
📌 Key Points
- హైదరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ ద్వారా దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేస్తున్నారు.
- సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.
- వాహనం కొనే ముందు యజమాని గుర్తింపు, వాహన చరిత్రను ‘వాహన్’ పోర్టల్ ద్వారా ధృవీకరించాలి.
- ఒడోమీటర్ ట్యాంపరింగ్, పెండింగ్ చలాన్లు, ఫైనాన్స్ క్లియరెన్స్ తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
హైదరాబాద్ నగరంలో సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోళ్లలో మోసాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ‘ఆపరేషన్ కవచ్’ ద్వారా దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేస్తూ, కొనుగోలుదారుల రక్షణకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ అడ్వైజరీ మోటార్ వాహనాల చట్టం నిబంధనలను స్పష్టం చేస్తుంది.
పోలీసుల ‘ఆపరేషన్ కవచ్’ – మోసాలకు అడ్డుకట్ట
హైదరాబాద్ నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన ‘ఆపరేషన్ కవచ్’ ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు.
సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత -2023లో ఉన్న నిబంధనలను అడ్వైజరీలో ప్రధానంగా సజ్జనార్ పేర్కొన్నారు. యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
డీలర్లు ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలి. ఇందుకోసం విక్రేత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును సేకరించడంతో పాటు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు, చిరునామాతో వాటిని సరిపోల్చుకోవాలి.
ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే, చట్టబద్ధమైన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఒకవేళ విక్రేత గుర్తింపు లేదా వాహన యాజమాన్య వివరాలు సంతృప్తికరంగా ధృవీకరించబడకపోతే.. అటువంటి వాహనాన్ని డీలర్లు తమ వద్దకు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ లేదా తిరిగి విక్రయించడం గానీ పూర్తిగా నిషేధం.
వాహనం కొనుగోలు చేసే ముందే అది దొంగిలించబడినదా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలి.
వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలతో పాటు ఎటువంటి టోల్ గేట్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి.
సెకండ్ హ్యాండ్ డీలర్లకు కఠిన నిబంధనలు
ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వాహన్ పోర్టల్ రికార్డులలో సదరు వాహనానికి సంబంధించి ఎటువంటి ఇతర భారాలు లేవని (ఎన్‌కంబరెన్స్ ఫ్రీ), స్పష్టమైన యాజమాన్య హక్కులు (క్లియర్ టైటిల్) ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాహన బదిలీ లేదా డెలివరీ ప్రక్రియ చేపట్టాలి.
వాహనాల ఓడోమీటర్ రీడింగ్‌లను మార్చడం లేదా ఇంజిన్, ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి కస్టమర్లను మోసం చేయడం శిక్షార్హమైన నేరం. బాధ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318తో పాటు వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు ఉంటాయి.
డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, అలాగే వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్‌ను నమోదు చేయడంతో పాటు, ఇంజిన్/ఛాసిస్ నంబర్లను ఫోటో తీసి భద్రపరచుకోవాలి.
మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 192A, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 లోని రూల్ 50 నిబంధనల ప్రకారం.. వాహనంపై కంపెనీ ముద్రించిన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను గానీ, ఇతర గుర్తింపు చిహ్నాలను గానీ మార్చడం, చెరపడం, ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం.
ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్‌కు గురైనా లేదా అసలు లేకపోయినా.. ఆ వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. అంతేకాకుండా, సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)-2023’ సెక్షన్ 317(2) కింద దొంగ సొత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించి కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన జీఎస్‌ఆర్ 901(ఇ) (తేదీ: 22 డిసెంబరు, 2022) నిబంధనల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ మోటార్ వాహన నిబంధనల (CMVR-1989) రూల్ 48 కింద సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ (అథరైజేషన్ సర్టిఫికేట్) పొంది ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి.
డీలర్లు తమ వద్ద జరిగే ప్రతి వాహన లావాదేవీకి సంబంధించి డిజిటల్ లేదా రాతపూర్వక రూపంలో ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. ఈ రిజిస్టర్‌లో కొనుగోలుదారు, విక్రయదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి సంతకాలతో పాటు లావాదేవీ జరిగిన తేదీ, సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి.
వాహన కొనుగోలుదారులకు కీలక సూచనలు
అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. తిరిగి కస్టమర్‌కు డెలివరీ ఇచ్చే సమయంలో ఉన్న ఒడోమీటర్ రీడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
వాహనం డీలర్ వద్ద ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర దుర్వినియోగాలకు మోటారు వాహన నిబంధనల రూల్ 55ఇ ప్రకారం డీలర్లదే పూర్తి కస్టడీ ఆధారిత బాధ్యత.
మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 2(30) కింద అసలు యజమానికి ఉండే చట్టబద్ధమైన యాజమాన్య బాధ్యతకు ఇది పూర్తిగా భిన్నమైనది. టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్ లేదా ఇతర అవసరాల కోసం వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారీ డ్రైవర్ పేరు, లైసెన్స్ నంబర్, వెళ్లే ఉద్దేశం, ప్రయాణ సమయం, ప్రయాణించిన దూరం (మైలేజీ) వివరాలను ‘ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్’ లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
డీలర్ల కస్టడీలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడబడినా.. అసలు వాహన యజమాని (ఆర్‌సీ ఓనర్) అనవసరంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల ట్రిబ్యునల్ (MACT) వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా రక్షించేందుకే ఈ నిబంధనలను తీసుకువచ్చారు.
సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాలలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు, వారిపై భారతీయ న్యాయ సంహితలోని దొంగతనం (సెక్షన్ 303), దొంగిలించిన సొత్తును కలిగి ఉండటం(సెక్షన్ 317), మోసం(సెక్షన్ 318), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం(సెక్షన్ 221/222) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియకు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, పోలీసుల మార్గదర్శకాలను పాటించడం ద్వారా మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. ప్రతి కొనుగోలుదారుడు పూర్తి వివరాలు తనిఖీ చేసి, సురక్షితమైన లావాదేవీలు జరపడం అత్యవసరం.


