|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహిళా ఉద్యోగాలపై సుప్రీం సంచలన తీర్పు! నెలసరి సెలవులతో ముప్పు?

Published: 13-03-2026, 4:05 AM
మహిళా ఉద్యోగాలపై సుప్రీం సంచలన తీర్పు! నెలసరి సెలవులతో ముప్పు?
  • మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
  • మెనుస్ట్రువల్ లీవ్ చట్టం మహిళలను బలహీనులుగా చూసేందుకు దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
  • కేరళ ప్రభుత్వం, కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే పీరియడ్ సెలవులు ఇస్తున్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
  • నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కని, విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు అందించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది.

రుతుస్రావ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు తప్పనిసరి సెలవులు ఇస్తే వారి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఉద్యోగాలపై నెలసరి సెలవుల ప్రభావం

రుతుస్రావ సెలవుల (మెనుస్ట్రువల్‌ లీవ్‌) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే అది వారి ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. మేము ఇలాంటి నిబంధనను తప్పనిసరి చేస్తూ చట్టం చేస్తే ఇకపై మహిళలకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని, యజమానుల మనస్తత్వం మీకు తెలియదు అంటూ సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ (CJI Surya Kant) కీలక వ్యాఖ్యలు చేశారు. మెనుస్ట్రువల్‌ లీవ్‌‍ను (Menstrual Leave) చట్టంగా తీసుకువస్తే మహిళలను పురుషుల కంటే తక్కువగా చూడటానికి దారి తీసే ప్రమాదం ఉందని, అలాంటి చట్టం వల్ల మహిళలు బలహీనులన్న భావన ఏర్పడటంతో పాటు అనవసర భయాలను సృష్టించే అవకాశముందన్నారు. విద్యార్థినులు, ఉద్యోగాల్లో ఉన్న మహిళల తప్పనిసరి మెనుస్ట్రువల్‌ లీవ్‌ ఇచ్చేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‍పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఇలాంటి వాటితో ఉద్యోగాలు చేసుకునే మహిళల కేరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఈ పిటిషన్‍ను తోసిపుచ్చారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా కేరళ ప్రభుత్వంతో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే మహిళలకు పీరియడ్ సమయంలో సెలవులు ఇస్తున్నాయనే విషయాన్ని సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంషాద్ కోర్టు దృష్టికి తీసుకురాగా ఇది స్వచ్ఛంద చర్యలు అని సీజేఐ చెప్పారు. ఈ విషయంలో అవగాహన కల్పించడం, విషయ సున్నితత్వాన్ని కలిగించడం వేరు. కానీ పీరియడ్స్ సమయంలో సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తెచ్చిన వెంటనే ఎవరూ మహిళలకు ఉద్యోగులు ఇవ్వరని సీజేఐ వ్యాఖ్యానిచారు.

ప్రస్తుతం నెలసరి సెలవుల పరిస్థితి

అయితే నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు గత జనవరిలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యతా హక్కులో ఇది అంతర్భాగమని తీర్పులో పేర్కొంది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్స్, టాయిలెట్ల సౌకర్యాన్ని కల్పించడంలో విఫలమైతే ప్రభుత్వాన్ని జవాబుదారీతనంగా చేస్తామని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

మొత్తానికి, నెలసరి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మరింత అవగాహన, సున్నితత్వం అవసరమని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.