
📌 Key Points
- బాలకృష్ణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్‌పై అభిమానుల ఫిర్యాదు.
- సొహైల్ అహ్మద్ అసెంబ్లీకి బాలకృష్ణ మద్యం తాగి వస్తారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు.
- ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో సొహైల్‌పై బాలకృష్ణ అభిమానులు ఫిర్యాదు నమోదు చేశారు.
- సొహైల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభిమానులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తిపై బాలయ్య అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తిపై బాలయ్య అభిమానులు (NBK Fans) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎంతగా దిగజారుతున్నారనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. మరీ దారుణంగా సెలబ్రిటీలనే కాకుండా, వారి ఇంటిలోని వ్యక్తులను కూడా సోషల్ మీడియాలో పెట్టి, పచ్చి బూతులు తిడుతున్నారు. కోర్టులు హెచ్చరించినా, దీనికి అంతు ఉండటం లేదు. సెలబ్రిటీ ఎవరైనా సరే.. వారే మీ ఆస్తులు కాదు, ఎలా పడితే అలా మాట్లాడటానికి. వారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నది ముందు తెలుసుకోవాలి. ఒకవేళ విమర్శించాలి అనుకుంటే, అది సద్విమర్శలా ఉండాలి తప్ప.. వారిని హర్ట్ చేసేలా ఉండకూడదు. ఇప్పుడు బాలకృష్ణపై ఇష్టం వచ్చినట్లుగా వాగిన సొహైల్ అహ్మద్‌పై ఫిర్యాదు చేసేందుకు ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు ఆయన అభిమానులు. విషయం ఏమిటంటే..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలకృష్ణ అభిమానులు
సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హిందూపురం శాసనసభ్యులు, కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ గ్రహీత, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణపై అనుచిత, నిరాధార ఆరోపణలు చేయడాన్ని.. అభిమానులు తీవ్రంగా పరిగణించారు. గురువారం ప్రకాశం జిల్లా ఎన్.బి.కె ఫ్యాన్స్ తరపున ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో అభిమానులంతా కలిసి వెళ్లి సొహైల్‌పై ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం తాగి వస్తారనే అర్థం పర్థం లేని మాటలతో అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. గౌరవ శాసనసభను, అగౌరవ పరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని తెలుపుతూ, సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ గౌరవానికి భంగం కలిగించేలా, అభిమానుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై.. వారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ కృష్ణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సొహైల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అంతేకాదు, వెంటనే సొహెల్ అహ్మద్‌పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను, ఇంకా అతని పేరున గల ఇతర సామాజిక మాధ్యమాలను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు సిఐ విజయ కృష్ణను కోరారు. సీఐ ని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ప్రకాశం జిల్లా ఎన్‌బికె ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి వాసు, ఒంగోలు నగర ఎన్‌బికె ఫ్యాన్స్ అధ్యక్షుడు కాట్రగడ్డ వంశీతో పాటు ఇంకా బాలయ్య అభిమానులు హనీఫ్ ఖాన్, కొమ్మాలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ, యమల బాలకృష్ణ, బెజవాడ మురళీకృష్ణ వంటి వారంతా ఉన్నారు. సొహెల్ అహ్మద్‌పై వెంటనే యాక్షన్ తీసుకుంటామని సీఐ విజయ కృష్ణ వారికి తెలియజేశారు.
సొహైల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణ అభిమానులను తీవ్రంగా బాధించాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

