
కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న వెంట్రప్రగడ గ్రామం అనేక పురాతన ఆలయాలకు నిలయం. నామేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. ఈ ఆలయాల చరిత్ర, నిర్మాణ శైలి గురించి తెలుసుకుందాం.
Key Points
వెంట్రప్రగడలోని ప్రాచీన ఆలయాల చరిత్రను తెలుసుకుందాం.
శ్రీ నామేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ, శ్రీరామాలయాల ప్రాముఖ్యత.
కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్పం, శిల్పకళల అద్భుతాలు.
ఈ ఆలయాల దివ్యత, భక్తులకు అనుగ్రహం.
వెంట్రప్రగడ గ్రామం: ఒక పరిచయం
దైవ భక్తి అన్నది మన హిందూ సమాజంలో యుగయుగాలుగా వస్తున్న వారసత్వ విశ్వాసం. మన సంస్కృతిలో చెట్టు, పుట్ట, జీవి, జంతువూ అన్నీ దైవస్వరూపాలే! ముక్కోటి దేవతలూ మనకి ఉన్నారు. వీటిలో కొన్నింటికి ఆలయాలు నిర్మించి, నిత్య పూజ లు చేస్తూ ముల్లోకాధిపతి అయిన దేవదేవుని పట్ల మన భక్తిని ప్రదర్శిస్తున్నాం. ఈ కారణంగా ప్రతి గ్రామంలో ఒక పురాతన ఆలయం కనపడుతుంది. పలు కారణాల వల్ల ఆ ఆలయాలు గ్రామాలలో నిర్మించినట్లు తెలుస్తోంది.
హిందూ ధర్మం, పురాణ ఇతిహాసాల అర్థం పరమార్థం సమాజ అట్టడుగు స్థాయి వరకు అంటే విద్యా గంధం అంతగా లేని పల్లె ప్రజల వరకు చేరాలన్నది ముఖ్యమైన అంతరార్థం, ప్రయాణికులు, బాటసారులు, భగవంతుని సందర్శించుకోవడం మరొక సంబంధిత అంశం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
యుద్ధ సమయాలలో సైనికులు రక్షణ కవచంగా ఆలయాలను ఉపయోగించుకొన్నట్లు చరిత్రలో పేర్కొనబడినది. కారణం ఏదైనా గత కాల పాలకులు అనేక విషయాలను పరిగణలోనికి తీసుకొని క్షేత్ర ప్రాధాన్యతలను తెలుసుకొని ఆలయాలను నిర్మించారని తెలుస్తోంది. అలాంటి ఒక గ్రామం కృష్ణా జిల్లాలోని గుడివాడకు సమీపంలో ఉన్న వెంట్రప్రగడ.
ఈ చిన్న ఊరిలో పురాతన, నూతన ఆలయాలు కనిపిస్తాయి. శ్రీ నామేశ్వర స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, శ్రీ గంగమ్మ తల్లి ఆలయం, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం.. ఇలా మరికొన్ని చిన్న ఆలయాలు కూడా కనపడతాయి. వీటిలో ముఖ్యమైనవి శ్రీ నామేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహ, శ్రీ రామాలయం.
శ్రీ నామేశ్వర స్వామి ఆలయం
ప్రధాన ఆలయాలు మరియు వాటి ప్రాముఖ్యత
ఈ ఆలయం సంపూర్ణ చరిత్ర అందుబాటులో లేదు. స్థానికంగా వినిపించే గాథలే ఆధారం. ఆలయ దేవీ దేవతల సన్నిధులు మాత్రం ఈ ఆలయ నిర్మాణం పదవ శతాబ్ద కాలంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. చాళుక్యులు, రెడ్డిరాజులు, రాష్ట్రకూటులు, కాకతీయ, గజపతుల, విజయనగర పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీరంతా ఆలయాభివృద్ధికి విశేష కృషి చేసినట్లు తెలుస్తోంది.
