|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాడో ఆపరేషన్: పాక్‌లో ఉగ్రమూకల భరతం పడుతున్న భారత్! గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ‘ఆ’ ఏజెంట్లు!

Published: 24-03-2026, 4:05 AM
షాడో ఆపరేషన్: పాక్‌లో ఉగ్రమూకల భరతం పడుతున్న భారత్! గుండెల్లో వణుకు పుట్టిస్తున్న 'ఆ' ఏజెంట్లు!
  • పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.
  • భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు.
  • అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మరణం లష్కరే తోయిబాకు పెద్ద దెబ్బ.
  • జహూర్ మిస్త్రీ IC-814 విమానం హైజాక్‌లో కీలక పాత్ర పోషించాడు.

దేశంలో దాడులు చేసి పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. ముఖ్యంగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనే చర్చ జరుగుతోంది.

పాకిస్తాన్‌లో హతమవుతున్న ఉగ్రవాదులు

Dhurandhar Effect: దేశంలో రక్తపాతం సృష్టించి, పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. భారత్‌కు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడూ పాక్ వీధుల్లో కుప్పకూలుతున్నాడు. అబ్దుల్ మక్కీ మొదలుకొని జహూర్ మిస్త్రీ, షాహిద్ లతీఫ్ వంటి కరడుగట్టిన దేశద్రోహులు మట్టికరుస్తున్నారు. మసీదుల్లో ఉన్నా, ఫర్నీచర్ షాపుల్లో దాక్కున్నా, మృత్యువు వారిని వదలడం లేదు. చెప్పాలంటే.. భారత్‌పై కన్నెత్తి చూస్తే శత్రువుల అంతం వారి సొంత గడ్డపైనే ఖాయమని వరుస మరణాలు నిరూపిస్తున్నాయి.

పాకిస్తాన్.. ఒకప్పుడు ఉగ్రవాదులకు స్వర్గధామం. కానీ కొన్నేళ్లుగా అక్కడ పరిస్థతి మారింది. ఎందుకంటే.. ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. తాజాగా లష్కరే తోయిబా కీలక నేత, హాఫిజ్ సయీద్ కుడిభుజం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మరణించాడు. చెప్పాలంటే.. ఉగ్రవాది రెహ్మాన్ మక్కీ మరణంతో పాకిస్తాన్‌లో నమోదైన వరుస మరణాలు ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి.

అయితే అబ్దుల్ రెహ్మాన్ మక్కీ అనారోగ్యంతో మరణించినట్లు పాకిస్తాన్ చెబుతున్నా, దీని వెనుక బలమైన కారణమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి మక్కీ కేవలం ఉగ్రవాది మాత్రమే కాదు. లష్కరే తోయిబాకు వెన్నెముక వంటి వాడు. సౌదీ అరేబియాలోని మక్కాలో చదువుకున్న ఇతడు.. అరబిక్, ఇంగ్లీషు భాషల్లో ఆరితేరాడు. లష్కర్ కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా నిధులు సేకరించడంలో మక్కీది అందెవేసిన చేయి అని చెప్పొచ్చు. 2008 ఏడాది ముంబైలో దాడులు జరిగినప్పుడు ఆ సంస్థను నడిపించింది అబ్దుల్ రెహ్మాన్ మక్కీయే. కాశ్మీర్ పేరుతో భారత్‌ను రక్తసిక్తం చేయాలని వేలాది మంది యువతను ప్రేరేపించిన సిద్ధాంతకర్త ఈ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ.

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదుల్లో మరొకరు జహూర్ మిస్త్రీ. కరాచీకి చెందిన జహుర్ మిస్త్రీ, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడు. ఇతడిని ‘జాహిద్ అఖుంద్’ అనే పేరుతో కూడా పిలిచేవారు. కరాచీలో ఒక ఫర్నీచర్ షోరూమ్ నడుపుతూ, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేసేవాడు. చెప్పాలంటే.. దేశ చరిత్రలో జహూర్ మిస్త్రీ ఒక చీకటి అధ్యాయం. 24 డిసెంబర్ 1999న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్లో మిస్త్రీ ఒకడు.

