
📌 Key Points
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
- లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ మిలీషియా సభ్యులు, మహిళా నక్సలైట్లు ఉన్నారు
- డీజీపీ శివధర్ రెడ్డి ప్రకారం మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు
- గడిచిన రెండేళ్లలో 700 మందికి పైగా మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. వీరు ఆయుధాలు అప్పగించి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి పునరావాసం కల్పిస్తోంది.
సీఎం సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు
మావోయిస్టుల లొంగుబాటుల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇటీవలనే దేవ్ జీతో పాటు పలువురు అగ్రనేతలు లొంగిపోయారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారు. ఆయుధాలను అందజేసి వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ మిలీషియా సభ్యులు, ఇతర నాయకులు, మహిళా నక్సలైట్లు ఉన్నారు.
బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి…
డీజీపీ వెల్లడించిన వివరాలు
ముందుగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు.మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వీరిలో అత్యధికంగా ఛత్తీస్ ఘడ్ కు చెందినవారని, తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒక్కరు ఉన్నారని పేర్కొన్నారు. లొంగుబాటు వేళ 124 ఆయుధాలను అందజేశారని వెల్లడించారు.
మావోయిస్టుల లొంగుబాటుకు కారణాలు
గడిచిన రెండేళ్లలో 700కిపైగా వరకు మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ఇటీవలనే నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు లొంగిపోయారని గుర్తు చేశారు. ఇంకా తెలంగాణ నుంచి ఏడుగురు అజ్ఞాతంలో ఉన్నారని… వీరు కూడా జనజీవనంలోకి రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద విజయం. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.


