
📌 Key Points
- తెలంగాణలో జూన్ 25న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రారంభమైంది.
- జూలై 24 వరకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలు సేకరిస్తారు.
- బీఎల్‌ఓలు ప్రతిరోజూ కనీసం 50 ఇళ్లను సందర్శించి ఫారాలను అందిస్తారు.
- ఓటర్లు https://voters.eci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ వివరాలు సరిచేసుకోవచ్చు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ మొదలైంది. జూన్ 25 నుండి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వే జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో పాల్గొనడం అత్యవసరం.
ఓటర్ల జాబితా సవరణ: కీలక వివరాలు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25వ తేదీ నుంచే ఈ కీలక సర్వే అధికారికంగా ప్రారంభమైంది. జూలై 24వ తేదీ వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా సాగే ఈ ఓటర్ల వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఈ సర్వే కోసం జిల్లాల వారీగా ఉన్న ఓటర్ల వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ పత్రాలను యంత్రాంగం ఇప్పటికే ముద్రించింది. ప్రతి ఓటరు పేరు మీద రెండు కాపీలను సిద్ధం చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్లకు ఈ ఫారాలను ఇంగ్లిష్‌లో అందించనుండగా, మిగిలిన అన్ని జిల్లాల్లో తెలుగు భాషలో పంపిణీ చేయనున్నారు.
బూత్ లెవెల్ అధికారులు (BLO) ప్రతిరోజూ తమ పరిధిలోని కనీసం 50 ఇళ్లను సందర్శించి ఈ పత్రాలను ఓటర్లకు చేరవేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఈ ఫారాలను అందించాలనేది అధికారుల టార్గెట్.
ఇంటింటి సర్వే విధానం: బీఎల్‌ఓల పాత్ర
ఇంటింటికీ వచ్చే బీఎల్‌ఓలు ఓటర్లకు ఈ ఫారాలను అందజేసి, వాటిని ఎలా పూరించాలో వివరంగా వివరిస్తారు. ఇందుకోసం అధికారులు కనీసం మూడుసార్లు ఓటరు ఇంటికి వెళ్తారు. ఓటర్లు భర్తీ చేసిన రెండు పత్రాలలో ఒకదానిని బీఎల్‌ఓలు తమ వద్ద ఉంచుకుంటారు. రెండో పత్రాన్ని ఓటరుకు ‘రసీదు’ గా తిరిగి ఇచ్చేస్తారు. పూరించిన ఈ పత్రాలను వచ్చే నెల (జూలై) 24వ తేదీ లోపు ఓటర్లు తప్పనిసరిగా బీఎల్‌ఓలకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై మండలాల వారీగా సిబ్బందికి ముందే శిక్షణ ఇచ్చారు.
ఇంటికి వచ్చే అధికారులకే కాకుండా, డిజిటల్ పద్ధతిలోనూ ఈ సవరణలు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఓటర్లు నేరుగా అధికారిక పోర్టల్ https://voters.eci.gov.in లోకి లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా ఫారాలను పూర్తి చేయవచ్చు. గురువారం నుంచే ఈ లింక్ అందుబాటులోకి రానుంది.
ఇందుకోసం గతంలో లింక్ చేసిన మొబైల్ నంబర్ లేదా ఎపిక్ (EPIC) కార్డ్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలోని వివరాలు, సంబంధిత గుర్తింపు కార్డులోని పేరు కచ్చితంగా సరిపోలిన వారికి మాత్రమే ఈ ఆన్‌లైన్ వెరిఫికేషన్ సదుపాయం వర్తిస్తుంది.
ఆన్‌లైన్ వెరిఫికేషన్: సులభ మార్గాలు
మ్యాపింగ్, అన్‌మ్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా బీఎల్‌ఓలు ఓటర్లకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. ఓటర్ల ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలున్నా, లేదా మీ ఇంటికి బీఎల్‌ఓలు రాకపోయినా వెంటనే అధికారుల టోల్ ఫ్రీ నంబర్ 1950 కి కాల్ చేసి ఫిర్యాదు లేదా సమాచారం అందించవచ్చు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ఓట్ల లెక్కింపు, సవరణలను పర్యవేక్షించేందుకు పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను (BLA) రంగంలోకి దించాయి. బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందే సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దీనికోసం ప్రధాన పార్టీలు తమ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 49,018 మంది బీఎల్‌ఏల జాబితాను ఆయా పార్టీలు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి అలాగే స్థానిక నియోజకవర్గ ఎన్నికల అధికారులకు సమర్పించాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి బీఎల్‌ఓల సహాయం తీసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. జూలై 24వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి, మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది.


