
📌 Key Points
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
- చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మద్దతును నితిన్ నబీన్ గుర్తు చేశారు.
- మోడీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి పథకాలు వివరించారు.
- అమరవీరుల ఆశయాల సాధనకు అవినీతి పాలన అంతం కావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో అవినీతి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసిన కృషిని వివరించారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ నబీన్ మాట్లాడుతూ, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ ఎప్పటి నుంచో మద్దతుదారుగా ఉందన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో అందించిన సంపూర్ణ మద్దతు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, ఆ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వారు కలలు కన్న తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రస్తుతం కాస్త వెనుకబడ్డామని, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి కోసం, అమరవీరులు కలలు కన్న తెలంగాణను నిర్మించుకునేందుకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.
2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి మోసం చేసిన విషయం అందరికీ గుర్తుంటుందని, దీంతో తెలంగాణలోని అనేక మంది యువతీ యువకులు తమ ప్రాణత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా ప్రధాని మోడీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం వికసిత భారత్ లో తెలంగాణను భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. 31 లక్షల మంది తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ యోజన నిధులు, 75 లక్షలకు పైగా లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, 1.27 కోట్ల జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ కార్డులను అందజేశాం. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను భారీగా తెలంగాణకు మంజూరు చేశాం. బీబీనగర్ లో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను ఇచ్చామన్నారు.
తెలంగాణ అవినీతి పాలనకు చరమగీతం పాడాలి
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి
2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తామని, రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణను కొందరు ఏటీఎం లాగా మార్చుకుని, కాంగ్రెస్ జేబులు నింపుతున్నారు. దీనిని ఆపేందుకు భవిష్యత్తులో బీజేపీ కార్యకర్తలంతా కలసి పోరాడుతామన్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం చెర నుంచి విడిపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన స్వాతంత్ర్యం అనంతరం ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన అడుగు జాడల్లోనే మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ఇవ్వలేదు, ప్రజలు ఉద్యమించి సాధించారు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
స్వరాష్ట్ర తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కానే కాదని ప్రజలంతా ఆ పార్టీ నేతల మెడలు వంచి తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజేపీ ఎప్పుడు కూడా ఒకే మాట, ఒకే బాట ఒకే నినాదం, ఒకే లక్ష్యంతో తెలంగాణ కోసం పోరాడింది. ఇప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ లాగా పది మాటలు మాట్లాడే వాళ్లం కాదని, అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పి.. బంగారు కుటుంబాన్ని పెంచి పోషించారు. తీవ్ర అవినీతి, అహంకారంతో కుటుంబ సభ్యులందరికీ దోచి పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కూడా తెలంగాణలో ఎలాంటి మార్పు లేదు. అదే విధంగా అవినీతి, అక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ కు అడ్డాగా మార్చారు.
తెలంగాణ నుంచి వందల కోట్లను రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టానానికి ముట్టజెప్తున్నారు. అందుకే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దివాళా దిశగా తీసుకెళ్లారు. రిటైర్అయిన వారికి కనీసం బెనెఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీతో సాధ్యమన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, బీజేపీ నేతల భాగస్వామ్యం పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుతో కలిసి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను తిలకించారు.
అవినీతి పాలనకు చరమగీతం
తెలంగాణ ఏర్పాట్లులో సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిది : బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు
తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య మరియు పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే సిద్ధించిందని, ఈ ప్రక్రియలో బీజేపీ పోషించిన కీలక పాత్ర వహించిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు బేషరతుగా, అచంచలంగా మద్దతు పలికిన అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజలు ఎప్పటికి మరువలేని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం బలంగా నిలబడకపోతే, తెలంగాణ గొంతు అంత శక్తివంతంగా వినిపించేది కాదు. తెలంగాణ ప్రజలు ఆమె చేసిన సహకారాన్ని ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారని కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన ఇప్పుడు మన ప్రయాణం మరింత అభివృద్ధి, ప్రగతి వైపు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్’ అనే బృహత్ సంకల్పంలో భాగంగా మనమంతా కలిసికట్టుగా ‘వికసిత్ తెలంగాణ’ లక్ష్యం కోసం కృషి చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాలు పరస్పర స్నేహంతో, ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలమైన మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. మన మధ్య ఎటువంటి ద్వేషాలు, విభేదాలు ఉండకూడదు.. కేవలం అభివృద్ధిలో మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.
రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారం ఉంటేనే ఉభయ రాష్ట్రాలు ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోగలవు. వికసిత్ తెలంగాణ’, వికసిత్ ఆంధ్రప్రదేశ్’ లు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం న్యూఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అనంతరం నితిన్ నబీన్‌ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, రాష్ట్ర సాధనలో ప్రముఖుల పాత్రను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు ఢిల్లీలోని తెలంగాణ వాసుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి.
తెలంగాణలో అవినీతి రహిత పాలనను స్థాపించి, అమరవీరుల కలలను సాకారం చేయడమే బీజేపీ లక్ష్యమని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.


