|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోడీ మాస్టర్ ప్లాన్: గ్యాస్ ధర 2 వేలు దాటకుండా ఎలా ఆపారు?

Published: 06-07-2026, 1:41 PM
మోడీ మాస్టర్ ప్లాన్: గ్యాస్ ధర 2 వేలు దాటకుండా ఎలా ఆపారు?
  • పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $70 నుండి $120కి పెరిగాయి.
  • దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి 35,000 మెట్రిక్ టన్నుల నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది.
  • 1.1 మిలియన్లకు పైగా గృహాలకు పీఎన్‌జీ కనెక్షన్లు అందించడం ద్వారా ఎల్‌పీజీ భారం తగ్గింది.
  • నిపుణుల అంచనాలను తలదన్ని, గ్యాస్ సిలిండర్ ధర రూ. 2000 దాటకుండా రూ. 950 లోపే ఉంచబడింది.

ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2000 దాటాల్సి ఉండేదని, కానీ భారత్ తన దౌత్యం, ఆత్మ నిర్భరతతో ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వివరించారు. దేశీయ ఉత్పత్తిని పెంచి, పీఎన్‌జీ కనెక్షన్లను విస్తరించి ధరలను నియంత్రించామని తెలిపారు.

యుద్ధం, చమురు సంక్షోభం: భారత్‌పై ప్రభావం

ఆత్మ నిర్భరతతోనే దేశ అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, వంటగ్యాస్ సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొందని మోడీ వివరించారు. 21వ శతాబ్దపు నవ భారత్ యొక్క సంకల్ప బలం, దౌత్య వ్యూహాల వల్లే దేశం ఈ ముప్పు నుంచి సురక్షితంగా బయటపడిందని స్పష్టం చేశారు. ఇవాళ రాజస్థాన్ పర్యటలో భాగంగా ఓ బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. యుద్ధం కారణంగా డీజిల్, పెట్రోల్ ధరలపై తీవ్రమైన ప్రభావం పడిందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి ఒక్కసారిగా 120 డాలర్లకు పెరిగాయాని చెప్పారు. దిగుమతి మార్గాలు కూడా మూసుకుపోయాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో డీజిల్, పెట్రోల్ ధరలు 40 శాతం నుండి 50 శాతం వరకు పెరిగితే మరి కొన్ని దేశాలైతే ఇంధన సరఫరాపై రేషనింగ్ కూడా విధించాయన్నారు. కానీ భారతదేశం ఒక్క రోజు కూడా అలాంటి కొరతను గానీ, పరిస్థితిని గానీ ఎదుర్కోలేదని చెప్పారు.

మోడీ వ్యూహం: ధరల నియంత్రణ ఎలా?

భారత దేశం తన ఎల్పీజీ (LPG) అవసరాలలో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోందని ఆ సరఫరాలో 90 శాతం గల్ఫ్ దేశాల నుండే (హార్ముజ్ జలసంధి) ద్వారా వచ్చేదేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా తలెత్తిన యుద్ధం ఏర్పడటంతో మన దేశంపై ఎలాంటి భారీ సంక్షోభం ముంచుకొచ్చిందో మీరు ఊహించుకోవచ్చన్నారు. కానీ ఈ సంక్షోభం ప్రారంభం కాగానే, మేము మన దేశీయ రిఫైనరీల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టామని, దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి 35,000 మెట్రిక్ టన్నుల నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు.

దేశీయ ఉత్పత్తి, పీఎన్‌జీ విస్తరణ

వంటగ్యాస్ డిమాండ్ భారం మొత్తం కేవలం ఎల్‌పీజీ పైనే పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని మోడీ చెప్పారు. పీఎన్‌జీ (PNG – పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లను విస్తరించడానికి ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించినట్లు వివరించారు. చాలా తక్కువ సమయంలోనే భారతదేశంలో 11 లక్షల (1.1 మిలియన్) కంటే ఎక్కువ గృహాలకు పీఎన్‌జీ కనెక్షన్లను అందించామని అప్పటి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే, దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,000 కు పెరిగి ఉండేదని ప్రముఖ మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేశారు. అయినప్పటికీ, ఇప్పటికీ దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ రూ. 950 కంటే తక్కువ ధరకే అందించబడుతోందన్నారు. కొన్ని శక్తులు బహిరంగంగా పుకార్లు, భయాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించినా మేము పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానం, కఠోర శ్రమ, సహనం మరియు విధానపరమైన, దౌత్యపరమైన స్థాయిలలో తీసుకున్న ప్రతి సున్నితమైన చర్య భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, భారత్ తన వ్యూహాత్మక విధానాలతో ప్రజలపై భారం పడకుండా చూసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక స్థిరత్వానికి, ప్రజల సంక్షేమానికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.