
📌 Key Points
- దక్షిణ భారతదేశంలో తొలి రుతుస్రావం వేడుకగా జరిగినా, ఆ తర్వాత బాలికలపై అనేక ఆంక్షలు విధిస్తారు.
- ఈ ఆంక్షలు బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, పాఠశాలలకు దూరం చేస్తున్నాయి.
- రుతుస్రావంపై బహిరంగ చర్చ లేకపోవడం అపోహలకు, బాలికల్లో గందరగోళానికి దారితీస్తుంది.
- పరిశుభ్రత సౌకర్యాల లోపం, సామాజిక కళంకం బాలికలు బడి మానేయడానికి ప్రధాన కారణాలు.
మెన్‌స్ట్రువల్ హెల్త్ డే 2026 సందర్భంగా, బాలికల రుతుస్రావం విషయంలో సమాజంలో నెలకొన్న విచిత్రమైన పరిస్థితిని ఈ కథనం విశ్లేషిస్తుంది. వేడుకల వెనుక దాగున్న ఆంక్షలు బాలికల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తున్నాయో, ఈ సమస్యపై ప్రభుత్వాలు, సమాజం దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది.
వేడుకల వెనుక ఆంక్షల పంజరం
దక్షిణ భారతదేశంలోని చాలా కుటుంబాల్లో కుమార్తె మొట్టమొదటి సారి రుతుస్రావం అయినపుడు అదొక వేడుకలా జరుపుకోవడం సంప్రదాయం. మా అమ్మాయి పెద్ద మనిషి అయిందంటూ చుట్టుపక్కల వారిని, చుట్టాలందిరినీ పిలిచి సంబరాలు చేసుకుంటారు. కొన్నిచోట్ల సమర్త అని, మరికొన్ని చోట్ల రుతుకాల సంస్కారం అని, ఇంకొన్ని ప్రాంతాల్లో మంజల్ నీరాట్టు విజా అని ఈ సంప్రదాయ వేడుకకు పేరు.
కానీ దాదాపుగా ఆ మరుసటి రోజే పరిస్థితి తారుమారవుతుంది. వేడుకల్లో సింహాసనంలో కూర్చుని ఆశీర్వాదాలు అందుకున్న అమ్మాయి పైన.. ఆ తర్వాత రుతుస్రావమైన ప్రతిసారీ చాలా నిషేధాలు విధిస్తారు. వంటింటికి రావద్దు, గుడులు గోపురాలకు వెళ్లొద్దు, ఇంట్లో సామాన్లు ముట్టొద్దు. ఇలా అనేక నిషేధాలు ఎదుర్కొంటుంది. అనేక సందర్భాల్లో ఈ నిషేధాలు ఇంటి నుంచి పాఠశాలకూ వ్యాపిస్తాయి. ఇది అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారు బడికి వెళ్లకుండా చేస్తుంది.
ఈ ఆకస్మిక మార్పు చాలా మంది అమ్మాయిలను అయోమయానికి గురిచేస్తుంది. సామూహికంగా వేడుక చేసుకున్న శారీరక వికాసం.. ఇప్పుడు ఎవరూ మాట్లాడని విషయంగా మారిపోతుంది. రుతుస్రావం గురించి, దానికి సంబంధించిన ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి కుటుంబాల్లో బాహాటంగా మాట్లాడుకోవడం అరుదు. దీంతో బాలికలకు తమ శరీరంలో మార్పుల గురించి సరైన అవగాహన లభించదు. స్నేహితులతో చాటుమాటు చర్చలు, పరస్పర విరుద్ధమైన సలహాలు, అపోహలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు.
భారతదేశంలో రుతుస్రావ ఆరోగ్యం పై అధ్యయనాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. పాఠశాల వయసు బాలికలు రుతుస్రావ సమయంలో బడి మానేయడం ఇంకా చాలా ఎక్కువగానే కొనసాగుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మరకలు అవుతాయనే ఆందోళన, శారీరక నొప్పి, తగిన టాయిలెట్లు లేకపోవడం, అవసరమైన ప్రైవసీ లోపించడం, సామాజిక దృష్టిలో ‘ముట్టు’ అనే కళంకం – ఇవన్నీ బడికి వెళ్లడం కంటే ఇంట్లోనే ఉండడం మంచిదని బాలికలకు అనిపించేలా చేస్తున్నాయి.
