|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను కాపాడి మహేశ్ బాబు దెబ్బలు తగిలించుకున్నారు, చర్మం కూడా పోయింది- సూపర్ స్టార్ గొప్పతనంపై చైల్డ్ ఆర్టిస్ట్ కామెంట్స్

Published: 25-09-2025, 10:53 PM
నన్ను కాపాడి మహేశ్ బాబు దెబ్బలు తగిలించుకున్నారు, చర్మం కూడా పోయింది- సూపర్ స్టార్ గొప్పతనంపై చైల్డ్ ఆర్టిస్ట్ కామెంట్స్

మహేశ్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నారు. ‘స్పైడర్’ సినిమా షూటింగ్‌లో ఓ ప్రమాదం జరిగినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ నస్రీన్‌ను కాపాడి, తనకు దెబ్బలు తగిలించుకున్నారు. ఈ సంఘటన మహేశ్ బాబు గొప్పతనాన్ని చాటిచెప్తోంది.

Key Points

1

మహేశ్ బాబు గుండె శస్త్రచికిత్సలు, గ్రామాల దత్తత వంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

2

చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ నస్రీన్ 'స్పైడర్' మూవీ, డెన్వర్ పర్ఫ్యూమ్ యాడ్‌లో మహేశ్ బాబుతో కలిసి పనిచేసింది.

4

మహేశ్ బాబు మోచేయికి చర్మం పోయినట్లు దెబ్బలు తగిలినా, మదిహకు మాత్రం చిన్న గాయం కూడా కాలేదు.

మహేశ్ బాబు: రీల్ హీరోతో పాటు రియల్ హీరో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్నో మంచి కార్యక్రమాలతో రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని కూడా అనిపించుకున్నారు. చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల నుంచి గ్రామాలను దత్తత తీసుకోవడం వరకు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్న పిల్లలను కాపాడేందుకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. మనసుకు హత్తుకునే పనులు చేసే మహేశ్ బాబు సినిమా షూటింగ్‌లో కూడా తోటివారికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఏం కాకుండా చూసుకుంటారని తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోన్న ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు గొప్పతనం గురించి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ నస్రీన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ స్పైడర్ మూవీతోపాటు డెన్వర్ పర్‌ఫ్యూమ్ యాడ్ షూటింగ్ కూడా చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో స్పైడర్ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ విషయాన్ని తెలిపింది మదిహ.

“మహేశ్ బాబు గారు నీతో ఎలా ఉండేవారు” అన్న యాంకర్ ప్రశ్నకు “చాలా బాగా చూసుకుంటారు” అని చెప్పిన మదిహ నస్రీన్ స్పైడర్ సినిమాలో పెద్ద బండ రాయితో జరిగే విపత్తు సీన్ షూటింగ్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిపింది.

చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ ‘స్పైడర్’ అనుభవం

“స్పైడర్ మూవీలో నన్ను ఎత్తుకుని పరిగెడుతుంటారు కదా. అప్పుడు జూనియర్స్ (జూనియర్ ఆర్టిస్ట్స్) కాలు తగిలి కింద పడిపోయాం. నన్ను మొత్తం ఇలా చేతులతో పట్టుకున్నారు. కొంచెం కూడా నాకు దెబ్బ తగలకుండా చుట్టేసుకున్నారు. కానీ, తనకు మాత్రం ఫుల్‌గా దెబ్బలు తగిలాయి. మోచేయికి స్కిన్ పోయినట్లు దెబ్బలు తగిలాయి” అని చేతులో చూపిస్తూ చెప్పుకొచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ నస్రీన్.

“ఎరికి మహేశ్ బాబు గారికా” అని యాంకర్ అడిగితే “అవును మహేశ్ బాబు గారికి” అని మదిహ చెప్పింది. “సో డెన్వర్ పర్‌ఫ్యూమ్ యాడ్‌లో నేను ఇలా చెప్పాను. సర్ నేను మీతో స్పైడర్ మూవీ చేశాను అంటే యా యా నాకు గుర్తుంది. మనం ఆరోజు పడిపోయాం కదా. నీకు కొంచెం కూడా దెబ్బలు తాకలేదు. తాకకుండా ఉండే నేను అని చెప్పారు” అని మదిహ వెల్లడించింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్స్, అభిమానులు మహేశ్ బాబు మంచితనం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. “చిన్న పిల్లలకు ఏం కానివ్వడు మా అన్న”, “మా అన్న బంగారం”, “బాబు ఎప్పుడు గోల్డే” అంటూ మహేశ్ బాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మహేశ్ మంచితనంపై నెటిజన్ల ప్రశంసలు

ఇక మరొకరు అయితే పోకిరి సినిమాను గుర్తు చేస్తూ “చాలా ఏళ్ల క్రితం అలీ భాయ్‌కి పండుగాడు చెప్పాడు. ఆడాళ్లకి, చిన్న పిల్లలకు ఏం కాకూడదు.. ఇది పాలసీ” అని కామెంట్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే, మహేశ్ బాబుకు గౌరవం ఇవ్వకుండా తను అనడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

దానికి చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ వివరణ ఇచ్చుకుంది. “నేను అగౌరవపరచడానికి అలా చెప్పలేదు. తను అనేది గౌరవమైన పదమే అనుకున్నా. అందుకే యూజ్ చేశాను. నేను నిజానికి ముస్లిం ను. ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి” అని దండం పెడుతున్న ఎమోజీతో రాసుకొచ్చింది బేబీ మదిహ నస్రీన్.

కాగా, ఎన్నో సినిమాలు, సీరియల్స్‌తో అలరించిన బేబీ మదిహ నస్రీన్ ఇటీవల లిటిల్ హార్ట్స్ మూవీలో నీలాంబరిగా అట్రాక్ట్ చేసింది. హీరోయిన్ చెల్లెలిగా యాక్ట్ చేసి మెప్పించింది.

చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ వెల్లడించిన ఈ సంఘటన, మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ ఎంత గొప్ప మానవతావాదో స్పష్టం చేసింది. నెటిజన్లు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.