
📌 Key Points
- కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు.
- గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి.
- ప్రజావేదిక కూల్చివేత, రూ.10 లక్షల కోట్ల అప్పులపై చంద్రబాబు గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని సీఎం వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొడ్డలి పార్టీని “పాయిజన్ పాలిటిక్స్” అంటూ తీవ్రంగా విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వం “పాజిటివ్ పాలిటిక్స్”తో ప్రజల్లో నమ్మకాన్ని నిలబెడుతోందని, అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు.
కూటమి పాలన: నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతగా భావిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో ‘2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట భారీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు…. మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టడమే కాకుండా, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టేలా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ లతో కలిసి నాడు ఇచ్చిన పిలుపును గౌరవించి 57 శాతం ఓట్ షేర్, 164 సీట్లతో ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని ప్రతిజ్ఞ చేశారు.
2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన గత ప్రభుత్వ అరాచక పాలన రూ.10 లక్షల కోట్ల అప్పులతో ముగిసిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. “గత పాలకులు ఎమ్మార్వో ఆఫీసులు, ఆసుపత్రులు, చివరకు మద్యం ద్వారా వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారు. యావత్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఆ గొడ్డలి పార్టీకి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు,” అని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ అరాచకాలపై చంద్రబాబు విమర్శలు
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి, రాష్ట్ర రాజధానిని ‘మావిగనో.. వాటికనో’ అన్నట్లు మార్చేసిన వైసీపీ తీరును సీఎం ఎద్దేవా చేశారు. తాము అమరావతి, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.
కేవలం 36 రోజుల్లోనే రాయలసీమలోని పుట్టపర్తికి ఐదో జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని….. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గని తవ్వకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు వస్తుంటే, అమరావతికి ప్రతిష్టాత్మక ‘క్వాంటం వ్యాలీ’ వస్తోందని వెల్లడించారు.
పాలనా సౌలభ్యం కోసం అడ్డగోలు జిల్లాల విభజనను సరిచేసి మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, రీసర్వే ద్వారా శెట్టిపల్లి లాంటి దశాబ్దాల నాటి భూ వివాదాలను పరిష్కరించామన్నారు. ప్రజలపై రూ.4,668 కోట్ల భారాన్ని మోపకుండా, తొలిసారి ట్రూ డౌన్ (True Down) విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జే-బ్రాండ్ మద్యంతో మహిళల మంగళసూత్రాలు తెంచిన వైసీపీ …. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులు
“కూటమిది ఎల్లప్పుడూ పాజిటివ్ పాలిటిక్స్.. కానీ గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్. ఎమ్మెల్యేలు ప్రజా సేవకులు మాత్రమే కానీ, పెత్తందారులు కాదు. ఎవరు తప్పు చేసినా…. ఎంతటి వారైనా వదిలిపెట్టను,” అని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. త్వరలోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడుగడుగునా అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి , పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి చేయూతనిస్తోందన్నారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న మోదీని చంద్రబాబు అభినందించారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేసిన ఘనత ప్రధానిదన్నారు. 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 160 ఎయిర్‌పోర్టుల నిర్మాణం, చంద్రయాన్, గగన్‌యాన్ విజయాలు భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచాయని కొనియాడారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
చంద్రబాబు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిందని, గత పాలన లోపాలను సరిదిద్దుతోందని ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం పంపారు.


