
📌 Key Points
- జీఎస్టీ పంపిణీలో వ్యత్యాసాలతో దక్షిణాది రాష్ట్రాల అసంతృప్తి.
- 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర, దక్షిణాల మధ్య అగాథాన్ని పెంచింది.
- జనాభా వృద్ధి రేటులో హెచ్చుతగ్గులు అసంతృప్తికి కారణం కావచ్చు.
- 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరింత వివాదం తలెత్తే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. జీఎస్‌టీ పన్నుల పంపిణీ మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు ఈ అసంతృప్తికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
జీఎస్‌టీతో పెరుగుతున్న అసంతృప్తి
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అనుసరిస్తున్న పలు విధానాల వలన దేశ ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య దూరం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రధానంగా వస్తువులపై పన్ను సేకరణ మొత్తాలను ఒకే గొడుగుకిందికి తీసుకొచ్చిన జీఎస్‌టీ విధానం 101 రాజ్యాంగ సవరణ ద్వారా 2016 సంవత్సరం నుండి అమలులోకి వచ్చినది.
ఇప్పటికే ఈ పన్ను సేకరణ మొత్తాలను వివిధ రాష్ట్రాలకు చేస్తున్న పంపిణీలో వ్యత్యాసాలు ఉన్నాయి.. దీంతో దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన అసంతృప్తికి గురి అవుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల డీలిమిటేషన్ పునర్విభజనను 2011 జనాభా ప్రాతిపదికగా చేయడంతో పుండు మీద కారం చల్లినట్టు దేశ ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అగాథం ఏర్పడ డానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు అయింది.
రాజ్యాంగంలోని 82 (170) ఆర్టికల్ చట్టం ద్వారా దేశంలో నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదటిసారి 1951 జనాభా గణాంకాల ఆధారంగా చేపట్టారు.. 1952లో 489 లోకసభ స్థానాలను ప్రకటించారు. రెండోసారి 1963లో 489 నుండి 522కు పెంచుతూ విభజన జరిగింది. ఇక మూడవ పర్యాయం 1973లో 522 నుండి 545 పార్లమెంటు సభ్యుల స్థానాలుగా పెరిగాయి. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అధిక ప్రయోజనం పొందనున్నాయని, అలా పొందకుండా నిరోధించడానికి చట్ట సవరణ ద్వారా డీలిమి టేషన్ ప్రక్రియను నిలిపివేశారు.. తిరిగి 1986 ఆర్టికల్ 84 సవరణ ద్వారా నియోజకవర్గాల డీలిమిటేషన్ పునర్విభజన ప్రక్రియను 2026 వరకు వాయిదా వేశారు. కాబట్టి ఈ సంవత్సరం జనాభాను అనుసరించి నియోజకవర్గాల డీలి మిటేషన్ జరగబోతున్నది.
డీలిమిటేషన్ పునర్విభజన – వివాదాలు
ఈ నేపథ్యంలో దేశ ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య జనాభా ఉత్పత్తి వృద్ధి రేటులో గణనీయంగా హెచ్చు తగ్గులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా ఏ క్షణంలోనైనా అసంతృప్తి భగ్గున మండడానికి సిద్ధంగా వుంది. 2026లో వివిధ రాష్ట్రాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఈ వెలుగులో ప్రధాన కార్యకారణాలను పరిశీలించాల్సి ఉంది. అందులో ప్రధానమైనది రాష్ట్రాల మధ్య TFR (Total fertility Rate) సంతాన ఉత్పత్తి వృద్ధి నిష్పత్తి క్రమాన్ని అవగతం చేసుకోవాలి.
అక్షరాస్యత ఉన్నత చదువులు, కుటుంబ సంక్షేమం అభివృద్ధి తద్వారా సమాజ వృద్ధి పెంపొందడం వలన దక్ష ణాదిలో జనాభా తగ్గిపోయినది. ప్రజలు వస్తు సేవలను వినియోగించుకోవడం ద్వారా అధిక వస్తు సేవల పన్నులు చెల్లిస్తున్నారు. ఇదే కాలంలో అటు ఉత్తర భారత రాష్ట్రాలలో నిర క్షరాస్యత, వెనుకబాటు మూలంగా అధిక జనాభా ఉంది. జనాభా నిష్పత్తి ఆధారంగా జీఎస్టీ సంపద పంపిణీలో అధిక నిధులను దేశ ఉత్తర రాష్ట్రాలు పొందుతున్నవి. జనాభా తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధుల పంపిణీ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నిధుల పంపిణీలోనూ, నియోజకవర్గాల పునర్విభజనలోనూ వివక్ష కొనసాగడం తద్వారా రానున్న కాలంలో దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా పరిణమించనున్నది. దక్షిణాదికి చెందిన ఆయా రాష్ట్రాలలోని అధికార, విపక్ష పార్టీలన్నీ తాత్కాలిక ప్రయోజనాలను పక్కనపెట్టి ఏకం కావలసిన తరుణం ఆసన్నమైనది.
2026లో జరగబోయే మార్పులు
ఉత్తర భారతంలో విస్తరించిన బీజేపీ, దక్షిణాదిలో ఎలాగైనే సరే.. జండా ఎగరవేయాలని తహతహలాడుతున్నది. అందులో భాగంగానే ఎన్నికల సంఘం ద్వారా రాష్ట్రాలలో “సర్” అమలు పరుస్తున్నది. దీని ద్వారా ఎన్నికల సంఘం దేశంలో ముందు ఎప్పుడూ లేనంత తీవ్ర విమర్శలను వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎదుర్కొంటున్నది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాల పిల్లి మెడలో గంట ఎవరు కడతారో..? ఎదిరి చూడవలసి ఉన్నది.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల లోకసభ స్థానాలు మొత్తం 850 వరకు పెరగనున్నాయని తెలుస్తున్నది. అంటే రాష్ట్రాలలో గణనీయంగా లోకసభ స్థానాలు పెరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో కొద్దో గొప్పో పెరుగనున్నాయి.. ఈ పరిస్థితులను రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికలలో తమ ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవడానికి, ఇప్పటినుండే కారాలు, మిరియాలు నూరుతున్నాయి. ఒకవైపు 2011 జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన లోకసభ సమా వేశాలలో ప్రవేశ పెట్టే బిల్లును లోకసభ సభ్యులకు చేర వేశారు. మరోవైపు 2026 జనాభా ఆధారంగా 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని సదరు బిల్లులో చేర్చారు. రానున్న కాలంలో దేశంలో ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య దూరం పెరగడమే కాకుండా, దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.
2026లో జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, అది దేశ రాజకీయాలలో పెను మార్పులకు దారితీయవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.


