
📌 Key Points
- మార్క్ కె రాబిన్ 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.
- ‘దండోరా’ చిత్రానికి గాను గద్దర్ అవార్డు అందుకున్నారు.
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మార్క్ కె రాబిన్.
- దర్శకుడు మురళి కథాంశం నన్ను ఇన్స్‌పైర్ చేసిందని అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ ‘దండోరా’ చిత్రానికి గాను గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గద్దర్ అవార్డుతో సత్కారం
Mark K Robin: చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే రోజులివి. అలాంటిది ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించి కూడా, తన ప్రొఫైల్‌ని బయటికి అంతగా రానివ్వని మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ (Music Director Mark K Robin). దాదాపు 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు మార్క్ కె రాబిన్. నాగార్జున ‘ది ఘోస్ట్’, ప్రియదర్శి ‘మల్లేశం’, తేజ సజ్జా ‘జాంబీరెడ్డి’, తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’, నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలకు సంగీతం అందించిన మార్క్ రాబిన్ పేరు ఈ మధ్య బాగా వైరల్ అయింది. అందుకు కారణం ‘దండోరా’ (Dhandoraa) చిత్రం. ఈ సినిమాకు అందించిన సంగీతానికిగానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్ (Gaddar Award)తో సత్కరించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంగీత దర్శకుడి పేరు బాగా వైరల్ అవుతోంది. తనకు గద్దర్ అవార్డు వరించడంపై తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మార్క్ కె రాబిన్ స్పందన
‘‘దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డ్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు మరింత మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఒక స్ఫూర్తిగా ఈ అవార్డ్ నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. గద్దర్ అవార్డ్‌తో సంగీత దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగింది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘దండోరా’ డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఇన్స్‌పైర్ చేసింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక.. నిజంగా నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే ఆ సినిమాకు సంగీతాన్ని అందించాను.
సంగీత ప్రస్థానం గురించి
నాకు కమర్షియల్ సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ వర్క్ నాని మజ్ను సినిమాకు చేశా (ట్రైలర్‌కు బీజీఎం ఇచ్చాను). అది కమర్షియల్ మూవీ. స్టార్ హీరోల చిత్రాలకు ఎలాంటి బీజీఎం ఇవ్వాలనేది పూర్తిగా అవగాహన ఉంది. ప్రభాస్ కోసం కొన్ని బీజీఎంలు రెడీ చేసి పెట్టాను. మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో ఆయనను కలిసి దగ్గరగా చూశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ సందర్భం ఒక స్వీట్ మెమొరీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ‘కథాకళి’ అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను. ఒక స్టార్ హీరో సినిమాకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.
మార్క్ కె రాబిన్‌కు గద్దర్ అవార్డు రావడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ అవార్డు ఆయనకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలకు సంగీతం అందించాలని కోరుకుందాం.


