
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తర్వాత ఆయన నివాసానికి వచ్చిన రాజమౌళి, సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Key Points
కోట శ్రీనివాసరావు మరణానంతరం శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన రాజమౌళిని అభిమాని అడ్డుకున్నాడు.
సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని రాజమౌళి తోసేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నెటిజన్లు రాజమౌళి, అభిమాని ప్రవర్తనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు
దిగ్గజ నటుడు కోట శ్రీనివాస రావు మరణం షాక్ కు గురి చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు చాలా మంది సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇందులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఉన్నారు. అయితే దివంగత నటుని ఇంటి వెలుపల జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారింది. ఓ అభిమానిని రాజమౌళి తోసేశారు.
కోట శ్రీనివాస రావు పార్థివ దేహాన్ని సందర్శించిన తర్వాత రాజమౌళి ఇంటి బయటకు వచ్చారు. ముందు ఆయన భార్య రమా రాజమౌళి వచ్చారు. ఆ తర్వాత రాజమౌళి బయటకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అభిమానులు ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి అయితే రాజమౌళికి అడ్డుగా వచ్చాడు. ఆయనతో పాటే నడుస్తూ వచ్చాడు. దీంతో రాజమౌళికి కోపమొచ్చింది. సమయం, సందర్భం లేదా అంటూ ఆ అభిమానిని తోసేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళి, అభిమాని మధ్య ఘర్షణ
విషాద సమయంలో ఇలా చేయడం సరికాదంటూ రాజమౌళి హెచ్చరించినట్లు కనిపించింది. నెటిజన్లు కూడా ఆ అభిమాని తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పరిస్థితితో సంబంధం లేకుండా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఇంతలా అత్యుత్సాహం చూపించడం సరికాదనే కామెంట్లు వస్తున్నాయి.
కోట శ్రీనివాస రావు మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని అంతకుముందు సోషల్ మీడియాలో రాజమౌళి పేర్కొన్నారు. ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘కోటా శ్రీనివాస రావు మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. తన క్రాఫ్ట్ లో ఆయన మాస్టర్. తాను చేసిన ప్రతి పాత్రకు జీవం పోశారు. స్క్రీన్ పై ఆయన స్థానాన్ని భర్తీ చేయలేం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’’ అని రాజమౌళి ఎక్స్ లో పేర్కొన్నారు.
వైరల్ వీడియో, నెటిజన్ల ప్రతిస్పందన
కోట శ్రీనివాసరావు మరణ వార్త అనంతరం.. రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు ఆయన హైదరాబాద్ లోని నివాసానికి వచ్చి చివరి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవి , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషాదంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన వారిలో ఉన్నారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నివాళులు అర్పించడానికి వచ్చారు. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ (నటుడు అల్లు అర్జున్ తండ్రి) కూడా దివంగత నటుని ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు.
మీడియాతో మాట్లాడుతూ అరవింద్ ఇలా అన్నారు.. “కోట శ్రీనివాసరావు మా కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తి. ఆయన చాలా ఉల్లాసంగా ఉండే వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడూ ఆయనతో సమయం గడపడానికి ఎదురు చూసేవాడిని. ఆయన మరణం మాకు వ్యక్తిగత నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
కోట శ్రీనివాసరావు మరణం సమయంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకోవడంపై అభిమానుల ఆసక్తి, దానివల్ల ఎదురయ్యే సమస్యలపై చర్చ జరుగుతోంది.


