
📌 Key Points
- గ్యాస్ కొరత భయంతో వినియోగదారుల నుంచి భారీగా రీఫిల్ బుకింగ్స్ వస్తున్నాయి.
- సాధారణ రోజుల కంటే 8-10 రెట్లు బుకింగ్ కాల్స్ పెరగడంతో సిస్టమ్ క్రాష్ అయింది.
- బుకింగ్ గ్యాప్‌ను కేంద్రం 25 రోజులకు పెంచడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది.
- వాట్సాప్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సంస్థ సూచించింది.
దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో, ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బుకింగ్ సిస్టమ్ క్రాష్‌కు కారణం ఏమిటి?
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ, ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ఇండేన్ (Indane) బుకింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందన్న భయంతో వినియోగదారులు భారీగా రీఫిల్ బుకింగ్స్ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
వినియోగదారుల ఆందోళనకు దారితీసిన అంశాలు
సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ కాల్స్ సంఖ్య ఒక్కసారిగా 8 నుంచి10 రెట్లు పెరగడంతో ఇండేన్ ఐవీఆర్ఎస్ (IVRS), ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఓవర్‌లోడ్ అయ్యి మొరాయించాయి. ఇవాళ ఉదయం నుంచే వినియోగదారులు ఫోన్ ద్వారా లేదా యాప్ ద్వారా బుక్ చేయడానికి ప్రయత్నించగా, సిస్టమ్ స్పందించకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంతో వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ పానిక్ బుకింగ్ వల్ల వెబ్‌సైట్, సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పడింది.
ప్రత్యామ్నాయ బుకింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయా?
కేంద్ర ప్రభుత్వం బుకింగ్ గ్యాప్‌ను 25 రోజులకు పెంచడంతో తమకు సిలిండర్ అందుతుందో లేదో అన్న కంగారులో జనం బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. సిస్టమ్ క్రాష్ అయినప్పటికీ.. వాట్సాప్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్ (Indian Oil ONE app) ద్వారా ప్రయత్నించాలని, రాత్రి 10 గంటల తర్వాత బుకింగ్స్ సులభంగా అయ్యే అవకాశం ఉందని సంస్థ సూచించింది.
గ్యాస్ సరఫరాపై నెలకొన్న ఆందోళన తాత్కాలికమేనని, ప్రజలు ఆందోళన చెందకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