అనేకమంది బాలికలు తమ రుతుస్రావం , శారీరక మార్పుల గురించి ఏమీ తెలియకుండానే తమ మొదటి రుతుస్రావాన్ని ఎదుర్కొంటున్నారు. అవగాహన కార్యక్రమాలు ఉన్నప్పటికీ, బహిరంగంగా మాట్లాడడంపై సామాజికంగా ఉన్న సంకోచం వల్ల.. సౌకర్యాలు సరిగా లేకపోయినా వాటి గురించి ప్రశ్నించడం గానీ, తమ అవసరాలకు తగిన ఏర్పాట్ల గురించి అడగడం గానీ జరగదు. ఈ మౌనానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చాలా కాలం పాటు బాలికలు, కుటుంబాలు, బడులు ఈ మూల్యాన్ని నిశ్శబ్దంగా చెల్లించాయి.
ఇటీవల డా. జయ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ పరిస్థితిని మార్చింది. ఈ చారిత్రక తీర్పులో రుతుస్రావ ఆరోగ్యమనేది.. ఆర్టికల్ 21 (జీవనం & గౌరవం హక్కు), ఆర్టికల్ 21A (విద్యా హక్కు) కింద అమలు చేయాల్సిన ప్రాథమిక హక్కుగా కోర్టు ప్రకటించింది. పాఠశాలల్లో ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థినులు అన్యాయమైన “జీవసంబంధ శుల్కం” (biological tax) చెల్లించాల్సి వస్తోందని, ఇది వారి విద్యను దెబ్బతీస్తోందని న్యాయస్థానం పేర్కొంది.
కోర్టు మాటల్లోనే: ‘‘పీరియడ్ అనేది ఒక వాక్యానికి ముగింపు కావాలి కానీ.. ఒక బాలిక చదువుకు ముగింపు కాకూడదు.’’ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి ఇలాంటి ప్రకటన రావడం.. రుతుస్రావం గురించిన మౌనం ఎంత బలంగా ఉందో చాటిచెబుతోంది.
భారతదేశం గత దశాబ్దంలో నిజమైన పురోగతి సాధించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం 15-24 ఏళ్ల వయసు యువతుల్లో 76.1% మంది ఇప్పుడు శుభ్రమైన రుతుస్రావ ఉత్పత్తులు వాడుతున్నారు. ఈ ప్రగతి గణనీయమైనదే. అయినప్పటికీ సుమారు నాలుగో వంతు మంది ఇంకా శుభ్రమైన రుతుస్రావ ఉత్పత్తులు వాడడం లేదనేది గమనించాల్సిన విషయం. దక్షిణ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమాల ద్వారా బాలికలకు ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండడం గణనీయంగా పెరిగింది.
రుతుస్రావంపై మౌనం – బాలికల భవిష్యత్తుపై ప్రభావం
కానీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నంత మాత్రాన పరిస్థితి మారదు. పరిష్కారం లభించదు. అనేక గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో WASH (నీరు, శుభ్రత, పారిశుద్ధ్యం) మౌలిక సదుపాయాలు ఇంకా అరకొరగానే ఉన్నాయి. సరిగా లాక్ చేసుకోగలిగ టాయిలెట్లు, నిరంతరం నీటి సరఫరా, సబ్బు – ఇవి చాలా పాఠశాలల్లో లేవు. ఎక్కడైనా ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేదు.
సానిటరీ న్యాప్కిన్ అందుబాటులో ఉన్నా కూడా.. దానిని ఉపయోగించడానికి, మార్చుకోవడానికి తగిన గోప్యమైన స్థలం లేకపోతే దానివల్ల ఎంత మాత్రం ఉపయోగపడదు. వాడిన న్యాప్కిన్లను గోప్యంగా పారవేసే బిన్ లేదా ఇన్సినరేటర్ లేకపోవడం వల్ల అనేకమంది అమ్మాయిలు ఉపయోగించిన ప్యాడ్లను కాగితంలో చుట్టి బ్యాగులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్న పరిస్థితి. మరికొందరు రక్తస్రావం ఎక్కువగా ఉండే రోజుల్లో అసౌకర్యాన్ని, బయట అవమానాన్ని తప్పించుకోవడానికి బడికి రాకుండా ఉండిపోతున్నారు.
ఈ విషయంలో పాటించాల్సిన నిబంధనలను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. రుతుస్రావ బాలికలకు అవసరమైన సదుపాయాల విషయంలో ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉంది.
మొదటిగా, పాఠశాల బడ్జెట్లో WASH సదుపాయాలను తప్పనిసరి అవసరంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పాఠశాలలోనూ శుభ్రమైన, సురక్షితమైన బాలికల టాయిలెట్లు ఉండాలి. నిరంతర నీటి సరఫరా, తగినన్ని ప్యాడ్ల నిల్వతో రుతుస్రావ శుభ్రతా కేంద్రాలు (మెన్స్ట్రువల్ హైజీన్ కార్నర్లు) ప్రామాణికంగా ఉండాలి.
