
📌 Key Points
- నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేసిన విశ్వనాథ్ కోటి రూపాయలు కాజేశాడు.
- విశ్వనాథ్ బోగస్ ఖాతాలు సృష్టించి, యజమానికి తెలియకుండా చెక్కులపై సంతకాలు చేశాడు.
- సునీల్ నారంగ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విశ్వనాథ్ ను అరెస్టు చేశారు.
- సునీల్ నారంగ్ తండ్రి నారాయణ దాస్ నారంగ్ కూడా టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్.
ప్రముఖ సినీ నిర్మాత సునీల్ నారంగ్ మోసపోయారు. ఆయన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి విశ్వనాథ్ ఏకంగా కోటి రూపాయలు కాజేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
సునీల్ నారంగ్ కు టోకరా వేసిన అకౌంటెంట్
Suniel Narang: ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలలో నమ్మి మోసపోయాం అంటూ ఎంతో మంది సెలబ్రిటీలు తమ బాధను సోషల్ మీడియా ముందు అభిమానులతో చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ప్రముఖ సినీ నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న నిర్మాత సునీల్ నారంగ్ కి కూడా ఈ తిప్పలు తప్పలేదు. ఏకంగా కోటి రూపాయల వరకు ఆయనకు టోకరా పెట్టేశారు ఆయన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సినీ నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో పనిచేస్తూ సుమారుగా కోటికి పైగా డబ్బు కాజేసిన ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ లోని నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో వనస్థలిపురానికి చెందిన విశ్వనాథ్ అకౌంటెంట్ గా పనిచేసేవారు . వివిధ సంస్థలకు వారం వారం చెల్లించాల్సిన మొత్తానికి చెక్కులను కూడా అతడే అందించేవాడు. ఈ క్రమంలోనే బోగన్ ఖాతాలు సృష్టించి, యజమానికి తెలియకుండా సరఫరాదారుకు ఇవ్వాల్సిన చెక్కుల మధ్యలో పెట్టి సంతకాలు కూడా చేయించాడు. అలా మూడు సంవత్సరాల పాటు యజమానికి తెలియకుండా సుమారుగా కోటి రూపాయల మేరా మోసానికి పాల్పడ్డాడు. ఈ విషయం 2024 లో జరిగిన ఆడిటింగ్ లో అధికారులు గుర్తించారు. దీంతో సునీల్ నారంగ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విశ్వనాథ్ పై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదయింది. ఇక అప్పటినుంచి పరారీలో ఉన్న విశ్వనాథ్ ను శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
మోసం ఎలా బయటపడింది?
నిర్మాత సునీల్ నారంగ్ విషయానికి వస్తే.. నిర్మాత గానే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. ఈయన తండ్రి నారాయణ దాస్ నారంగ్.. టాలీవుడ్లో సుమారుగా 50 సంవత్సరాలకు పైగా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సేవలు అందించారు. ఇక తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన క్రమశిక్షణ, వ్యాపార మెళుకువలతో సునీల్ నారంగ్ ఏషియన్ గ్రూప్ ని ఉన్నత శిఖరంలో నిలిపారు. నైజాం ప్రాంతంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను సునీల్ నారంగ్ నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ సంస్కృతిని విస్తరించడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు.
సునీల్ నారంగ్ సినీ ప్రస్థానం
మహేష్ బాబుతో కలిసి AMB సినిమాస్, అల్లు అర్జున్ తో కలిసి AAA, విజయ్ దేవరకొండ తో కలిసి AVD వంటి అత్యాధునిక మల్టీప్లెక్స్ లను నిర్మించి.. సినిమా చూసే అనుభూతిని పూర్తిగా మార్చేశారు. SVCC బ్యానర్ పై పలు క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఈయన గతేడాది జూన్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.. ఇక తనపై వచ్చిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో నైతిక బాధ్యతగా ఆ పదవి చేపట్టిన 24 గంటల్లోనే రాజీనామా చేసి తన హుందాతనాన్ని కూడా చాటుకున్నారు.
ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. నమ్మకమైన వ్యక్తులు కూడా మోసం చేసే అవకాశం ఉందని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.