నేపాల్‌లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి అమృత్‌సర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కందహార్‌కు తీసుకెళ్లాడు. భారత్ జైలులో ఉన్న ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ను విడుదల చేయడమే హైజాక్ ప్రధాన ఉద్దేశ్యం. అయితే చివరికి ప్రభుత్వం అజార్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. అయితే దశాబ్దాల తర్వాత జహూర్ మిస్త్రీకి పాక్ గడ్డపైనే శిక్ష పడింది. 1 మార్చి 2022న కరాచీలోని అక్తర్ కాలనీలో తన ఫర్నీచర్ షాపులో ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జహూర్ మిస్త్రీపై కాల్పులు జరిపారు. తలలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో జహుర్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించాడు.

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో అత్యంత కీలకమైన కమాండర్లలో ఒకడు అబు ఖాసిం కాశ్మీరీ. ఉగ్రవాద సంస్థలో ఇతడిని అబు ఖాసిం అని పిలుస్తారు. అబు ఖాసీం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతానికి చెందినవాడు. 1999లో సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు వెళ్ళాడు. అక్కడే లష్కరే తోయిబాలో చేరి, అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థలో కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. అబు ఖాసిం, జమ్మూ కాశ్మీర్‌లో అనేక రక్తపాతాలకు ప్రణాళికలు రచించాడు. రాజౌరి జిల్లాలోని దాన్గ్రిలో జరిగిన ఉగ్రవాద దాడికి ఇతడే మాస్టర్‌మైండ్ అని భద్రతా దళాలు గుర్తించాయి. ఈ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారు.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఎవరు?

పీర్ పంజాల్ ప్రాంతం గుండా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడం, వారికి ఆయుధాలు, నిధులు సమకూర్చడం వంటి బాధ్యతలను ఇతడు పర్యవేక్షించేవాడు. అయితే పాకిస్థాన్‌లోని రావల్పిండిలో తలదాచుకున్న అబు ఖాసిం, అక్కడ సురక్షితంగా ఉండలేకపోయాడు. 8 సెప్టెంబర్ 2023న మసీదులో నమాజ్ ముగించుకుని వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఇతనిపై కాల్పులు జరిపారు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో అబు ఖాసిం అక్కడికక్కడే మరణించాడు.

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉగ్రవాది అబు సైఫుల్లా ఖాలిద్ కూడా ఒకడు. జమాత్-ఉద్-దావా ఉగ్రవాద సంస్థలో అబు సైఫుల్లా వ్యూహాత్మకమైన కమాండర్‌. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన అబు సైఫుల్లా ఖాలిద్, లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడు. ఉగ్రవాద శిక్షణా శిబిరాల పర్యవేక్షణ, కొత్త రిక్రూట్‌లకు ఆయుధ శిక్షణ ఇవ్వడం, సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాట్లు ప్లాన్ చేయడంలో ఇతడు సిద్ధహస్తుడు. 2006ఏడాది నాగ్‌పూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి కుట్రలో కీలక పాత్ర పోషించాడు.

ఈ దాడికి వ్యూహరచన చేయడమే కాకుండా, ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు సమకూర్చాడు. ఫిబ్రవరి 2025లో అబు సైఫుల్లా ఖాలిద్‌ కూడా హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని ఒక రహస్య ప్రాంతంలో ప్రయాణిస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ఇతని వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మెరుపు దాడిలో అబు సైఫుల్లా ఖాలిద్‌ చనిపోయాడు. జహూర్ మిస్త్రీ, అబు ఖాసిం కాశ్మీరీల తర్వాత అబు సైఫుల్లా ఖాలిద్‌ హత్యతో లష్కరే తోయిబా నాయకత్వానికి పెద్ద దెబ్బ తిగిలిందనే చెప్పవచ్చు.

జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలో అత్యంత కీలకమైన కమాండర్లలో ఒకడు షాహిద్ లతీఫ్. ఇతడిని ‘బిలాల్’ అని కూడా పిలుస్తారు. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న గుజ్రాన్‌వాలా ఇతని స్వస్థలం. 1994లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం భారత్‌లోకి చొరబడిన లతీఫ్‌ ను జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాలు అరెస్టు చేశాయి. చెప్పాలంటే దాదాపు 16ఏళ్ల పాటు భారత జైలులో శిక్ష అనుభవించాడు. 2010లో శిక్షా కాలం ముగియడంతో భారత ప్రభుత్వం ఇతనిని వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌కు అప్పగించింది.

కానీ పాక్ వెళ్ళిన వెంటనే తిరిగి జైష్-ఎ-మొహమ్మద్‌‌లో చేరి కీలక బాధ్యతలు చేపట్టాడు. 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడితో షాహిద్ లతీఫ్ పేరు తెరపైకి వచ్చింది. చెప్పాలంటే.. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన నలుగురు ఉగ్రవాదులకు పాకిస్థాన్ లోపల ఉండి దిశానిర్దేశం చేసింది ఇతడే. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 11 అక్టోబర్ 2023లో షాహిద్ లతీఫ్ కూడా పాక్ గడ్డపైనే హతమయ్యాడు. మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడైన లతీఫ్ మరణం, జైష్ ఆపరేషన్లను కుదిపేసింది.

‘దురందర్’.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఎక్కడా చూసినా దురందర్ మేనియానే. దురందర్ సినిమా ఒక ఊపు ఊపేస్తుంది. వాస్తవానికి ఇది ఒక గూఢచారి కథ. అయితే ఇలాంటి కథలకు మన చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా దేశభక్తి, సాహసోపేతమైన నిర్ణయాలు, ఉత్కంఠ రేకెత్తించే మలుపులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. ఇప్పుడు ఈ కోవలోనే వచ్చిన ఒక అద్భుతమైన చిత్రం దురందర్. వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఉత్కంఠ రేకెత్తేంచేలా ఈ సినిమాను రూపొందించారు.

జహూర్ మిస్త్రీ ఉగ్ర కార్యకలాపాలు

చెప్పాలంటే సినిమా 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ సంఘటనతో మొదలవుతుంది. అయితే ఈ సంఘటన దేశ భద్రతా వ్యవస్థలో ఎలాంటి మార్పులకు దారి తీసిందో స్పష్టంగా చూపించారు. అలాగే 2001లో జరిగిన పార్లమెంట్‌ దాడి, తర్వాత ‘ఆపరేషన్ దురందర్’ అనే సీక్రెట్ మిషన్ ప్రతిపాదనలు, ఈ మిషన్ ఉద్దేశం ఏంటీ అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. మొత్తానికి పాకిస్తాన్‌లోకి చొరబడి, అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌ని ఛిన్నాభిన్నం చేయడమే దురందర్ లక్ష్యంగా కథ సాగుతుంది.

సీన్ కట్ చేస్తే.. IC-814 కందహార్ హైజాక్ సంఘటన భారత చరిత్రలో ఒక చేదు జ్ఞాపకం. మన ప్రయాణికులను కాపాడుకోవడానికి ప్రభుత్వం ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌కు వెళ్లి దేశంపైనే మరిన్ని దాడులు చేశారు. ఆనాడు అనుభవించిన నిస్సహాయత, ఇప్పుడు ఆ ఉగ్రవాదులు చనిపోయిన తీరు వాస్తవిక ఘటనలకు అద్దం పడుతోంది. వాస్తవానికి ఒకప్పుడు భారత్‌పై దాడులు జరిగితే నిరసన తెలిపేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. శత్రువును వారి ఇంట్లోకి వెళ్లి కొట్టే రోజులు వచ్చాయి. చెప్పాలంటే.. దేశ భద్రత వ్యవస్థలో భారీ మార్పు వచ్చింది. దౌత్య పరమైన పరిమితులను దాటి దేశం కోసం షాడో ఏజెంట్స్ పోరాడుతున్నారు ముంబై దాడులు, పఠాన్‌కోట్, పుల్వామా దాడుల్లో వీర జవాన్లు, అమాయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దాడులకు వ్యూహరచన చేసిన వారు పాకిస్తాన్‌‌లో రాజభోగాలు అనుభవిస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చులేదు. అందుకే దేశంపై కత్తి పడితే… అది పాకిస్తాన్ అయినా, వేరే ఏదేశమైనా చూస్తూ ఊరుకోలేక ఆపరేషన్ చేపట్టి, దెబ్బకొట్టింది.

