
📌 Key Points
- మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు నమోదు.
- ఎర్నాకులం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
- 2022లో నటి ఫ్లాట్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.
- చిదంబరంపై BNS సెక్షన్ 74, 75 కింద కేసు నమోదు.
మంజుమ్మెల్ బాయ్స్ చిత్ర దర్శకుడు చిదంబరం లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఒక మలయాళ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
చిదంబరంపై లైంగిక వేధింపుల ఆరోపణలు
Manjummel Boys: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాలలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే వార్తల్లోకి ఎక్కేస్తోంది. ఇకపోతే వ్యక్తిగత సినిమాల కారణంగా సెలబ్రిటీలు వార్తల్లో నిలిస్తే.. మరికొంతమంది లైంగిక వేధింపుల కేసుల్లో వార్తల్లో నిలవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు చిదంబరం (Chidambaram) వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
మలయాళ సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన చిదంబరం.. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నాడు. చిదంబరంపై కేరళలోని ఎర్నాకులం సౌత్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మార్చి 2న ఒక మలయాళ నటి ఫిర్యాదు మేరకు ఈకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదు చేసిన నటి వివరాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన మలయాళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారగా.. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఇకపోతే పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2022లో ఎర్నాకులం ప్రాంతంలో ఉన్న సినీనటి ఫ్లాట్ లో ఈ లైంగిక వేధింపులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిదంబరం అక్రమంగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించి.. లైంగిక ఉద్దేశంతో అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదుదారు మహిళ తన వాంగ్మూలంలో తెలిపింది.
ఇకపోతే ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. చిదంబరం పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 (మహిళ గౌరవాన్ని అవమానించే ఉద్దేశంతో దాడి లేదా బల ప్రయోగం), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ విచారణను5విస్తృత స్థాయిలో కొనసాగిస్తున్నారు. త్వరలోనే చిదంబరాన్ని విచారణకు పిలిచే అవకాశం ఉందని.. దర్యాప్తు ఫలితాల ఆధారంగానే అరెస్టు సహా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.
సినీ పరిశ్రమలో కలకలం
మలయాళంలో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈయన 2021లో Jan.E.Man అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం కూడా ఈయనకు విమర్శకుల ప్రశంసలు అందించింది. కానీ మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక ప్రస్తుతం తన మూడో సినిమాగా బాలన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.


