
శివ దీక్ష అనేది పరమశివుని ఆరాధనలో భాగంగా చేపట్టే ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ. ఇది శరీర, మనస్సు, ఆత్మ శుద్ధీకరణకు దోహదపడుతుంది. ఈ కథనంలో శివ దీక్ష యొక్క వివరాలు, ప్రాముఖ్యత తెలుసుకుందాం.
Key Points
శివ దీక్ష: పరమశివుని సాక్షాత్కారానికి ఒక మార్గం.
శరీరానికి నియమం, మనస్సుకు శాంతి, ఆత్మకు పవిత్రతను ఇస్తుంది.
మహాశివరాత్రి, కార్తీకమాసం వంటి సందర్భాల్లో ఆచరించవచ్చు.
మండల దీక్షలలో ఒకటైన శివ దీక్ష, జనన-మరణ చక్రం నుండి విముక్తినిస్తుంది.
శివ దీక్ష అంటే ఏమిటి?
“దీక్ష” అనే పదంలో “ది” – దివ్యత, “క్ష” – క్షమ, క్షమించబడే గుణం అంటే దివ్యత్వం పొందడానికి భక్తుడు స్వయంగా తీసుకునే నియమబద్ధమైన ప్రతిజ్ఞ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పరమశివుడిని చేరుకునే ఒక మార్గం
శివ దీక్ష అనేది పరమశివుడిని చేరుకునే ఒక మార్గం. ఇది శరీరానికి నియమం, మనస్సుకు శాంతి, ఆత్మకు పవిత్రతను ఇస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శివదీక్ష అంటే భగవాన్ శివుడిని ధ్యానిస్తూ, నియమాల ప్రకారం భక్తితో అనుసరించే ఒక శ్రద్ధాభక్తులతో కూడిన ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ. దీన్ని అనేక మంది శైవ భక్తులు ప్రత్యేక సందర్భాల్లో, ముఖ్యంగా మహా శివరాత్రి, కార్తీక మాసం, లేదా శ్రీశైల యాత్ర సందర్భంలో ఆచరిస్తారు అని చిలకమర్తి తెలిపారు.
భగవద్భక్తిని కలిగి ఉండి, దీక్షతో పూజాదులు ఆచరించుట ఉత్తమమైన పద్ధతి. ఐహిక సుఖములను పొందటానికి, ఆధ్యాత్మిక భావ సంపదను పెంపొందించుకోవటానికి, ఈ జనన–మరణ రూపమైన సంసారచక్రం నుంచి మోక్షాన్ని పొందటానికి దీక్షలు ఉపకరిస్తాయి.
శివ దీక్ష యొక్క ప్రయోజనాలు
ఒక్కరోజు దీక్ష మొదలు ఆజన్మాంత దీక్ష వరకు అన్నీ దీక్షలే. కారడవులలో కందమూలాలు తింటూ ఆచరించే తపస్సూ దీక్షే. కానీ ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే మనకు తపస్సుల వంటి దీక్షలను ఆచరించటం సాధ్యం కాదు. అందుకే ‘సూక్ష్మంలో మోక్షం’ అన్నట్లుగా మండల దీక్షలు అవతరించాయి అని చిలకమర్తి తెలిపారు.
‘మండలదీక్ష’ సంప్రదాయాన్ని అనుసరించి ఆచరించబడుతున్న దీక్షలలో శివుడు అలంబనంగా చేసుకొని ఆచరించబడేదే ‘శివదీక్ష’. ఈ కలియుగమున కూడా ఎందరో భక్తులు శివదీక్షను స్వీకరించి తరించినట్లు చెప్పబడుచున్నది.
బాదామి చాళుక్య రాజు రెండవ విక్రమాదిత్యుడు సుమారు క్రీ.శ. 660 సంవత్సరములో శివదీక్షను మండలదీక్షగా స్వీకించి తరించినట్లు, దీక్ష నిచ్చిన గురుస్వామి శ్రీ సుదర్శనాచార్యునికి వంగూరు తాలూకా (నేటి మహబూబ్‌నగర్ జిల్లా) పరుంకల్ అను గ్రామాన్ని గురు దక్షిణగా ఇచ్చినట్లు అలంపూర్ మండలములోని ఆముదాలపాడులో యిటీవల లభించిన విక్రమాదిత్యుని తామ్రశాసనము తెలుపుచున్నది.
శివ దీక్షను స్వీకరించడానికి ఉత్తమమైన ప్రదేశాలు
ఇట్టి మహత్తర శివదీక్షను ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన, ఆదిశంకరాచార్యులు, సిద్ధనాగార్జునుడు మొదలైన ఎందరో సిద్ధపురుషులచే పూజింపబడిన శ్రీ మల్లికార్జున మహాలింగమునకు నిలయమై, పదునెనిమిది మహాపురాణములలోనూ, పలు సంస్కృత గ్రంథములలోనేకాక, ఆంధ్ర, కన్నడ, తమిళ, మరాఠీ, గ్రంథములలో కూడా ఎంతగానో కొనియాడబడిన శ్రీశైల మహాక్షేత్రమున స్వీకరించుట మిక్కిలి శ్రేష్ఠము.
అట్లు సాధ్యపడని వారు, మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగములు గల ఆలయములలో గాని, స్థానిక శివాలయములలో గాని, ఇంతకు పూర్వం శివదీక్షను స్వీకరించిన వారితో లేదా శివార్చకులతో మాలాధారణ చేయించుకోవచ్చును అని చిలకమర్తి తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000
శివ దీక్ష ఆధ్యాత్మిక ప్రగతికి, మోక్షానికి దోహదపడుతుంది. శివుని భక్తితో నియమాలను పాటిస్తూ దీక్షను ఆచరించడం ద్వారా ఆత్మీయ శాంతిని పొందవచ్చు.