రెండవది, పాఠశాల పాఠ్యాంశాలలో రుతుస్రావ అవగాహనను చేర్చాలి. జీవశాస్త్ర పుస్తకాల్లో పునరుత్పత్తి అధ్యాయాలు ఉన్నప్పటికీ, సామాజిక సంకోచం వల్ల ఆ పాఠాలను తరచుగా దాటవేస్తుంటారు. లేదా అరకొరగా చెప్పి హడావుడిగా ముగించేస్తారు. బాలికలు, బాలురు ఇద్దరికీ వయసుకు తగినట్టు, సౌకర్యంగా, శాస్త్రీయంగా రుతుస్రావ ఆరోగ్య విద్యను అందించాలి. ఇది బాలబాలికల మధ్య అవగాహనా లోపాన్ని తొలగించగలదు. పాఠశాల స్థాయిలో రుతుస్రావంపై మూఢనమ్మకాలను తొలగించాలని NCERTకి సుప్రీంకోర్టు ఇచ్చిన దిశానిర్దేశం ఒక అవకాశం – పాఠశాలలు దాన్ని వినియోగించుకోవాలి.
చివరగా, ప్రభుత్వాలు స్థిరమైన ప్రత్యామ్నాయాల వైపు చూడాలి. ప్లాస్టిక్ ఎక్కువగా ఉండే సానిటరీ ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల పర్యావరణం పైన భారం మోపుతోంది. పర్యావరణ అనుకూల పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించి, వెదురు లేదా అరటి నారతో తయారు చేసిన అందుబాటు ధరల్లో ఉండే బయోడీగ్రేడబుల్ ప్రత్యామ్నాయాలను తయారు చేసి పంపిణీ చేయడం ద్వారా రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది.
రుతుస్రావం చుట్టూ ఉన్న మౌనాన్ని బద్దలు కొట్టి, మన బాలికలను సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంచడం సామాజిక సామూహిక బాధ్యత.
సమాజంలో మార్పు – గౌరవం వైపు అడుగులు
దక్షిణ భారతదేశంలోని అనేక జిల్లాల్లో చైల్డ్ రైట్స్ అండ్ యు – సీఆర్‌వై (Child Rights and You – CRY) రూపొందించిన కౌమార బాలికల సంఘాలు (అడొలెసెంట్ గర్ల్స్ కలెక్టివ్‌స్) ఇందుకు ఒక మంచి ఉదాహరణ.
ఈ సంఘాల్లో లైఫ్ స్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా బాలికలకు రుతుస్రావం, ఆరోగ్యం, గౌరవం, పాఠశాల, సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి బహిరంగంగా చర్చిస్తారు.
ఈ చర్చలు కేవలం అవగాహనకు పరిమితం కాకుండా.. సామూహిక చర్యలు, సామాజిక మద్దతు ద్వారా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, స్థానిక అధికారులు, అందరినీ ఈ సంభాషణల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా రుతుస్రావ ఆరోగ్యం అనే విషయం బాలికలు మాత్రమే మోయాల్సిన భారంగా కాకుండా సామాజిక బాధ్యతగా ముందుకు తెస్తారు. వైద్య నిపుణులు కూడా ఈ సంఘాల సమావేశాల్లో పాల్గొంటూ శాస్త్రీయ సమాచారం అందిస్తూ అపోహలను తొలగిస్తారు.
పాఠశాలల్లో బాలికలకు ఎన్ని సానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేశారనే సంఖ్య ముఖ్యమే. రుతుస్రావ శుభ్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాలూ ముఖ్యం. కోర్టు ఆదేశాలు, చట్టంలో విధివిధానాలు కూడా ముఖ్యం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే.. ఒక బాలిక తన పీరియడ్ సమయంలో అసౌకర్యం లేదా అవమానం లేకుండా ఆత్మవిశ్వాసంతో పాఠశాలలో గడపగలుగుతుందా లేదా అనేది.
బాలిక పెద్ద మనిషి అయిందని గొప్పగా వేడుకులు జరుపుకోవడమనేది.. బాలిక శరీరానికి, శారీరక మార్పులకు గౌరవం ఇచ్చే సమాజిక సంప్రదాయం. కానీ మన బాలికల గౌరవాన్ని పాఠశాలల్లో ప్రతి రోజూ కాపాడడమే నిజమైన వేడుక.
– రచయిత: జాన్ రాబర్ట్స్, రీజనల్ డైరెక్టర్, CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు, సౌత్ రీజియన్
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం. Read More
రుతుస్రావం సహజ ప్రక్రియ. దీనిపై అపోహలు, ఆంక్షలు తొలగించి, బాలికలకు సరైన అవగాహన, గౌరవం కల్పించడం సమాజం, ప్రభుత్వాల బాధ్యత. అప్పుడే ఆరోగ్యకరమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన తరం రూపుదిద్దుకుంటుంది.


