుండా, ఇతర వాహనాలను రాంగ్ రూట్‌లో ఓవర్‌టేక్ చేస్తూ ప్రమాదకరంగా కారును నడిపినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
నలుగురు అనుమానితుల అరెస్ట్
ఈ కేసుకు సంబంధించి 19 నుంచి 20 ఏళ్ల వయసున్న నలుగురు అనుమానితులను (అఫతుపెటాయ్కి ఫాసిసిలా, జోస్ హెర్రాడా-అరగాన్, ఆండ్రెస్ పాలెస్టినో, టామ్ పార్కర్ డోనెగాన్) పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో ఫాసిసిలా, పాలెస్టినోలను తర్వాత విడుదల చేశారు. ముఠాలోని మెజారిటీ సభ్యులు ఇంకా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూనే ఉన్నారు. ఈ దోపిడీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో ముఠాలుగా ఏర్పడి దుకాణాలపై పడి దోచుకెళ్లే (Smash-and-Grab) ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి మూక దాడులు పెరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.