చెప్పాలంటే.. ఉగ్రవాదుల గురించి చెప్పడం వేరు. ఆ ఉగ్రవాద వ్యవస్థను వేళ్లతో సహా పెకిలించడం వేరు. బయట కాల్పులు జరపడం ఒక ఎత్తైతే, శత్రువుల కంచుకోటలైన జైళ్లలోకి, హై-సెక్యూరిటీ ఆసుపత్రుల్లోకి చొరబడి వారిని అంతం చేయడయే ఆపరేషన్. ఆ అసాధ్యమైన మిషన్‌ను భారత్ సర్కార్ ఏంటో ప్రపంచానికి చూపించింది. వాస్తవానికి ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ ఒక ‘ఐడియాలజీ’ చావదు. ముఖ్యంగా ‘గూఢచారి’ అనేది ఒక వ్యవస్థ అని నిరూపించారు భారత ఏజెంట్లు. వాస్తవానికి ఒకప్పుడు గూఢచారులు కేవలం సమాచారం మాత్రమే పంపేవారు.

కానీ ఉగ్రవాదులను వేటాడంలో నిఘా ఏజెన్సీలు కొత్త తరం వ్యవస్థను, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాయి ఉదాహరకు ఉగ్రవాది మక్కీ మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయినా, అది దేశ వ్యతిరేక శక్తులకు ఒక బలమైన హెచ్చరికగా మారింది. భద్రతా దళాల రక్షణలో ఉన్న ఉగ్రవాదులను కూడా వారి సొంత గడ్డపైనే వేటాడం చూస్తుంటే, భారత్ రక్షణ నుంచి అఫెన్సివ్ మోడ్‌లోకి మారిందని చాటిచెప్పింది. భారత ప్రభుత్వం చేపట్టిన షాడో ఏజెంట్ వ్యవస్థ ఉగ్రవాదులకు సవాల్‌గా మారిందనే చెప్పొచ్చు. ఉగ్రవాదులు చనిపోతే కొత్తవారు వస్తారని భావించే ISIకు ఈ ఆపరేషన్ ఊపిరాడకుండా చేసింది. ఎందుకంటే కొత్తగా చేరే వారికి భారత్ చేపట్టిన షాడో ఏజెంట్ ఆపరేషన్ భయం మొదలైంది.

‘భారత్‌పై కత్తి కడితే.. చుట్టూ సైన్యం ఉన్నా చావు తప్పదు’ అనే భయాందోళన ఉగ్రవాద ఐడియాలజీని వేళ్లతో సహా కదిలించింది. ప్రత్యేక ఆపరేషన్ అమాయకులకు నష్టం కల్గకుండా కేవలం టార్గెట్‌ను మాత్రమే ఫినిష్ చేయడం. ఉగ్రవాదుల కమ్యూనికేషన్, బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి వారిని ఒంటరి చేయడం. పాక్ లోపల ఉన్న ఉగ్రవాదులను తమ పక్కనున్న వాడే గూఢచారి ఏమో అని భయపడేలా చేయడం. ఇప్పుడు ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. భారత గూఢచారులు పాక్‌లో ఉన్నారేమోనంటూ సెర్చింగ్ చేపట్టారు. ఇలా పాక్‌ వెన్నులో ఆపరేషన్ దురందర్ వణుకు పుట్టించింది. మొత్తానికి దురందర్ మిషన్ లక్ష్యం నెరవేరింది.. అది కేవలం వ్యక్తులను చంపడం కాదు, భారత్ జోలికి వస్తే అంతం ఎలా ఉంటుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించడం.

మొత్తానికి పాకిస్తాన్‌లో జరుగుతున్న వరుస ఉగ్రవాదుల మరణాలు సంచలనం కలిగిస్తున్నాయి. దీని వెనుక అసలు కారణాలు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.