
📌 Key Points
- హైదరాబాద్‌లో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సౌకర్యాన్ని ప్రారంభించిన రాజమౌళి.
- అన్నపూర్ణ స్టూడియోస్, మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా ఈ ల్యాబ్‌ను స్థాపించాయి.
- రాజమౌళి తన ‘వారణాసి’ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించనున్నారు.
- భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి సాంకేతికత అందుబాటులోకి రావడం ఒక గొప్ప ముందడుగు.
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి హైదరాబాద్‌లో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సౌకర్యాన్ని ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా రాజమౌళి తన కొత్త సినిమా విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్‌లో మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ప్రారంభం
SS Rajamouli: భారతీయ చలనచిత్ర రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా, హాలీవుడ్ టెక్నాలజీ పార్ట్‌నర్ యానిమాట్రిక్ ఫిలిం డిజైన్‌తో కలిసి దేశంలోనే అత్యంత అధునాతనమైన ‘A&M మోకాప్ ల్యాబ్’ (Motion Capture Facility)ను ప్రారంభించాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఫిబ్రవరి 20న ఈ సౌకర్యాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాబోయే భారీ చిత్రం ‘వారణాసి’ లోని కీలక సన్నివేశాలను ఈ మోషన్ క్యాప్చర్ సాంకేతికతతోనే చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. గతంలో ‘బాహుబలి, ఈగ’ వంటి చిత్రాల సమయంలో ఇలాంటి టెక్నాలజీ భారత్‌లో ఉండి ఉంటే, వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేవాడినని ఆయన పేర్కొన్నారు. భారతీయ కథనాల స్థాయి, విజన్‌ను ఈ టెక్నాలజీ ఎలా మార్చబోతోందో కూడా ఆయన వివరించారు.
భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాల లెగసీని పూర్తి చేసిన సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మోషన్ క్యాప్చర్ సదుపాయాన్ని ప్రారంభించడం విశేషం. భవిష్యత్తులో భారతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్, గేమ్ డెవలపర్స్, యానిమేషన్ స్టూడియోలతో కలిసి ప్రపంచ స్థాయి నాణ్యత, వేగంతో ప్రొడక్షన్ సేవలు అందించాలనే లక్ష్యంతో స్టూడియో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. భారతీయ సినిమా ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టంగా భావించవచ్చు. ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనే కల భారతీయ దర్శకులకు ఎప్పటి నుంచో ఉంది. కానీ అత్యాధునిక సాంకేతిక వసతులు కొరతగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్ అడ్వెంచర్ నుంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చని అన్నారు. శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే దేశంలోనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలు అవసరం. మిహిరా ల్యాబ్స్ లక్ష్యం ఎప్పుడూ ఫిల్మ్ మేకర్లకు అంతర్జాతీయ ప్రమాణాల టూల్స్ అందించడం. అన్నపూర్ణ స్టూడియోస్, Animatrikతో కలిసి ఈ లక్ష్యాన్ని నిజం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
రాజమౌళి ‘వారణాసి’ చిత్రానికి కొత్త టెక్నాలజీ
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘Avengers: Endgame’, ‘Spider-Man: No Way Home’ వంటి చిత్రాల్లో పనిచేసిన యానిమాట్రిక్ ఫిలిం డిజైన్ అధ్యక్షుడు అండ్ CTO బ్రెట్ ఇనెసన్ మాట్లాడుతూ.. భారతీయ కథనాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి సాంకేతికతతో మరింత గొప్పగా రూపుదిద్దుకోనున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ మోషన్ క్యాప్చర్ సదుపాయం ప్రారంభం కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇది భావోద్వేగపూరితమైన, విస్తృతమైన కథలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు.
భారతీయ సినిమాకు సాంకేతిక విప్లవం
అన్నపూర్ణ స్టూడియోస్ CTO సీవీ రావు ఈ ఫెసిలిటీ వెనుక ఉన్న సాంకేతిక సామర్థ్యం, గ్లోబల్ సహకారం గురించి తెలుపుతూ.. ‘‘A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌లో 60 అడుగులు x 40 అడుగులు x 30 అడుగుల క్యాప్చర్ వాల్యూమ్ ఉంటుంది. ఇది హై-ప్రెసిషన్ ఆప్టికల్ ట్రాకింగ్, సబ్-మిల్లీమీటర్ అక్యురసీ, రియల్‌టైమ్ స్ట్రీమింగ్ టెక్నాలజీలను కలిపి, సెట్లో ఊహించిన విజన్‌ను ఫైనల్ ఎగ్జిక్యూషన్‌తో కలిపేలా చేస్తుంది. అలాగే ఈ వ్యవస్థ మాడ్యులర్ డిజైన్‌తో ఉండటం వల్ల అవసరానికి అనుగుణంగా విస్తరించుకోవచ్చు లేదా ఎక్కడైనా విడదీసి మళ్లీ అమర్చుకునే సౌలభ్యం ఉంది. ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఫెసిలిటీ దర్శకులకు ప్రీ-విజువలైజేషన్ టూల్‌గా పనిచేస్తూ, షూటింగ్ ప్రారంభానికి ముందే క్రియేటివ్ విజన్‌ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఇస్తుంది. దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌లో కెమెరా బ్లాకింగ్, లెన్స్ ఎంపిక, కెమెరా మూవ్‌మెంట్స్, ఫ్రేమ్‌రేట్స్ వంటి అంశాలను ముందుగానే పరీక్షించవచ్చు. దీనివల్ల టెక్నికల్, లాజిస్టికల్ అవసరాలను ముందే అంచనా వేసి, లైవ్ షూట్‌లో సమయం, ఖర్చును తగ్గించుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు.
ఈ అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సౌకర్యం భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేస్తుందని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మన చిత్రాల నాణ్యతను పెంచడానికి, ప్రపంచ స్థాయిలో పోటీ పడటానికి సహాయపడుతుంది.


