
📌 Key Points
- ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ ప్రకటన.
- రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రాహుల్ గాంధీ సానుకూల స్పందన.
- తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం.
- ప్రధాని మోడీపై రాజకీయ యుద్ధానికి సిద్ధమని రాహుల్ గాంధీ వ్యాఖ్య.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశం కోసం ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి రాహుల్ గాంధీ బదులిచ్చారు.
ప్రధాని పదవికి సిద్ధమన్న రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలలోని హరిత రిసార్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌తో కలిసి ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చివరి సెషన్‌లో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్రనేత వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టడం గురించి మాట్లాడారు. దేశం కోసం ప్రధాని బాధ్యతను మోయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత.
ఈ సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ దేశం కోసం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీకి ఆ పదవిపై ఎలాంటి వ్యామోహం లేదు. రాహుల్ గాంధీ ముత్తాత, అమ్మమ్మ, తండ్రి అందరూ ప్రధానులుగా పనిచేశారు. అందువల్ల పదవి కోరికకు సంబంధించినది కాదు. విధికి సంబంధించినది.’ అని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు.
రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి
దేశంలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని బట్టి చూస్తే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మనమందరం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీకి ఆభరణం కాదని, బాధ్యత అని కూడా ఆయన అన్నారు.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి స్పందిస్తూ, రాహుల్ గాంధీ నవ్వుతూ తల ఊపుతూ మాట్లాడారు. సవాలును స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాజకీయ యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో రాహుల్
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సూత్రాలపై మార్గదర్శకాలను అందించారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సూత్రాలు, పార్టీపై నమ్మకంతో పనిచేసే వారికి ఇచ్చే ప్రాముఖ్యత, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో డీసీసీ అధ్యక్షుడి పాత్ర, నాయకత్వ లక్షణాలు మరియు సీనియర్ నాయకులతో ఎలా సంభాషించాలో వారికి శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షించారు. వైఎస్ షర్మిల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాహుల్ గాంధీ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు వ్యూహాలు రచిస్తుందా వేచి చూడాలి.


