
📌 Key Points
- మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.
- రూ. 16 వేల కోట్ల ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచే కుట్ర జరుగుతోందని కేటీఆర్ అన్నారు.
- పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే బీఆర్‌ఎస్ అడ్డుకుంటుందని కేటీఆర్ హెచ్చరించారు.
- మూసీ అభివృద్ధికి మద్దతు తెలుపుతూనే పేదల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మూసీపై కేటీఆర్ ఆందోళన
ఎలాంటి విధ్వంసం లేకుండా కూడా మూసీని సుందరీకరణ చేయవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటికి నష్టం జరగకుండా మూసీని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఇవాళ నాగోల్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధిని కేటీఆర్ పరిశీలించారు. మూసీ ప్రణాళికలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే బీఆర్‌ఎస్ అడ్డుకుంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ జరుగుతోంది. రూ. 16 వేల కోట్ల ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచే కుట్ర చేస్తున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో వేల కోట్ల అవినీతి ప్రయత్నం చేస్తోంది. పేదల ఇళ్లకు రెడ్ మార్కులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతోంది” అని కేటీఆర్ దుయ్యబట్టారు.
ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
“రూ. 16 వేల కోట్లతోని పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి పెంచిండు. రెండున్నరేళ్ళు అయింది కానీ కనీసం డీపీఆర్ లేదు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు రెడ్ మార్క్ వేస్తున్నారు. అధికారులు వచ్చి అనధికారికంగా బెదిరిస్తున్నారు”అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
తెలంగాలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. “మూసీ అభివృద్ధికి మద్దతు.. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. నాగోల్‌లో ఎవరికీ ఇబ్బంది లేకుండా మూసీ అభివృద్ధి చేశాం. మూసీ పేరిట హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తోంది కాంగ్రెస్. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై అసెంబ్లీలో పోరాడతాం. కాంగ్రెస్ గ్యారెంటీలు కాదు.. ప్రజలకు భయమే మిగిలింది. పేదల ఇళ్లను కూల్చి అవినీతి చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మూసీ అభివృద్ధికి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందని, కానీ పేదల ఇళ్లను కూల్చివేసి అవినీతికి పాల్పడితే అడ్డుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో పోరాడతామని ఆయన తెలిపారు.