ఆలయ మండప, పరివార దేవతల సన్నిధులు, ఇతర నిర్మాణాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ముఖ్యంగా అనేక ఆలయాలలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి సన్నిధి కాకతీయుల ప్రాబల్యాన్ని సూచిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కాకతీయులు శైవ మతాభిమానులు. వారు శైవాన్ని ప్రభోదించడమే కాకుండా అనేక ఆలయాలలో శ్రీ కాలభైరవ, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి సన్నిధులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నేటి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని అనేక శివాలయాలలో వీరి సన్నిధులు కనిపిస్తాయి. చిన్న గుట్ట మీద నిర్మించిన ఈ ఆలయానికి ఎలాంటి రాజగోపురం, ఇతర ఆకర్షణీయ శిల్పాలు, నిర్మాణాలు కనిపించవు.
పచ్చని దేవతా వృక్షాలైన మారేడు, జమ్మి, ఉసిరి, మామిడి, పారిజాతం, గన్నేరు చెట్లతో పచ్చదనం సంతరించుకున్న వరిశుభ్ర ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్థంభం బలి పీఠాలు, శ్రీ కాలభైరవ సన్నిధి కనిపిస్తాయి. గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ఆలయం రాతి కన్నా అధిక శాతం ఇటుక, సున్నంతో నిర్మించడం అని చిలకమర్తి తెలిపారు.
ముఖమండపంపైన వ్యాస, వాల్మీకి, వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, శుక, గౌతమాది మహర్షుల మూర్తులను ఉంచడం ప్రత్యేకం. ముఖ మండపంలో నందీశ్వరుడు ఉపస్థితుడై స్వామి ఆనతి కోసం ఎదురు చూస్తుంటారు. తమిళనాడులో అనేక ఆలయాలలో నంది కుడి కాలు ఎత్తిన భంగిమలో కనపడతారు. మన రాష్ట్రంలో కూడా చాళుక్యుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాలలోని ఆలయాలలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన నందీశ్వరుడు కనపడతాడు. ఈ విధంగా కనిపించే నందీశ్వరుడు సజీవ రూపంగా విశ్వసిస్తారు భక్తులు.
చరిత్ర మరియు వాస్తుశిల్పం
కొమ్ముల ద్వారా పరమేశ్వర లింగ దర్శనం వరమ పుణ్యప్రదంగా భావిస్తారు. తమ కోర్కెలను నందీశ్వరుని చెవిలో చెప్పడం వలన అవి లయకారుని చేరుతాయని, శీఘ్రగతిన మనోభీష్టాలు నెరవేరుతాయి అని నమ్ముతారు.. ముఖ మండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు కనిపిస్తాయి. దక్షిణం పక్కన ఉన్న సన్నిధిలో శ్రీ వీరభద్ర స్వామి ప్రసన్న రూపంతో కొలువు తీరి ఉంటారు.
ఉత్తరం వైపున ఉన్న సన్నిధిలో శ్రీ భ్రమరాంబ దేవి సుందర నేత్రపర్వమైన అలంకరణలో వరదాయనిగా దర్శనం ప్రసాదిస్తారు. అమ్మవారి సన్నిధిలో మంగళ, శుక్ర వారాలు, నవరాత్రుల సమయంలో విశేష శ్రీచక్ర అర్చన జరుగుతుంది. అని చిలకమర్తి తెలిపారు. ప్రధాన గర్భాలయంలో శ్రీ నామేశ్వర స్వామి చిన్న పానవట్టం మీద ప్రత్యేకమైన బ్రహ్మ సూత్రం ధరించి లింగరూపంలో చక్కని చందన, విభూతి లోపాలతో శోభాయమానంగా భక్తుల కల్పతరువుగా దర్శనమిస్తారు.
అర్ధ మండపంలో శ్రీ గణపతి మరో నందీశ్వర విగ్రహం ఉంటాయి. నిత్య పూజలతో పాటు ప్రతి నెలా ఒక విశేష కార్యక్రమం జరుగుతుందీ. ఆలయంలో! వినాయక చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి, దసరా నవ రాత్రులు, కార్తిక మాస పూజలు, మహా శివరాత్రి ఉత్సవం అన్నీ ఘనంగా నిర్వహిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000
వెంట్రప్రగడ ఆలయాలు భక్తి, చరిత్ర, కళల అద్భుతమైన సంగమం. ఈ ఆలయాలను సందర్శించి, దేవతల ఆశీర్వాదం పొందండి.


