|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధురంధర్‌లో సిగరెట్ వివాదం: క్షమాపణ చెప్పిన మాధవన్! ఏం జరిగిందో తెలుసా?

Published: 24-03-2026, 10:05 AM
ధురంధర్‌లో సిగరెట్ వివాదం: క్షమాపణ చెప్పిన మాధవన్! ఏం జరిగిందో తెలుసా?
  • ‘ధురంధర్ 2’ చిత్రంపై సిక్కు సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
  • సిగరెట్ తాగుతూ సిక్కుల పవిత్ర గ్రంథంలోని వాక్యాలు చెప్పడంపై వివాదం.
  • ఆర్. మాధవన్ సిక్కు సంఘానికి క్షమాపణలు తెలిపారు.
  • దర్శకుడు ఆదిత్య ధర్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని మాధవన్ తెలిపారు.

‘ధురంధర్ 2’ చిత్రం విడుదల కాకముందే వివాదాల్లో చిక్కుకుంది. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఒక సన్నివేశంపై సిక్కు సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై నటుడు ఆర్. మాధవన్ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు.

‘ధురంధర్ 2’పై సిక్కుల అభ్యంతరం

R Madhavan: ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియని విషయం కాదు. అదే సమయంలో రికార్డులతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. తాజాగా ఈ చిత్రం చట్టపరమైన చిక్కుల్లో పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిక్కుల పవిత్ర సూక్తులు అయిన ‘గుర్బానీ’ని అవమానించేలా ఒక సీన్ ఉందంటూ సిక్కు సంఘం ఫిర్యాదు చేయడంతో.. చిత్ర బృందం, నటుడు ఆర్. మాధవన్ పై ముంబైలో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. సినిమాల్లో మతపరమైన భావాలను గౌరవించాలని, వివాదాస్పదంగా ఉన్న ఆ సీన్‌ను తొలగించాలని, అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సిక్కు సంఘం నేతలు కోరారు. చిత్ర బృందం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ఆ సీన్ గురించి వివరించడమే కాకుండా, క్షమాపణలు కూడా కోరారు.

అసలు వివాదం ఏమిటంటే.. ఈ వివాదం (Dhurandhar 2 Controversy) అంతా ఒక సీన్ చుట్టూ తిరుగుతోంది. అందులో మాధవన్ పోషించిన పాత్ర, సిగరెట్ తాగుతూ దశమ్ గ్రంథ్ సాహిబ్ లోని ‘శూరా సో పెచానియే, జో లడే దీన్ కే హేత్. పుర్జా పుర్జా కట్ మరే, కభూ నా చడ్డే ఖేత్’ అనే వాక్యాలు చెబుతుంది. ఇది సిక్కు సంప్రదాయాలకు విరుద్ధమని, అలాగే గురు గోవింద్ సింగ్‌ని అవమానించడమేనని సిక్కు సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నివేశంపై ఆర్ మాధవన్ వివరణ ఇస్తూ.. ‘‘ధురంధర్ 2 చిత్ర బృందం తరపున మా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మా సంతోషాన్ని ఎలా తెలియజేయాలో కూడా తెలియడం లేదు. అంత గొప్పగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. అయితే, ఈ మధ్య మా దృష్టికి ఒక విషయం వచ్చింది.

వివాదంపై ఆర్. మాధవన్ వివరణ

ఈ సినిమాలో ఒక సీన్ ఉంది, అందులో నేను గురు గోవింద్ సింగ్ ‘దశమ్ గ్రంథ్’ లోని కొన్ని వాక్యాలు చెబుతాను. ఆ సమయంలో నేను సిగరెట్ తాగుతూ ఉండడం కొంతమందిని బాధించిందని తెలిసింది. కానీ, నేను మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.. అది నిజం కాదు, చిన్న పొరపాటు జరిగింది. దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ సీన్ చిత్రీకరించే ముందే ఆయన నాతో చెప్పారు. ‘ఈ లైన్స్ చెప్పడానికి ముందే మీరు సిగరెట్ ఆపేయాలి. మీ నోటి నుండి పొగ రాకూడదు, స్క్రీన్ మీద ఎక్కడా పొగ కనిపించకూడదు, మీ చేతిలో కూడా సిగరెట్ ఉండకూడదు. ఎందుకంటే ఆ వాక్యాలు చాలా పవిత్రమైనవి’ అని చెప్పారు. నేను కూడా అలాగే చేశాను.

క్షమాపణ కోరిన నటుడు

మీరు ఆ సీన్ జాగ్రత్తగా గమనిస్తే.. నా నోటి నుండి పొగ రాదు, ప్రేమ్‌లో ఎక్కడా పొగ ఉండదు, సీన్ ముగిసే వరకు కూడా నా చేతిలో సిగరెట్ ఉండదు. మేము ఎవరి మనసు నొప్పించాలని ఈ సినిమా తీయలేదు. మేము ఎప్పుడూ సిక్కు కమ్యూనిటీకి అండగా ఉంటాము, వారిని ఎంతో గౌరవిస్తాము. నిజానికి నా ప్రతి సినిమా విడుదలకు ముందు నేను గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తుంటాను. కాబట్టి ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు, అలా చేయలేదు కూడా. నేను మళ్ళీ చెబుతున్నాను.. సీన్ మొదలైనప్పుడు నా చేతిలో సిగరెట్ ఉంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్మోక్ చేస్తుంది. కానీ డైలాగ్ మొదలవ్వడానికి ముందే నేను సిగరెట్ ఆపేశాను. సో.. ఆ సీన్ మొత్తం ఎక్కడా స్మోక్ కానీ, సిగరెట్ కానీ ఉండదు. ఒకవేళ తెలిసో తెలియకో ఎవరినైనా బాధపెట్టి ఉంటే.. క్షమించండి. మేమందరం మీతోనే ఉన్నాం. అందరూ సంతోషంగా ఉండండి. హ్యాపీ ధురంధర్2’’ అని వివరణ ఇచ్చారు.

మాధవన్ క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. సినిమా విడుదల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.