
📌 Key Points
- విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందన.
- సెన్సార్, రాజకీయాలకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ.
- ఎన్డీయేలో ఉన్నా తన సినిమాకు A సర్టిఫికేట్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
- సెన్సార్ సమస్యలను కోర్టుకు తీసుకెళ్లడం సరికాదన్న పవన్ కళ్యాణ్.
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. సెన్సార్ కు, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. తన సినిమాకు కూడా A సర్టిఫికేట్ వచ్చిందని గుర్తు చేశారు.
విజయ్ సినిమా సెన్సార్ వివాదంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) రిలీజ్‌కు నోచుకోకుండా, ఎన్ని కష్టాలను అనుభవిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉంది. నిర్మాణ సంస్థ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీని ఖరారు చేయడంతో.. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో, అసలు థియేటర్లలో విడుదల అవుతుందో, లేదో అనేలా పరిస్థితి మారిపోయింది. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్‌గా సినిమా విడుదల కాబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సరే ఈ విషయం ఇలా ఉంటే, ఈ సినిమా సెన్సార్ ఇబ్బందులపై టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.
సెన్సార్ నిబంధనలు అందరికీ ఒకటే: పవన్ కళ్యాణ్
తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సినిమా సెన్సార్ కాకపోతే.. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు. ‘‘రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు. నేను అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైనప్పటికీ, నా సినిమా ‘OG’కి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్‌నే జారిచేసింది. మీరు ప్రభుత్వంలో భాగమే కదా.. సెన్సార్ విషయంలో జోక్యం చేసుకోవచ్చు కదా.. అని దర్శకనిర్మాతలు అడిగారు. ‘ఓజీ’ సినిమాలో హింస ఎక్కువగా ఉన్నప్పుడు యుబైఏ సర్టిఫికేట్ ఎలా వస్తుందని నేనే వారిని ప్రశ్నించాను. చట్టం లేదా నిబంధనలు అనేవి అధికారంలో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా మార్చబడవని చెప్పాను. పాలన వేరు, సినిమా సెన్సార్ బోర్డు వేరు. నిబంధనలు అందరికీ ఒక్కటే, అవి అధికారంలో ఉన్నారా లేదా అన్నదానిపై ఆధారపడి మారవు.
కోర్టుకు వెళ్లడం సరికాదన్న పవన్ కళ్యాణ్
విజయ్ సినిమా ‘జన నాయగన్’ విషయంలో అనవసరంగా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు.. సెన్సార్ బోర్డు తన నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. ‘జన నాయగన్’ చిత్ర నిర్మాతలు ఈ సమస్యను కోర్టు వరకు తీసుకెళ్లడం నా దృష్టిలో సరికాదని అనుకుంటున్నాను. సెన్సార్ బోర్డుతో వచ్చే చిన్న చిన్న సమస్యలను చర్చల ద్వారా లేదంటే బోర్డు సూచనల ప్రకారం సర్దుబాటు చేసుకోవాలే తప్ప, న్యాయస్థానాలను ఆశ్రయించడం కరెక్ట్ కాదు. గతంలో నా సినిమాల్లో కూడా పాటలోని లిరిక్స్ మార్చమని సెన్సార్ బోర్డు కోరితే, అందుకు అంగీకరించి మార్పులు చేశాం. ఇలాంటివి పరిశ్రమలో అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కసారి విషయం కోర్టు వరకు వెళ్ళిందంటే, దాని ఫలితం పూర్తిగా న్యాయ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మొత్తం వివాదంలో NDA ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ వారు కోర్టుకు వెళ్ళకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది’’ అని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రకారం, సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కోర్టుకు వెళ్లడం సరైన మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.


